Finger Millet : తైద రొట్టె తింటే.. బీపీ, షుగర్, గుండె జబ్బులు మాయం!

by Javid Pasha |
Finger Millet : తైద రొట్టె తింటే.. బీపీ, షుగర్, గుండె జబ్బులు మాయం!
X

దిశ, ఫీచర్స్ : మనుషుల్లో శారీరక బలానికి, బలహీనతకు తద్వారా సంభవించే అనారోగ్యాలు, పలు ఇతర సమస్యలకు గల ప్రధాన కారణాల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఒకటి. ఒకప్పుడు (1990లలో, అంతకంటే ముందు) ఏజ్‌బార్ అయిన వ్యక్తుల్లో కూడా షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఎముకల బలహీనత, రక్తహీనత వంటివి పెద్దగా వచ్చేవి కావు. పైగా ఎక్కువకాలం జీవించే వారు. కనీస ఆయుఃప్రమాణం 80 ఏండ్లకు పైగానే ఉండేది. కొందరైతే వందేళ్ల తర్వాత కూడా జీవించే వారు. నాడు తీసుకునే ఆహారాలే ఇందుకు ప్రధాన కారణమని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో తైదలు (రాగులు)ఒకటి.

అసలైన పోషకాహారమిదే..

15 ఏండ్ల క్రితం వరకు చూసుకుంటే నాడు పొలాల్లో పండే ఆర్గానిక్ ధాన్యాలను, కూరగాయలను, పండ్లను నేరుగా సేకరించి వండుకొని తినేవారే అధికం. ఇప్పట్లో మాదిరి జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ పెద్దగా ఉండేవి కావు. ముఖ్యంగా వడ్లు, తైదలు, జొన్నలు, సజ్జలు, మక్కజొన్న, నవ్వులు వంటివి ప్రధాన ఆహారంగా ఉండేవి. ప్రతి ఒక్కరూ ఉదయంపూట ఇప్పటి మాదిరి ఇడ్లీ, దోశ, పూరి, వడ వంటివి నూనెల్లో ఎక్కువసేపు కాల్చిన సారంలేని తిండి తినేవారు కాదు. తైద రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి ఉదయంపూట తినే ఆహారంగా ఉండేవి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటివి ఎవరూ ఇష్టపడేవారు కాదు, తైద అంబలి, జొన్న అంబలి, పాలు, పెరుగు, సల్ల (మజ్జిగ) వంటివి తాగేవారు. అందుకేనేమో ఎలాంటి రోగాలు లేకుండా సంతోషంగా బతికేసేవారు!

రోగాలు దరిచేరేవి కాదు..

1990లలో బీపీ, షుగర్లు, ఎముకల బలహీనత, ఒత్తిడి, ఆందోళనలు వంటివి సమస్యలు పెద్దగా ఉండేవి కావని ఆరోగ్య నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. పరిశోధకులు సైతం అదే చెబుతున్నారు. మరి ఇప్పుడు..? ఏజ్‌తో సంబంధం లేకుండా డయాబెటిస్, గుండెపోటు, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటివి వేధిస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

తైదల వాడకం తగ్గాక పెరుగుతున్న రోగాలు

మన ఆహారంలో తైదల(రాగులు) వినియోగం ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పటి నుంచే అధిక రక్తపోటు, రక్తహీనత, మధుమేహం, గుండె జబ్బులు వంటివి దాడి చేయడం ప్రారంభించాయని పెద్దలు చెప్తుంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. ఇటీవల కాలం వరకూ తైద రొట్టెలంటే చిన్న చూపు చూసినవారు, అది పల్లెటూరోల్ల ఆహారమని చులకన చేసినవారు సైతం నేడు డాక్టర్ల సలహాలతో మార్కెట్లో ఫింగర్ మిల్లెట్స్ పౌడర్ (తైద పిండి) కోసం వెతుకుతున్నారు. షుగర్ అదుపులో ఉండాలంటే తైద రొట్టెలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఒక్క తైదరొట్టె చేసే ఎంత మేలో..

