CM Sitakka: సీఎం సీతక్క .. ఎవరి వ్యూహం!

by Ravi |   ( Updated:2023-07-14 13:12:52.0  )
CM Sitakka: సీఎం సీతక్క .. ఎవరి వ్యూహం!
X

తెలంగాణకు సీఎం సీతక్క కానున్నారా? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ హాట్‌గా సాగుతున్నది. ఇదే రాజకీయ పార్టీల్లో, నేతల్లో వాడివేడి చర్చకు దారి తీసింది. ఇదే బడుగు, బలహీన వర్గాల్లో సంతోషం వ్యక్తం చేస్తుంది. మహిళా లోకం కండ్లలో ఆనందం కనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సీతక్కకి అవకాశం ఇస్తారా అని తానా సభల్లో రేవంత్‌రెడ్డిని ఎన్‌ఐఆర్‌లు ప్రశ్నించగా కాంగ్రెస్‌లో ఫలానా పోస్టుకు.. ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పదని స్పష్టం చేస్తూనే అవసరాన్ని బట్టి సీతక్కను సీఎం కూడా చేస్తామన్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ పత్రికల్లో, మీడియాలో హెడ్‌లైన్ అయ్యింది.

అందుకు చెక్ పెట్టేందుకే...

నిజానికి కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించే ఆనవాయితీ లేదు.. అయినప్పటికీ రేవంత్ మాట యాదృచ్చికం మాత్రం కాదు అనేది స్పష్టం. చాలాకాలంగా కాంగ్రెస్ అధిష్టానంలో ఈ విషయం నానుతున్నదే. రాష్ట్రంలోని కాంగ్రెస్ గ్రూపులకు చెక్ పెట్టడానికి ఒక మహిళను సీఎం చేయాలని ఉన్నదే. ‘భారత్ జోడో యాత్ర’ తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ దేశం దాటింది. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. కేంద్రంలో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావడం, ఆయన ఇల్లు ఖాళీ చేయించడం వంటి చర్యలు ఆయన ఇమేజ్‌ని పెంచాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడని, అన్ని పరిస్థితులను పార్టీకి అనుకూలంగా చేసుకునే ఏ అవకాశాన్ని రేవంత్ విడిచి పెట్టడం లేదని, సీఎం తానే కావాలనే లక్ష్యం కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ఉన్నారని, పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. దీంతోపాటు ఖమ్మంలో జరిగిన భారీ సభ విజయవంతం కావడం అందులోనే రాహుల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని నమ్మకంగా ఉండడం, ఆ సభలో పొంగులేటి చేరడం, ఆ తర్వాత చేరికల జాతర కొనసాగుతూనే ఉండటం పార్టీకి ఎస్సెట్ అయిందని పేర్కొనవచ్చు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి పాదయాత్రలు.. పాత, కొత్త నేతలను కలుపుకుపోవడం, క్యాడర్‌ను ప్రోత్సహించడం, వారి సలహాలు, సూచనలు తీసుకుని పాటించడం లాంటి విధానాలను రేవంత్ అనుసరిస్తున్నారని గ్రౌండ్ లెవల్ క్యాడర్ సంతోషంగా చెప్పుకుంటున్నారు.

అందుకే గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మొదటిసారిగా ఐక్యంగా కాంగ్రెస్ నేతలుంలుండటంతో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. పార్టీ అధిష్టానంతో ముఖ్యంగా సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ..ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి, పరిశీలకులతోను రేవంత్ అన్ని విషయాల గురించి చర్చించి, ప్రతి నిర్ణయాన్ని వారికి చెప్పి అమలు చేయాలని భావించడం ద్వారా అధిష్టానంలో నమ్మకాన్ని రేవంత్ పెంచుకుంటున్నారనే టాక్ వస్తోంది. పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న, గత నాయకత్వం నిర్లక్ష్యం చేసిన వారిని రేవంత్ రెడ్డి కలుస్తున్నారు..మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా నేతను తెలంగాణలో ఫ్యూచర్ సీఎం అభ్యర్థిగా ప్రోజెక్టు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

పార్టీకి ఆ పరిస్థితి రావొద్దని..

