గెస్ట్ ఫ్యాకల్టీ గెంటివేతేనా!

by Ravi |   ( Updated:2024-08-09 17:49:32.0  )
గెస్ట్ ఫ్యాకల్టీ గెంటివేతేనా!
X

ప్రభుత్వాలు తమ అవసరాల కోసం తక్కువ వేతనాలకు లభించే మానవ వనరులను వాడుకుని తర్వాత వారిని వదిలేయడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణ గత కొద్ది రోజులుగా వివిధ ప్రభుత్వ కళాశాలలో, గురుకుల విద్యా సంస్థల్లో శాశ్వత నియామకాలను చేస్తూ కొత్త జూనియర్, డిగ్రీ లెక్చరర్‌లను తీసుకుంటున్నాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న గెస్ట్, హవర్లీ బేసిక్ లెక్చరర్‌లు, ఇతర ఉద్యోగులు వేల సంఖ్యల్లో రోడ్డు మీద పడుతున్నారు.

గురుకుల విద్య సంస్థలలోని మొత్తం ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా పర్మినెంట్ వారిని తీసుకోవడంతో గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ, దానినే జీవనాధారంగా చేసుకున్న సుమారు మూడు వేల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. నిజానికి గురుకుల విద్యాసంస్థలు ప్రారంభమైన నాటి నుండి అరకొరగా ఉన్న రెగ్యులర్ సిబ్బందితో వీరు పోటీ పడి విద్యాసంస్థల అభివృద్దికై అహర్నిశలు కృషి చేశారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఇన్నేళ్లు అక్కడ పని చేసినందుకుగాను కనీసం సర్వీస్ సర్టిఫికెట్ అడిగితే కూడా ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం. ప్రభుత్వాలే గెస్ట్ లెక్చరర్లను వాడుకుని ఇప్పుడు మధ్యలో వదిలేస్తే వారికి దిక్కెవరు? రాష్ట్ర ప్రభుత్వం వివిధ జూనియర్, డిగ్రీ, గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సుమారు ఐదువేల మంది గెస్ట్ ఫ్యాకల్టీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.

ఉన్నపళాన టెర్మినేట్ చేస్తే...

రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత పదేళ్లుగా 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపకులు) విధులు నిర్వహిస్తున్నారు. అలాగే 153 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సుమారు 1300 మంది గెస్ట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరందరి సర్వీస్‌ను ఈ అకడమిక్ ఇయర్ రెన్యువల్ చేయకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తోంది. జూనియర్ లెక్చరర్‌లకు కేవలం ఒక్క నెలకు మాత్రమే రెన్యువెల్ ఇచ్చి చేతులు దులుపుకుంది. వీరే కాకుండా రాష్ట్రంలోని వివిధ రకాల గురుకుల విద్యా సంస్థలన్నింటిలో కలిపి సుమారు మూడు వేల మంది గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఈ సంస్థలలో పనిచేస్తున్న వారందరిని ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేట్ ఉత్తర్వులు జారీ చేసి ఇంటికి పంపించేస్తుండటం బాధాకరం.

పదేళ్ల బోధనకు ఫలితం ఇదా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యాభివృద్ధికై అనేక రకాల రెసిడెన్షియల్ పాఠశాలలను, కళాశాలలను స్థాపించడం జరిగింది. అంతకు ముందు రాష్ట్రంలో కేవలం 298 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు కలవు. నేడు వాటి సంఖ్య 1002కు చేరుకుంది. వీటన్నింటి సంఖ్యను దశల వారీగా పెంచుతూ, కొత్తగా ప్రారంభించిన వాటిలో ముందుగా పర్మినెంట్ ఉద్యోగులను నియామకం చేయాలి. కానీ అలా చేయ కుండా ఆనాటి ప్రభుత్వ పరిస్థితులకు అనుగుణంగా కాంట్రాక్టు, గెస్ట్ పద్దతిన టీచర్‌లను, లెక్చరర్‌లను తీసుకుని నిర్వహించుకుంటూ రావడం జరిగింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతి న నియామకమైన కొద్దిమందిని గతంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రెగ్యులర్ చేయడం జరిగింది. అలా రెగ్యులర్ అయిన వారి సంఖ్య వందల్లో ఉంటుంది. ఇక వారి కంటే రెండు, మూడింతల ఎక్కువ సంఖ్యలో గెస్ట్ ఫ్యాకల్టీనే ఈ సంస్థలలో పని చేస్తున్నారు.

సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా...

గతంలో ఈ సంస్థలకు సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగ నోటిఫికేషన్‌లు 2017, 19లలో ప్రభు త్వం జారీ చేసింది. ఉద్యోగ పరీక్షల నిర్వహణ అనంతరం రెగ్యులర్ సిబ్బందిని అక్కడ నియమించారు. అయితే అప్పటికే ఆ స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ సిబ్బందిని ఇతర విద్యా సంస్థలకు సర్దుబాటు చేయడం వలన అప్పుడు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఇప్పుడు మాత్రం గురుకుల విద్య సంస్థలలోని మొత్తం ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా పర్మినెంట్ వారిని తీసుకోవడంతో గత ఎనిమిదేళ్లుగా అక్కడే పని చేస్తూ, దానినే జీవనాధారంగా చేసుకున్న సుమారు మూడు వేల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. నిజానికి గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమైన నాటి నుండి అరకొరగా ఉన్న రెగ్యులర్ సిబ్బందితో వీరు పోటీపడి విద్యా సంస్థల అభివృద్దికై అహర్నిశలు కృషి చేశారు. విద్యార్థుల ఉత్తమ ఫలితాలతో పాటు, అత్యు న్నత సంస్థలు అయిన ఐఐటీ, నీట్, ట్రిపుల్ ఐటీ, మెడికల్ రంగాల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దడంలో వారి పాత్ర అమోఘం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని తామై చూసుకున్నారు. జీతాలు సక్రమంగా సమయానికి రాకపోయినా నిజాయితీగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. అన్నింటి కంటే దారుణమైన విష యం ఇన్నేళ్లు అక్కడ పని చేసినందుకుగాను కనీసం సర్వీస్ సర్టిఫికెట్ అడిగితే కూడా ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం.

ప్రభుత్వాలే వాడుకుని వదిలేస్తే దిక్కేది?

ఒకప్పుడు శ్రమదోపిడి అజ్ఞానం, అమాయకత్వాలను ఆసరాగా తీసుకుని కొనసాగించేవారు. కానీ ప్రస్తుతం అన్నీ తెలిసి కూడా యువత ఈ ఉచ్చు లోకి లాగబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య, పేదరికం, శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్‌లు సకాలంలో రాకపోవడం వంటివి వారిని దిక్కుతోచని స్థితిలో నెట్టివేస్తున్నాయి. ఎటూ పాలుపోకుండా చివరికి ఈ తాత్కాలిక ఉద్యోగాల వైపు రావడం, వాటిల్లో జాయిన్ కావడం జరిగింది. జరుగుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలే వాడుకుని వదిలేస్తే వారికి దిక్కెవరు? భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలే శ్రమ దోపిడీ కొనసాగిస్తే ఇక వారిని కాపాడేదెవరు?

సర్వీస్ రెన్యువల్ చేయాల్సిందే!

గత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిం ది. అంతేగాకుండా వారి జీతం సైతం 42,000 వరకు పెంచుతామని పేర్కొంది. గెస్ట్ ఫ్యాకల్టీకి అవసరమైతే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడా కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ జూనియర్, డిగ్రీ, గురుకుల విద్యా సంస్థలలో పనిచేస్తున్న సుమారు ఐదువేల మంది గెస్ట్ ఫ్యాకల్టీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. వారందరిని అవసరం ఉన్నచోట నియామకం చేస్తూ వారి సర్వీస్‌లను రెన్యువల్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి, వారి ప్రభుత్వంపైన ఉంది.

- డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Advertisement

Next Story

Most Viewed