కండరాలు పెంచుకోవాలని, బలంగా ఉండాలని ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ప్రొటీన్ సప్లిమెంట్లను, పిల్లలకు తినిపించే వివిధ పౌడర్లను కొంటున్నాం. కానీ ఆర్గానిక్ తైదలతో ఇంట్లో వండుకున్న ఆహారాలకింద ఇవన్నీ వృథా అంటున్నారు నిపుణులు. అందుకే జంక్ ఫుడ్స్, టిఫిన్లు వంటివి ఆపేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా రోజూ ఒక తైదరొట్టె తినిచూడండి. మీలో ఎంత మార్పువస్తుందో అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫలానా ఆహారాలు బలమంటూ వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లను ఫాలో అయ్యేవారు. ఫుడ్ మాఫియా మార్కెట్‌ మాయాజాలానికి ఆర్షితులైన వారికి ఇది నచ్చుతుందో లేదో కానీ తైదలు మాత్రం సర్వరోగ నివారణి అంటారు పెద్దలు.

ఎముకలకు బలం, షుగర్ కంట్రోల్ !

ఎముకలు బలంగా ఉండాలంటే.. అదిగో కాల్షియం మాత్రలు కొనండి, లేకపోతే ఫలానా ప్యాకెట్ పాలు కొనండి అంటుంటారు. కానీ నిజానికి తైదరొట్టెలు తింటే చాలు అంటున్నారు నిపుణులు. పాలకంటే కూడా తైదల్లో కాల్షియం ఎక్కువ. 250 మి. లీ. పాలలో 300 గ్రాముల కాల్షియం ఉంటుంది. కానీ అదే 100 గ్రాముల రాగుల్లో 344 గ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి తైదలను ఆహారంగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి తైదరొట్టె మెడిసిన్ లాంటిది. ఎందుకంటే ఇందులో ఐరన్, అమైనో యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాగులతో చేసిన ఆహారాలు ఏవైనా సహాయపడతాయి.

తైదల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు

తైదల్లో (Finger millet) కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తైద రొట్టెలు తినేవారిలో, తైద అంబలి తాగేవారిలో ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది. శాకాహారులు తప్పక తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అట్లనే డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. విటమిన్ బి1, బి2, బి6, అలాగే విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు, లిగ్నాన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె జబ్బులు, బీపీ, మధుమేహం పరార్

*తైదలతో తయారు చేసిన రొట్టె, అంబలి, సంగటి.. ఇతర ఏ రూపంలో ఉన్నా అది బలం. పైగా ఇది గ్లూటెన్ ఫ్రీ (Gluten-free) ధాన్యం. అలసట, అసహనం వంటి ఉదర కుహర వ్యాధి (gluten intolerance or celiac disease.) ఉన్నవారికి అద్భుతమైన ఆహారం. ఫింగర్ మిల్లెట్‌లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగు పర్చడంలో సహాయపడతాయి.

*తైదల్లోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కాబట్టి తైదరొట్టెలు తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇక డైజెస్టివ్ హెల్త్ విషయానికి వస్తే తైదల్లోని ఫైబర్ కంటెంట్ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. హెల్తీ గట్ బాక్టీరియాకు సపోర్టుగా నిలుస్తుంది.

అధిక బరువును, రక్తహీనతను తగ్గిస్తాయి

ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉండటంవల్ల తైదలను ఆహారంగా ఉపయోగిస్తే అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే ఇవి బరువు నిర్వహణలో సహాయపడే ఫిల్లింగ్ అండ్ సంతృప్తికరమైన ఆహారంగా మారుతాయి. రాగుల్లోని ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. తైదల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే ఫినోలిక్ ఆమ్లాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నట్లు ఇటీవలి అధ్యయనంలో తేలింది కాబట్టి తైద రొట్టెలు తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు

తైదలతో చేసే కొన్ని ఆహారాలు

తైదలను రకరకాల ఆహారాలుగా ఉపయోగించవచ్చు. తైదపిండితో రొట్టెలు చేసుకొని తినవచ్చు. అట్లనే రాగి సంగటి, రాగి పాయసం రూపంలో తీసుకోవచ్చు. పాలలో తైద పిండిని ఉడికించడం ద్వారా కూడా ఆహారంగా ఉపయోగించవచ్చు. అట్లనే గంజిలో తైదపిండిని కలిపి రొట్టెలు, వొడియాల మాదిరి పదార్థాలు చేసుకోవచ్చు. ఇక ఇడ్లి, దోశ లేదా ఉప్మా వంటి బ్రేక్ ఫాస్ట్‌ను కూడా తైదపిండితో చేయవచ్చు. మొత్తమ్మీద తైదలు బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే ముఖ్యమైన పోషకాహారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది సమతుల్య ఆహారం కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో తైదలు అద్భుతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story