పల్లెలో వెల్లివిరిసే సంభ్రమణం

by Ravi |   ( Updated:2025-01-13 00:45:55.0  )
పల్లెలో వెల్లివిరిసే సంభ్రమణం
X

మనం సాధారణంగా పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో ఈ పండుగ వస్తుంది. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది.

ఈ పండుగకు నెల రోజుల నుంచే హడావుడి మొదలవుతుంది. దీన్ని ‘నెలపట్టడం’ అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన నుంచి గ్రామాల్లో, రంగవల్లులు, పండుగ సందడి ఊపందుకుంటుంది. గృహలక్షులు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిళ్లను శుభ్రంగా ఊడ్చి, కల్లాపి జల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. ఇక హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ముదాసరులు, జంగమదేవరలు, బుడబుక్కల వారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. భోగిమంటలు వేస్తూ గాలిపటాలను ఎగరేస్తూ కుర్రకారు గ్రామాలను సంబరాల్లో ముంచెత్తుతారు. గోగులు పూచే గోగులు పూచే ఓ లత్తాగుమ్మాడి వంటి మనసుకు హత్తుకునే జానపద గీతాలు ఆలాపనలు, కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగువారి పండుగ సంక్రాంతి. ఈ సమయంలో రైతులు ఇళ్లకు ధన, ధన్యరాశులు చేరుతాయి. ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఉంటారు తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు..

మూడు రోజుల పరమార్థం!

భోగం కాదు త్యాగం అలవరచుకోమని భోగి ప్రబోధిస్తుంది. గ్రామాల్లో తెల్లవారుజామునే నాలుగు రోడ్ల కూడలిలో భోగి మంటలు వేస్తారు. గ్రామ, ఇంటి అరిష్టాలు, రోగ, పీడలు తొలగిపోవడానికి మంటలను కాస్తారు ఆవు పేడతో చేసిన చిన్న చిన్న పిడకలను భోగి మంటలో వేస్తారు. దీని ద్వారా వచ్చే పొగ, చలి తీవ్రత వల్ల వాతావరణంలో పెరిగే సూక్ష క్రిములను అరికడుతుంది. దీనివల్ల గ్రామంలో స్వఛ్ఛత గ్రామ ప్రజలకు స్వస్దత చేకూర్చడం భోగి పండుగ పరమార్థం. ఇక సంక్రాంతి పండుగ రోజున సూర్యునికి అభిముఖంగా ఆవు పిడకలను పేర్చి కొత్త కుండలో ఆవు పాలు పోసి కొత్త బెల్లం కలిపి కొత్త బియ్యాన్ని ఉడికించి పొంగలి తయారు చేసి సూర్యునికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ రోజున ఆనేక రకాల పిండి వంటలు తయారు చేసినా అరిసెలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ఇక కనుము పండుగను మూడో రోజు జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు జీవనాధారమై ఏరువాక నుంచి అన్నదాతతో మమేకమై పాడి పంట ఇంటికి రావడానికి కారణమైన గోవులను, వృషభాలను పూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో పశువులను, పాకలను శుభ్రం చేస్తారు. అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు. వ్యవసాయ కూలీలకు, పాలేళ్లకు కొత్త బట్టలు, ధాన్యాన్ని అందజేస్తారు. కుల వృత్తుల వాళ్లకు సైతం ధాన్యాన్ని ఇస్తారు. వ్యవసాయంలో సాయం చేసిన వాటికి కృతజ్ఞతను తెలపడం కనుమ పరమార్థం. ఇక గోమయంతో ఇంటి ప్రాంగణం శుద్ది (కళ్లాపి) చల్లడం వల్ల క్రిములు ఇంట్లోకి రావు. ధ్యానం నిలువ చేసిన గాదుల వద్దకు సూక్ష్మక్రిములు రావు. బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలకు ఆహారం లభిస్తుంది. ఈ పండుగ సందర్భంలో కొన్ని జానపదాలు ఆడి పాడటం వెనుక అనుబంధాలు ఆత్మీయత దాగి ఉన్నాయి.

జానపద కళా కౌముది..

సంక్రాంతికి ముందు నుంచే గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ల మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చేయడం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ప్రజలను అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు.

వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు.. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిది. హేమంతంలో విరిసిన చామంతి ముంగిట మురిసిన ముద్దబంతి మంచుముత్యాలతో ముగ్గులు దిద్దేను ఇంతి శ్రమైక జీవన జ్యోతులు చిందించే దరహాసపు కాంతి రాశులు కలబోసి విరులు విరబూసి మహదండిగా మదినిండాగా మనం జరుపుకునే చలి పండుగే సంక్రాంతి.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed