- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కమల వికాసం కలా? నిజమా?
ఎన్నికలు సమీపిస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తీవ్రమైన ఒత్తిడితో నలుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో! స్పష్టత రావాల్సిన వేళ అయోమయం పెరుగుతోంది. కర్ణాటక ఫలితాల నుంచి పాఠం నేర్వడం సంగతలా ఉంచితే, బెంగాల్ చేదు అనుభవం నుంచి గుణపాఠం కూడా నేర్చినట్టు లేదు. తెలంగాణలో పాలక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ నాయకత్వం రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఆమేర వ్యవహార దక్షత చూపలేకపోతుంది. అయిదారు మాసాల్లో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని నాయకులంతా కలిసి ఏ స్థితికి తెస్తారో? అన్న ఆందోళన కార్యకర్తల్లో, అభిమానుల్లో రోజురోజుకూ బలపడుతోంది. పార్టీ బలపడటం లేదన్నది బెంగ!
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వం పెద్ద సమస్యగా ఉంది. బయటకు, ఏ సమస్యా లేదని, గంభీరంగా సర్ది చెప్పుకుంటున్నా...లోలోపల నిత్య సమస్యగా రగులుతూనే ఉంది. బండి ‘సంజయ్‌ను మారుస్తారు’, ‘లేదు ఆయన్నే కొనసాగిస్తారు’ అన్న రెండు మాటలపై జరిగినంత చర్చ పార్టీలో మరో అంశంపై జరగలేదంటే ఏ ఆశ్చర్యమూ లేదు. తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నుంచి తరుణ్‌చూగ్ ప్రాధాన్యతను క్రమంగా తప్పించడానికి ఇదీ ఒక కారణమే అంటారు. పార్టీని మరింత మెరుగుపరచే బాధ్యత ఇప్పుడు సునీల్ బన్సల్ చూస్తున్నారు. పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్‌కు ఇస్తారా? చర్చ ఉత్తగా గాలికి పుట్టిందేమీ కాదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాల స్థాయిలో చర్చించిన అంశమే అనే ప్రచారం బలంగా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కీలక నేత బి.ఎల్.సంతోష్‌లతో చర్చించి నిర్ణయించాలన్న ప్రధాని అభీష్టం తర్వాత ప్రతిష్టంభన ఏర్పడిరది. పార్టీ సంస్థాగత విస్తరణలో స్తబ్దత ఉంది. విభేదాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. జితేందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన భేటీ వంటివి ఇందుకు నిదర్శనం.
ప్రయోగం మళ్లీ వికటిస్తే
దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జెండా మోసిన వారికి, బయట్నుంచి వచ్చి పార్టీని వేగంగా బలోపేతం చేస్తామంటున్న వారికి మధ్య స్పర్ద ముదిరి ఘర్షణ స్థాయికొస్తోంది. ఎన్నికల ముందు ఇలావచ్చే వారికి అందలాలిచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటే పార్టీకి మేలుకన్నా కీడే ఎక్కువ అని ఒక వర్గం బలంగా చెబుతోంది. ఇప్పటికే కొందరిని అలా నెత్తిన ఎక్కించికున్నారని పార్టీలో పాత తరం వాపోతుంది. బెంగాల్‌లో ముకూల్‌రాయ్ వంటి నాయకులతో సహా చాలా మంది ఎన్నికల తర్వాత తిరిగి టీఎంసీలోకి వెళ్లిన అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. ఎంత చెప్పినా ఈటల ఓ ‘రాజకీయ శరణార్థి’, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుతో తనకు ఎదురైన పరిస్థితి దృష్ట్యా బీజేపీ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చారు తప్ప ఈ పార్టీ విధానాలు, సిద్దాంతాలు నచ్చి కాదు అంటున్న వారున్నారు. ఈటలతో ఢల్లీకి వెళ్లి బీజేపీ కండువాలు కప్పుకున్న అతని అనుచరులు హుజూరాబాద్ ఎన్నికలు పూర్తికాకముందే ఆ పార్టీని వీడిన ఘటనలను వారు ఉదహరిస్తున్నారు. మునుగోడులో బీజేపీ నుండి మూడుమార్లు పోటీ చేసిన డా.మనోహర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే ఢిల్లీ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపించాయి. ఓటమి తర్వాత రాజగోపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలే లేవు. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే దక్కింది ఒక్క సీటు. అదీ సిటీలోనే. 2019లో నాలుగు లోక్‌సభ స్థానాలు కూడా పార్టీకి అనుకూలంగా వీచిన గాలివల్ల లభించాయి, అది కూడా పార్టీ సిద్దాంతాల వల్ల తప్ప ‘నాయకుల’ వల్ల కాదనేది వారి విశ్లేషణ. కేంద్రంలో మంత్రి పదవికి బండి సంజయ్ సుముఖత చూపినట్టు లేదు. అలాగే, ఆయన అధ్యక్షతన ఏ ముఖ్య బాధ్యతల నిర్వహణకూ ఈటల వంటి వారు సిద్దంగా లేరు. పోనీ, ఈటలకు పార్టీ పగ్గాలు ఇస్తే....పార్టీని వీడే ఆలోచనలో కొందరున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ల మధ్య ఐక్యత లేదు. అందరూ కలిసి ఐక్యత చాటిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
ఆర్భాటాలేనా! నిలకడేది?
పార్టీలో చిట్‌చాట్‌లు, రహస్య సమావేశాలతో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. కొత్త నాయకులు చేరిన తర్వాత ప్రారంభమైన ఈ తరహా సన్నివేశాలను సిద్దాంతపరంగా పార్టీనే నమ్ముకొని ఉన్న పాత తరం నాయకులు వీటిని వినోదంగా వీక్షిస్తున్నారు. ఈ అవకాశవాద రాజకీయాలతో అధికారం అవసరమా అని ఆ తరం నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యాచరణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరగటం లేదు. ఎప్పుడు చూడు మోదీ, షా, నడ్డాలు ఇతర కేంద్ర మంత్రులో, ఇతర రాష్ట్రాల సీఎంలో, మాజీ సీఎంల సభలను, సమావేశాలను నమ్ముకోవడం, వాటిని చూపించి మీడియాలో బతికేయడం పార్టీ మనుగడుగా మారింది. ‘సాలుదొరా సెలువు దొరా’ ప్రచారం నినాదం తీసుకున్నారు అది ఎటుపోయిందో? ‘బూత్ కమిటీలు’ అన్నారు. అవి పూర్తిస్థాయిలో జరగడం లేదు. బస్సుయాత్రలు, కార్నర్ మీటింగ్స్ నియోజకవర్గ స్థాయి భేటీలు... ఇలా ఎన్నో ఆర్భాటపు ప్రకటనలు తప్ప నిలకడైన నిర్వహణ, ప్రభావవంతమైన కార్యాచరణ లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు పార్టీలో ఊపు తెచ్చినా..చాలాకాలం ఫ్లోర్ లీడర్ లేని పరిస్థితి. ప్రజాసమస్యలపై పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలే లేవు. సంస్థాగతంగా సిటీ, జిల్లాల నేతలతో లోతైన సమీక్షలు, భేటీలు లేకపోవడాన్ని పెద్ద లోపంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కేవలం మోదీ, షాలను వారి సమావేశాలను మాత్రం నమ్ముకుంటే కర్ణాటకలాంటి భంగపాటు తప్పదేమోనన్నది వారి భయంగా ఉంది.
పొంతన వద్దా?
పాలక పక్షాలతో బీజేపీది ‘లాలూచీ కుస్తీ’ అన్న విమర్శ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. ఏపీలో ‘నాలుగేళ్ల అవినీతి పాలన’ అని అమిత్‌షా స్థాయి నాయకుడు, హోం మంత్రి హోదాతో విమర్శిస్తున్నప్పుడు ఒక్క దర్యాప్తు ఎందుకు ఉండదు? పోనీ, పార్టీ ఏమైనా అక్కడ విపక్ష నేత చంద్రబాబు వైపు మళ్లీ మొగ్గుతోందా అనే సందేహాలకు తావిస్తుంది. ఏపీలో జగన్ సర్కారుపై విమర్శలు చేస్తూనే కేంద్రం నుండి అందించే సహకారం చూస్తుంటే ‘ముందు గిల్లీ...ఆ పై బుజ్జగించే’ వైఖరి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో... లిక్కర్ స్కామ్‌లో పాత్ర అని విమర్శించినపుడు దర్యాప్తులో ప్రగతి ఎందుకు లేదు? ‘కాళేశ్వరం’ను ఏటీఎంలా వాడుతున్నారని ఆరోపించినపుడు చర్యలెందుకు లేవు? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ‘జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా వ్యవహరిస్తున్న వారిపట్ల (బీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ వంటి పార్టీలను) పెద్ద పట్టింపు లేకుండా/చూసీ చూడనట్టు బీజేపీ ఉదారంగా ఉంటోంది’ అన్న ప్రచారం కూడా స్థానికంగా పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉంది. బయటి నుంచి వచ్చిన నాయకులకు పెద్దపెద్ద పదవులు కట్టబెట్టడాన్ని పాతతరం నేతలు జీర్ణించుకోవడం లేదు. డి.కె.అరుణ, పురందేశ్వరి వంటి వారికి మహిళా కోటాలో హోదాలు దక్కినా..ఈటల, వినోద్, గరికపాటి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నాయకులకు పార్టీ వదవులు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్న వారికి సరైన పదవులు లేక నిరుత్సాహంతో ఉన్నారు. అటు వారూ శ్రమించిక, ఇటు వీరూ కొత్తగా ఏమీ సాధించక పార్టీకి నికర ప్రయోజనాలు దొరకని పరిస్థితి నెలకొంది. మీడియాలో చేసే ప్రకటనలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు పొంతన లేని స్థితి వల్ల పార్టీ బలపడడం లేదనే భావన పెరిగింది. ఇటువంటి విషయాలపై అగ్ర నాయకత్వం సమీక్షించాలి.
