- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దక్షిణాదిన.. బీజేపీకి గడ్డు కాలమే!
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే దిశగా హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. ఉత్తరాదిన ఆధిపత్యం కొనసాగిస్తున్న బీజేపీకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీల నుండి గట్టి సవాలు ఎదురవుతుండడంతో అక్కడ జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి దక్షిణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది. దక్షిణాదిలో 130కి పైగా ఉన్న స్థానాలతో పాటు మహారాష్ట్ర, గోవాలోని స్థానాలను కూడా కలుపుకొని మొత్తం 170 ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయా రాష్ట్రాల నేతలకు పార్టీ హైకమాండ్ ఈ సమావేశంలో దశానిర్దేశం చేసింది. పార్టీ అధ్యక్షుడితో సహా, కీలక జాతీయ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో దక్షిణాదిన పార్టీ మంచి ఫలితాలను సాధించాలని టార్గెట్‌లు పెడుతూ సూచనలు చేసినా, ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితులను చూస్తే వీరు నేలవిడిచి సాము చేస్తున్నారేమో అనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను పట్టించుకోకుండా కాగితంపై లెక్కలేసుకుంటూ ఆయా రాష్ట్రాలలో ఇన్ని సీట్లున్నాయి వాటిలో ఇన్ని సీట్లు గెలవాలని లక్ష్యాలను పెట్టుకుంటున్నారా అంటే వాస్తవిక పరిస్థితులు అవుననే అంటున్నాయి. ప్రధానంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత దక్షిణాదిలో ఇప్పుడున్న స్థానాలను నిలుపుకుంటే ఆ పార్టీకి అదే పదివేలు.
గత స్థానాలు రావడమే గగనం....
దక్షిణ భారత దేశంలో ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదిచ్చేరి, అండోమాన్ నికోమార్, లక్షద్వీప్‌లలో మొత్తం 133 స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండోసారి మోదీ గాలి వీచి 303 స్థానాలు సాధించినా, దక్షిణాదిలో మాత్రం 133కు గాను బీజేపీ కేవలం 30 సీట్లు మాత్రమే సాధించింది. కర్ణాటకలో ఆ పార్టీ 25 సీట్లు గెలవగ, ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చారు. తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని 84 సీట్లలో ఒక్క చోట కూడా గెలవలేదు. ఈ రాష్ట్రాలతో పాటు లక్ష్యంగా పెట్టుకున్న మహారాష్ట్ర, గోవాలలో 2019లో మహారాష్ట్రలో 48 సీట్లకు గాను అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి 42 స్థానాలను, గోవాలో రెండింటికి రెండు గెలిచింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో సాధించిన లెక్కలను అనేక పరిణామాల తర్వాత ప్రస్తుత పరిస్థితులతో పరిశీలిస్తే బీజేపీ లక్ష్యం నీరుగారే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని గత ఎన్నికల మిత్రులు ఉద్దవ్ ఠాక్రేతో బీజేపీకి శత్రుత్వం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్దవ్ రాక్రే శివసేనలతో కూడిన మహాఘట్‌బంధన్ రోజురోజుకు బలపడుతోంది. శివసేన, ఎన్సీపీలలో చీలిక రావడం ప్రభుత్వాలు మారడంతో రాష్ట్రంలో ఏర్పడుతున్న అనిశ్చితికి బీజేపీయే ప్రధాన కారణమనే భావనతో అక్కడ ఆ పార్టీకి నష్టం చేకూర్చి, యూపీఏకు ఆదరణ లభించే అవకాశాలున్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రెండు సీట్లున్న గోవా ప్రభావం తక్కువగానే ఉంటుంది. తెలుగేతర దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా తమిళనాడు (39), కేరళ (20)లో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే. ఈ రెండు రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో బీజేపీ ఒక సీటు గెలవడం కూడా గొప్పే. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక సీటు కూడా రాలేదు. ప్రస్తుతం తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే కూడా బీజేపీ ధోరణితో వేరు కుంపటి పెట్టుకుంటోంది. దీంతో ఈ సారి కూడా అక్కడ శూన్య హస్తం అవకాశాలే ఉన్నాయి. ఇక కేరళలో ఎప్పటి నుంచో ఖాతా తెరవాలని కంకణం కట్టుకున్న కాషాయ పార్టీకి మరోసారి ఆశాభంగమే ఎదురుకావచ్చు. కర్ణాటకలో గత పార్లమెంట్ ఎన్నికల్లో పాతిక స్థానాలు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత వాటిలో సగం నిలుపుకోవడం కూడా కష్టమే. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ఏర్పడిన గ్రూపులు ఆ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అందలమెక్కిన కాంగ్రెస్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించే అవకాశాలుండడంతో బీజేపీకి అక్కడ గట్టి పోటీ ఎదురవడం ఖాయం.
