CM Revanth Reddy : పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతినివ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-06 11:14:32.0  )
CM Revanth Reddy : పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతినివ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల(Ppending Railway Projects)కు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్‌ను కూడా(Inauguration of Cherlapalli Railway Terminal) ప్రారంభించగా, ఆ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనను ప్రస్తావించి సహకరించాలని ప్రధానమంత్రిని కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం పట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పెండింగ్ రైల్వే అంశాలను వివరించారు. తెలంగాణ మణిహారంగా ఉండే రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు దానివెంట రీజినల్ రింగ్ రైలు, మెట్రో రైలు ఫేజ్ -2 విస్తరణ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వికారాబాద్ నుంచి కర్నాటక కనెక్టింగ్ రైల్వే లైన్, బందర్ పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ వంటి ప్రతిపాదనలను ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు కాకినాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సత్వరం చేపట్టాలని కోరారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ లేనందున, హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు ఒక డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలు, డ్రైపోర్టు అభివృద్ధికి తోడ్పుడుతుందని వివరించారు.

తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉందని, దేశంలో 35% ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయని, అందువల్ల ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే, రవాణా సులభమవుతుందని తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుందన్నారు. ఎలక్ట్రికల్ తయారీ రంగం కూడా ఇక్కడ అభివృద్ధి చెందటానికి అనువుగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలపై టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తే నగరీకరణ జరిగి, ఇది పెట్టుబడులు మరియు పరిశ్రమల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని రేవంత్ రెడ్డి వివరించారు.

మెట్రో రైలు పరంగా దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణ 2 వ స్థానంలో ఉండగా, గడిచిన పదేళ్లుగా ఈ దిశలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దాంతో తెలంగాణ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. ప్రస్తుతం మెట్రో రైలు ఫేజ్ 2 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, దాన్ని మంజూరు చేస్తే హైదరాబాద్ నగర అభివృద్ధికి మరిన్ని బాటలు వేసినట్టు అవుతుందని తెలిపారు. తెలంగాణ నుంచి కొడంగల్ మీదుగా కర్నాటక రాష్ట్రంతో అనుసంధానం చేసే వికారాబాద్ రైల్వే లైన్ కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు.

తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించిన ఈ మూడు నాలుగు అంశాలపై కేంద్ర సహకారం అవసరమని రేవంత్ రెడ్డి కోరారు. ఈ వర్చువల్ మీటింగ్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినికుమార్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story