విపక్షంగా విఫలం
ఐదు విడతలుగా చేసిన బండి సంజయ్ పాదయాత్ర ప్రభావం ఏంటో పార్టీ ఇంతవరకు విశ్లేషించలే! ‘వరివేస్తే ఉరి’ అని పాలకపక్షం రైతుల్ని హెచ్చరించినా, దేశంలోనే అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేస్తున్నామని తిరిగి జబ్బలు చరుచుకున్నా, పరస్పర విరుద్దమైన పాలకపక్ష వైఖరి మీద ప్రతిపక్షంగా బీజేపీ ఏమీ చేయలేకపోయిందనే భావన ప్రజల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రను చాటి చెప్పడంలో, తెలంగాణ సమాజంతో కనెక్ట్ అయి అస్తిత్వానికి ప్రతీకగా నిలవటంలో పార్టీ స్థానిక నాయకత్వం విఫలమైంది. సోషల్ మీడియా నిర్వహణలో బీజేపీది పెద్దపేరే అయినా పలువురు సీనియర్ నాయకులు వ్యక్తిగత టీమ్‌ల దూకుడు, పరస్పర వ్యతిరేక ప్రచారాలు వల్ల ప్రయోజనాలకన్నా కీడే ఎక్కువ జరుగుతోంది. ‘తమ నాయకుడే గొప్ప’ అనే వ్యక్తిగత ప్రచారాలు స్థూలంగా పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి.
అయోమయంలో అధినాయకత్వం
లోగడ ఎప్పుడూ లేనంత అనైక్యత, కుమ్ములాటల్లో కూరుకుపోయి ఉంది తెలంగాణ బీజేపీ. ఏపీలోనూ నిలువునా చీలి ఉంది. చంద్రబాబు అనుకూల, ప్రతికూల ముఠాలుగా ఇదివరకటి నుంచి ఉన్నట్టే...ఇప్పుడూ పాలకపక్షం వైసీపీ పట్ల ద్వైదీ భావంతో ఉంది స్థానిక నాయకత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్ల సానుకూలం ఒక వర్గం, కటువుగా వ్యతిరేకిస్తూ మరో వర్గం. ఆయా వర్గాలను సమన్వయ పరచడం ఢిల్లీ నాయకత్వానికి సవాలే! ఇక సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నాయకులు పార్టీ కన్నా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటారనే అభిప్రాయం ప్రజాక్షేత్రంలో బలంగా ఉంది. ఏపీతో పాటు తెలంగాణలో పార్టీ బాగుకు నిర్దిష్టంగా ఏం చర్యలు తీసుకోవాలో పాలుపోని ‘క్లూలెస్’ స్థితిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎదుర్కొంటోంది. వైఎస్సార్ చనిపోయిన కొత్తలో....ఉమ్మడి ఏపీలో ‘ఏం చేయాలో తోచని’ కాంగ్రెస్ అగ్రనాయకత్వం సంకటస్థితినే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఎదుర్కొంటోంది. ఒకవైపు పార్టీని చక్కదిద్దుకుంటూ మరోపక్క జనాభిమానాన్ని చూరగొనాలి! జనాభిప్రాయాన్ని బట్టే పార్టీ మనుగడ! ‘‘కమల వికాసాని’’కి ప్రజాశీస్సులనే సూర్య కాంతియే దిక్కు. జన విశ్వాసం సడలితే... శతకకారుడు చెప్పినట్టు ‘‘కమలములు నీట బాసిన కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్...’’ పతనం తప్పదు. సూర్యకాంతియే దిక్కు తర్వాత… పార్టీ సంస్థాగత బలం నిరంతరం అందే నీరు వంటిది. ఆ బురద నుంచి కమల వికాసం జరగాలి అంటే పార్టీ నాయకత్వం అన్ని స్థాయిలో నిజాయితీతో కూడిన ఆత్మవిమర్శ చేసుకోవాలి.
దిలీప్‌రెడ్డి
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
99490 99802