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్ సీతక్క దీనికి అర్హురాలు. ఎందుకంటే ఆమె హార్డ్ వర్కర్, మానవత్వం ఉన్న మహిళ కరోనా సమయంలో ఆమె చేసిన సేవ అందరూ చూసిందే.. పైగా ఆమె విద్యావంతురాలు. సమర్థురాలు.. పోరాటాల ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. నిజానికి సీతక్క ఆదివాసీ బిడ్డ మాత్రమే కాదు.. కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ ప్రజలు మెచ్చిన బిడ్డ. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అలాంటి అవకాశం ఎవరికీ రాలేదు. అందుకే రేవంత్ రెడ్డి ఈ వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారని టాక్.. అలాగే మహిళలకు అసెంబ్లీ టిక్కెట్లు ఎక్కువగా కేటాయించడం. మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచాలని చూస్తున్నారని తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలల్లో రేవంత్ రెడ్డి గ్రూపులు లేకుండా చూసే ప్రయత్నంలోను ఉన్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి జి. వినోద్ వెంకటస్వామి, అటు సింగరేణిలో ఐఎన్టీయుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ లాంటి వారితోను సింగరేణిలో యూనియన్ పటిష్టత కోసం, యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా సీతక్కకు బాధ్యతలు ఇచ్చే విషయంపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

నిజానికి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలపై సింగరేణి ప్రాంత ప్రభావం ఉంటుంది. తెలంగాణ సాధన ఉద్యమంలోనూ ఈ జిల్లాల ప్రభావం ఎక్కువగానే ఉండేది. సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉద్యమంలో పాత్ర ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాల్లో క్యాడర్ ఎక్కువగానే ఉంది. అందుకే రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఈ జిల్లాలపైనే కేంద్రీకరణ పెంచి బీఆర్ఎస్‌ను రాజకీయంగా బలహీనపరిచడానికి ప్రయత్నిస్తున్నారు.. ఇందుకు ఆదివాసీ బిడ్డ సీతక్క ఒక ఎస్సెట్‌గా పేర్కొనవచ్చు. సీఎం అభ్యర్థిగా సీతక్కను ప్రకటిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగవుతుందనే అభిప్రాయం ఉంది. దళిత, ఆదివాసీ, మైనారిటీ‌లు వన్ సైడ్ అయిపోయే అవకాశం లేకపోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందనే చర్చ కూడా ఉంది. దీని ద్వారా కాంగ్రెస్ నేతల్లో పోటీకి ఆస్కారం లేకుండాపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వొద్దని కొందరు సీనియర్ నేతలు ఢిల్లీకి లైన్లు కట్టిన విషయాన్ని ఎవరు మర్చిపోగలరు. ఈ సారి కాంగ్రెస్ గెలిచినా అదే చర్విత చరణం అవుతుందని.. అందుకే అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావొద్దని అందుకు మహిళ పేరు ప్రస్తావించడం మంచిదే కదా అనేవారు కాంగ్రెస్‌లో లేకపోలేదు. రేవంత్ ఈ ఉద్దేశంతో సీతక్క పేరును ప్రస్తావించారని అనుకోవచ్చు!

అదే జరిగితే.. నష్టం ఎవరికి?

తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళిత సీఎం అనే నినాదం ఎత్తిన కేసీఆర్, చివరికి తానే సీఎం అయ్యారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల్లో ఈ టాక్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు దీనిని దళిత సంఘాల నేతలు, కాంగ్రెస్, బీజేపీలు నేతలు ప్రస్తావనకు తెస్తుంటారు కూడా.. అభ్యర్థిగా సీతక్క ఉంటే కేసీఆర్‌కు కూడా ఇదే కౌంటర్ అవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో సీతక్కకు వంద మార్కులు ఉన్నాయి! అందుకే రేవంత్ నోట సీతక్క సీఎం మాట అధిష్టానంలో ఉన్న అభిప్రాయం కూడా అనుకోవచ్చు. ఒకవేళ సీతక్కను ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవు అనక తప్పదు! దీనిపై ఎవరు ఏమనుకున్నా ఇదే గ్రౌండ్ రియాలిటీ! ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇదే అభిప్రాయం బీజేపీలోనూ ఉంది అంటున్నారు. బీజేపీ దళిత సీఎం మాట ఇంకా మూట కట్టే ఉంచింది అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఇంకా ఏమేమి ప్రతిపాదనలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సింది. ఆట మొదలు అయింది.. ముగింపు ఎలా ఉంటుందో చూద్దాం!

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్.. విశ్లేషకులు,

9951865223

Advertisement

Next Story

Most Viewed