ఇది చివరి కోరిక కాదు

by Ravi |   ( Updated:2023-03-16 18:30:48.0  )
ఇది చివరి కోరిక కాదు
X

కోరికలు దుఃఖానికి హేతువు అన్నాడు బుద్దుడు. అయితే ఆధునిక కాలంలో కోరికలు... ఎప్పటికప్పుడు కొత్త కోరికలు లేకుండా సామాజిక జీవనం అభివృద్ధి సాధ్యం కావడం లేదు. అందువల్ల నాకు కొన్ని కోరికలున్నాయి. ఇవి చివరి కోరికలు కావు. నా కోరికలు కావు. జీవన గమనంలో అనుభవంలో పుట్టుకొచ్చిన కోరికలివి. నేను 1987 నుండి తాత్విక భావజాల రంగంలో ఆలోచన, ఆచరణ మధ్య వైరుధ్యంతో మొదలు పెట్టినాను. దీనిపై అరుణతార మాసపత్రికలో రెండేళ్లపాటు చర్చలు జరిగాయి. అదే కాలంలో ఉదయం దిన పత్రికలో కుల సమస్యపై రాసాను. 1991లో గతితర్క తత్వదర్శన భూమిక రాసాను. గతితర్కం అంబేద్కరిజం మార్క్సిజం, అంబేద్కరిజం సోషలిజం, బహుజనతత్వం , మొదలుకొని చాలా రాసినాను. బౌద్దం సోషలిజం మార్క్సిజం అంబేద్కరిజం అనే పుస్తకం ఇటీవల వెలువరించినాను. ఇలా అనేక పుస్తకాలు వేసినాను. ప్రసంగాలు చేసినాను. ఉద్యమాలు నిర్మించినాను. ఆరెస్సెస్‌లో పని చేస్తూ యంయస్ గోల్వాల్కర్ గురూజీని చూసినాను. శ్రీధర్ జీతో కల్లెపు విద్యాసాగర్ జీ తో కలిసి పని చేసినాను.

వరవరరావు, అల్లం రాజయ్య, త్రిపురనేని మధుసూదనరావు, గద్దర్, కూర రాజన్న, కొండపల్లి సీతారామయ్య, ముప్పావు లక్ష్మణరావు కలిసి పని చేసినాను. బహుజన ఉద్యమంలో సత్యమూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ, విజిఆర్ నారగోని, దళిత కళామండలి మాస్టార్జీ, కాన్సీరాం, బొజ్జా తారకం, కత్తి పద్మారావు, ఉ.సాంబశివరావు ఇంగిలాల రామచంద్రరావు, చార్వాక రామకృష్ణలతో, కెయస్ చలం, కంచ ఐలయ్య, గూడ అంజయ్యతో కలిసి పని చేశాను. 1992 నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదికగా దరకమే ఐక్య వేదికను నిర్మించినాము. బుద్దుడు నుండి మహాత్మా జ్యోతిరావు పూలే అంబేడ్కర్ పెరియార్ రామస్వామి నాయకర్‌ల వారసత్వాన్ని స్వీకరించినాను. వెయ్యేళ్ల సాహిత్య, భావజాల చరిత్రలో నూతన చరిత్ర సృష్టించినాము.

1996 నుండి అందరం కలిసి తెలంగాణా మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించినాము. అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, పాశం యాదగిరి, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ , జయశంకర్, వెంకట నారాయణ తదితరలందరం కలిసి మలి దశ తెలంగాణ ఉద్యమం నిర్మించినాము. బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వంలో తెలంగాణ రావాలని కోరినాము ప్రచారం చేసినాము. నిర్మాణం చేపట్టినాము. 2005 నుండి కేసీఆర్ తో కలిసి పని చేసినాను. పలు వ్యాసాలు రాసినాను. పుస్తకాలు వేసినాను. కలిసిన వారికి పుస్తకాలు ఇచ్చినాను. గతితార్కిక తత్వ దర్శనం భూమిక మూడు ముద్రణలు అయిపోయాయి. మిగతా రచనలు అనేకసార్లు పత్రికల్లో పుస్తకాల్లో పునర్ ముద్రణ పొందాయి. భారతీయ చరిత్ర శూద్ర దృక్పథం ప్రచురించినాను. మూడేళ్లకో కొత్త తరం వస్తున్నది. చదివేవారికి ఎందరికో పిడిఎఫ్ రూపంలో పుస్తకాలు పంపినాను. తెలంగాణ ఉద్యమం కోసం 42 పుస్తకాలు వేసి పంచినాను. తెలంగాణ తల్లి రూపకల్పన చేసినాను. మార్క్సిజంలో తీసుకోవలసినవి, వదిలేయాల్సినవి విశ్లేషించినాను.

నాకు 74 ఏళ్ల వయసిపుడు. 50 ఏళ్లుగా సామాజిక ఉద్యమాలలో పని చేస్తూ అనేక కథలు నవలలు రాసినాను . 102 పుస్తకాలు చేసినాను. దరకమే ఐక్య వేదిక , విశాల సాహిత్య అకాడమీ నిర్మించినాము. ఎందరో రచయితలను కళాకారులను జర్నలిస్టులను తయారు చేసినాము. ఎందరి రచనలో ప్రచురించినాను. తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా పని చేసినాను. భారత రాజ్యాంగంలో బీసీ ఎస్సీ ఎస్టీల అంశాలు కలిపి బీసీ నోట్ బుక్ వేసినాము.

యువ తరమా! మా అధ్యయనాలు అనుభవాలు ప్రపంచ పరిణామాలు మా అవగాహనను పెంచాయి. ఆధునిక పరిస్థితులలో ఆధునికంగా ఆలోచించడం అనివార్యం చేశాయి. యువతరం ముఖ్యంగా నలభై ఏళ్ల లోపు యువతరం రాజ్యాధికారం చేపట్టడం అవసరం. మహిళలకు సమాన హక్కులు చట్ట సభల్లో బీసీలకు మహిళలకు సగం స్థానాలు ప్రాతినిధ్యం రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయవలసి వుంది. 1932 పూనా ఒప్పందం నాటి నుండే రావలిన బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికైనా కల్పించడం అవసరం. ప్రజల ప్రాతినిధ్యం పెంచడానికి లోక్‌సభలో 2600 సీట్లు, రాజ్య సభలో 1200 సీట్లు, శాసన సభల్లో మూడు రెట్లు సీట్లు పెంచుకోవలసి ఉన్నది. యువతరం ప్రపంచ చరిత్ర అధ్యయనంతో దేశీయ చరిత్ర పరిణామాల సమ్మేళనంతో ప్రభుత్వాలను కుల మతాలకు అతీతంగా నడపాలని, సమాజాన్ని అభివృద్ధి పథంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరుతున్నాను. ఇదే నా కోరిక. ఇది నా చివరి కోరిక కాదు. పాస్ పోర్టు ఆధార్ కార్డు తప్ప వీసా అవసరం లేని విధంగా ప్రపంచీకరణ అందరి ఆమోదంతో శాంతియుతంగా సాగాలి. బుద్దుడు కోరిన శాంతియుత పరివర్తనను కోరుకుంటున్నాను. మరెన్నో కొత్త కోరికలున్నాయి కానీ ఈ కోరికలు నా కోసం కాదు.

-బిఎస్. రాములు

8331966987

Advertisement

Next Story

Most Viewed