వాషింగ్ పౌడర్.. పునీతులు

by Ravi |   ( Updated:2024-03-27 00:45:06.0  )
వాషింగ్ పౌడర్.. పునీతులు
X

సమకాలీన భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకులు కూడా అనేక పదవులు అనుభవించిన తర్వాత తమ తమ పార్టీలను వదిలేసి అధికారంలో వున్న పార్టీలో చేరడం ప్రస్తుతం గమనిస్తున్నాం. ఇటీవల కాలంలో ఊసరవెల్లిలా పార్టీలు మార్చిన వారి వివరాలను, కారణాలను గమనిద్దాం.

మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించిన కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య 2020లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగించనందుకు 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించి కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా వున్న కాంగ్రెస్ పార్టీ పడిపోవడానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా చేరిపోయాడు. రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించిన బీజేపీని అధికారంలోకి తేవటానికి కారకుడయ్యాడు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వంలో మంత్రులయ్యారు.

రాజ్యసభ సభ్యత్వంతో

ఇక మరొక మహారాష్ట్ర నాయకుడు రెండుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసి ఆదర్శ్ హోసింగ్ స్కామ్‌లో ఇరుక్కున్న అశోక్ చవాన్ బీజేపీ నుండి రాజ్యసభ సభ్యత్వమివ్వగానే, పార్టీ ఫిరాయించి రాజ్యసభ సభ్యత్వంతో పునీతుడైపోయాడు. ఇదే రాష్ట్రం నుండి ఎన్సీపీకి కి చెందిన అజిత్ పవార్ 9 మంది ఎంఎల్ఏలతో బీజేపీలో చేరగానే ఉపముఖ్యమంత్రిగా చేసేసి ఇతనితో పాటుచేరిన వారికీ మంత్రి పదవులను బీజేపీ కట్టబెట్టింది. ఈయన గారు 1999 నుండి ఇరిగేషన్ల శాఖ మంత్రిగా ఉండి 32,000 వేల కోట్ల రూపాయల స్కాం లో ఇరుక్కున్నాడు. 2012 ఎకనమిక్ సర్వేలో పదేళ్లలో 77,000 కోట్లు ఖర్చుపెడితే కేవలం 0.1 % మాత్రమే అదనపు లబ్ధి పొందారని తెలిపింది.

విదర్భలో 32 ప్రాజెక్టులను 3 నెలల వ్యవధిలో రీడిజైన్ పేరుతో ముగ్గురు అనుచరులకు 17,700 కోట్లకు పెంచి కాళేశ్వరం లాగే చేసాడు. కాకపోతే ఇంకా ప్రాజెక్టులు కాళేశ్వరంలా కూలిపోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే తెలంగాణ ఇంజనీర్స్ లాగా తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా కాకుండా, అక్కడి చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రధాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా దాదాపు సగం డబ్బు రాజకీయ నాయకులూ కాంట్రాక్టర్స్ తినేశారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ చవాన్ మహాశయుడు ఈడీ బెదిరింపులతో బీజేపీలో చేరి పునీతుడయ్యాడు. తాజాగా వందల కోట్ల అభియోగాలు ఉండి జైలులో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..

ఆనాటి సిద్ధాంతాలు ఏవి?

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎం రమేష్, సుజనా చౌదరి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగవేత కేసుల్లో నిందితులుగా వుండి ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ బీజేపీలో చేరగానే పునీతులయ్యారు. ఇంకా వైఎస్ జగన్, చంద్రబాబుఫై కేసులు సరేసరి. బెంగాలుకు చెందిన సువెందు అధికారి 2020లో టీఎంసీ నారద స్ట్రింగ్ ఆపరేషన్‌తో సహా అనేక స్కామ్‌లలో ఇరుక్కొని ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ అధికార పక్ష నాయకునిగా వున్నాడు. ఇంకా అనేకమంది రాహుల్ సన్నిహితులు, చెట్టుపేరు చెప్పుకొని వంశపారంపర్య అర్హత లేకున్నా అందలమెక్కిన కాంగ్రెస్ నాయకులూ పచ్చగడ్డిని వెదుక్కొంటూ అధికార పార్టీలోకి ఫిరాయించడం చూస్తున్నాము.

ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలకు, విలువలకు ప్రాధాన్యమిచ్చి రాజకీయాలు నడిపారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను పరిశీలిద్దాం కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం ఇరుసుగా నెహ్రూ నాయకత్వంలో ప్రభుత్వం నడిచింది, అయితే 1950లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సర్దార్ పటేల్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన పురుషోత్తందాస్ టాండన్‌ను ప్రతిపాదించగా, నెహ్రూ వ్యతిరేకిస్తాడు. ఎందుకంటె టాండన్ ముస్లిములపై వారి వేష భాషలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని దేశం విడిచి పాకిస్తాన్ వెళ్ళమంటాడు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నెహ్రూ ఆమోదించరు. కానీ పటేల్ పట్టు విడవరు. ప్రతిగా నెహ్రూ ఆచార్య కృపాలానిని అభ్యర్థిగా పోటీచేయిస్తాడు. ఎన్నికల్లో నెహ్రూ అభ్యర్థి ఓటమి చెందుతాడు. ఈ సంఘటన ఆనాటి సిద్ధాంతాలకు, ప్రజాస్వామ్యానికి మచ్చు తునక. కానీ నేడు అవి మచ్చుకైనా కనిపిస్తాయా? కేవలం అధికార వాంఛ తప్ప.

డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి

89850 37713

Advertisement

Next Story