- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందాంధ్రను ఆవిష్కరించే బడ్జెట్!
ఆనందాంద్రను ఆవిష్కరించే విధంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్. పన్నుల బాదుడు జోలికి పోకుండా కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తూ, మూలధన వ్యయాన్ని పెంచుతూ రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించే విధంగా బడ్జెట్‌లో బాటలు వేశారు. అభివృద్ధి పూర్తిగా అడుగంటి ఏపీ అస్తిత్వమే ప్రశ్నార్థకమయిన వేళ రాష్ట్ర భవిష్యత్తును కాచుకోవడమే లక్ష్యంగా విద్వంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మహాయజ్ఞానికి ఎన్డీయే 2.0 ప్రభుత్వం సమగ్ర ఆర్ధిక ప్రణాళికను రూపొందించింది. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్చిదిద్దిన 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణం దిశగా కొత్త అడుగులువేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితమవుతూ నిధుల కేటాయింపులు చేశారు. అభివృద్ధి సంక్షేమం, ఎన్నికల హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణం వంటి అనేక ఒత్తిళ్ల మధ్య కూడా భారీ కసరత్తు చేసి భారీ బడ్జెట్‌ను రూపొందించారు. ఏ వర్గాన్ని అసంతృప్తి పరచకుండా దీర్ఘకాలంలో చేకూరే ప్రయోజనాలు.. ప్రస్తుతం చేకూరే ప్రయోజనాలు, హామీలు, భరోసాలు బాగానే కల్పించారు. బడ్జెట్ రూపొందించే సమయంలో వాస్తవికతను ప్రజల కళ్లకు కట్టారు. భారమైనా భారీగానే బడ్జెట్ కేటాయింపులు జరిపి సమస్యలకు తలోగ్గేదిలేదన్న తెగువను కనబర్చారు ఆర్థిక మంత్రి.
రాజధానికి నిధులు..
విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆర్థిక మంత్రి కేశవ్ తొలి పద్దు వేగుచుక్కలా పొడిచింది. రాజధానికి నిధులిచ్చింది. పోలవరానికి వరాలు కురిపించింది. అమరావతి, పోలవరాన్ని వేగంగా నిర్మించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా అన్నివైపుల నుంచి సహకారం లభిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి రూ.3,445 కోట్లు కేటాయించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తేవాలన్న లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేశారు. ఒకవైపు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సాయానికి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు ఇచ్చింది. రాబోయే నాలుగు నెలల్లో ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు పరుగులు తీయనున్నది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల కింద ఆస్తులు సృష్టించేలా మూలధన వ్యయం చేసేందుకు రూ.32,712 కోట్లు కేటాయించారు..
పోలవరానికి వరాలు..
అయిదు కోట్ల ఆంధ్రుల జలదేవాలయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5.445 కోట్లు కేటాయించడం అభినందనీయం. పోలవరం ప్రాజెక్టు తొలి దశకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం అంగీకరించింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా మిగిలిన నిర్మాణ పనులు 2027 మార్చినాటికి పూర్తి చేసి జాతికి అంకితం చెయ్యనున్నారు.. అమరావతి, పోలవరం నిర్మాణాలను పరుగులు తీయించాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు దీక్షా దక్షతలకు అద్దం పడుతుంది. 2025, న్యూ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్ గేరు మార్చబోతున్నది. ఏపీని వెలుగుల వైపు మళ్లించబోతున్నారు.
తొలి పద్దులోనే సూపర్ సిక్స్
తన తొలి పద్దులోనే సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ పేదల గుండెల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పెద్దపేట వేశారు. అన్నదాతా సుఖీభవా అంటూ, అమ్మకు వందనాలు పలికింది తొలిపద్దు. ఆడబిడ్డ నిధితో పాటు త్వరలోనే కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభం కాబోతున్నాయని సంకేతాలిచ్చింది. జగన్ జమానాలో మంగళం పాడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మళ్లీ స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు వీలుగా రాయితీపై రుణాలిచ్చేందుకు బాటలు వేశారు. గత పాలనలో దగా పడ్డ మధ్య తరగతి ప్రజలు, అట్టడుగు ప్రజలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్య సాధన కోసం పేదప్రజల సంక్షేమానికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. చదువుకునే ప్రతి విద్యార్ధికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా దీనికోసం తల్లికి వందనం' పథకానికి రూ.6,487 కోట్లుబడ్జెట్ లో కేటాయించడం హర్షణీయం.
రైతుల సంక్షేమానికి 43 వేల కోట్లు..
వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ.48,402 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత విద్యుత్తు రూ.7.211 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 16,705 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు. వంశదార స్టేజ్- 2, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల పథకంకు, మహేంద్ర తనయ సాగునీటి ప్రాజెక్టులతో పాటు అనేక ఇతర ప్రాజెక్టులు నిర్మాణానికి నిధులు కేటాయించడం అభినందనీయం.
రహదారులకు మహర్ధశ!
గత ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులు ధ్వంసమయ్యాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. ఈ బడ్జెట్‌లో రహదారుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.5.441 కోట్లు కేటాయించారు. గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.1,098 కోట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.16,739 కోట్లు కేటాయించారు. పల్లెల్లో జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆసియా మౌలిక సౌకర్యాల అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులిచ్చి ఇళ్లలో జలజీవన్ మిషన్ పనులు ఊపందుకునేందుకు ఈ బడ్జెట్ వీలు కల్పించింది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.2,270.70 కోట్లు నిధులు కేటాయించారు.. కొత్తగా పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద నిధులు కేటాయించారు.2019లో రూ.3.6 లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర రుణభారం 2024 మార్చి నాటికి దాదాపు రూ.11లక్షల కోట్లకు చేరింది. వీటిని సరిదిద్దడానికి కొత్త ప్రభుత్వం దృఢసంకల్పంతో, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి. ఈ క్రమంలో ద్రవ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎదురుగా కనిపిస్తున్న దారి కంటకప్రాయమైనదే. అయినా శక్తివంచన లేకుండా కష్టించి ప్రజల కలలను నిజం చేసేందుకు నూతన చైతన్యం నిండిన దార్శనికత వున్న నాయకుడు పాలకుడిగా వున్నారు. ఏపీ భవిత చాలా ఆశాజనకంగా కనబడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత ఉన్నతమైన ఉత్సాహంతో భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ముందుకు నడస్తే ఆనందాంధ్రను ఆవిష్కరించవచ్చు.
నీరుకొండ ప్రసాద్,
98496 25610