తెలుగునాట అంతంతే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలలో బీజేపీ ఒక్క స్థానం కూడా సాధించలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలోతొక్కి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉండడంతో ఆ పార్టీ ‘నోటా’తో పోటీపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జనసేనతో పొత్తు ఉందని బయట ప్రచారం అవుతున్నా, రెండు పార్టీలు కలిసిమెలిసి నిర్వహించిన కార్యక్రమం ఒక్కటీ లేదు. మరోవైపు ఒకసారి జగన్‌తో, మరోసారి చంద్రబాబుతో బీజేపీ అవగాహన కుదుర్చుకుంటుందనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. విభజన హామీలపై కేంద్రం కప్పదాటు ధోరణితో పాటు ఆ పార్టీపై మైనార్టీల వ్యతిరేకత తమకు నష్టం కలిగిస్తాయనే అభద్రతా భావం వైసీపీ, టీడీపీ పార్టీలలో అంతర్గతంగా నెలకొని ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకం. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచిన బీజేపీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని నాలుగున్నరేళ్లుగా ఊదరగొట్టినా తీరా ఎన్నికల యుద్ధం సమీపించే సమయానికి అస్త్రసన్యాసం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుగుతుంటే, బీజేపీ కరిగిపోతూ ఉంది. కేసీఆర్‌ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీలో చేరిన పలువురు ఇతర పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు జారుకుంటున్నారు. దీనికి బీజేపీ కేంద్ర నాయకత్వానిదే తప్పిదమని పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై నోటిమాటగా మోడీ మొదలు చోటా మోటా నాయకులు వరకు విమర్శిస్తున్నా ఆచరణలో మాత్రం బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే అనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. లిక్కర్ స్కాంపై నానా హడావుడి చేసిన బీజేపీ కవిత విషయంలో కప్పదాటు ధోరణి వైఖరి ఆ పార్టీపై అనేక అనుమానాలు రేకెత్తించడంతో ఆ పార్టీని నమ్ముకున్న నేతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. రాష్ట్ర నేతల మధ్య సమన్వయం చేయడంలో విఫలమైన కేంద్ర నాయకత్వం పార్టీలో వర్గాలను పోషించడంతో విభేదాలు తీవ్రస్థాయికి చేరి పార్టీకి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. 2019లో గెలిచిన నలుగురు ఎంపీలు కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా సాగుతూ వారి నియోజకవర్గాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజల్లో వారిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఊహించని విధంగా ఎదిగిన బీజేపీ స్వయంకృపరాధంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుందనే భావన పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలపై మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి బీజేపీకి తీవ్ర నష్టం చేకూర్చడం ఖాయం.
మిత్రపక్షాల కోసం తహతహ!
రెండు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్‌డీఏలోని మిత్రపక్షాలపట్ల చిన్నచూపు వైఖరి ప్రదర్శించింది. 1998, 99లో ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో 20కి పైగా మిత్రపక్షాలుండగా, 2014 ఎన్నికల్లో టీడీపీతో సహా 24 పార్టీలుండేవి. ప్రాంతీయ ప్రాంతాల సహాయసహకారాలతో వివిధ రాష్ట్రాల్లో బలపడిన బీజేపీ అనంతరం ఆ పార్టీలను బలహీనపరచడమే లక్ష్యంగా అడుగులు వేసింది. బీజేపీ ఆధిపత్యాన్ని భరించలేక పలు పార్టీలు కూటమిని వీడడంతో ఇప్పుడు ఎన్‌డీఏలో చిన్నాచితక పార్టీలను కలుపుకొని పదిలోపే మిత్రపక్షాలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్య కూటమికి ప్రయత్నిస్తుండడం, అదే సమయంలో ఎన్‌డీఏలోని మిత్రపక్షాలు దూరమవుతుండడంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో మిత్రుత్వం కోసం తహతహలాడుతోంది. అకాలీదల్, జేడీ(ఎస్), టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలతో దోస్తానాకు ప్రయత్నిస్తోంది. బీజేపీ అవకాశవాద రాజకీయ రుచి చూసిన ప్రాంతీయ పార్టీలు కూడా ఆచితూచి అడుగులేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఉత్తరాదిలో సత్ఫలితాలిస్తున్న వ్యూహాలు దక్షిణాదిలో ఎందుకు విఫలమవుతున్నాయని హైదరాబాద్ సమావేశంలో అగ్రనేతలు సమీక్షించినట్టు వార్తలున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో రాజకీయ వాతావరణం భిన్నమైనది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. ప్రాంతీయత వాదానికి ప్రాధాన్యతెక్కువ. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో మతావేశాల అంశాలకు ప్రాధాన్యతెక్కువ. ఈ సత్యాన్ని విస్మరించి భావోద్వేగాలతోనే అందలమెక్కుదామనుకుంటే ఇక్కడ బీజేపీ పప్పులో కాలేసినట్టే. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా దక్షిణాదిలో అధిక స్థానాలు సాధించాలనే భావనతో ఎన్ని సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నా అవి సమావేశాలకు, కాగితాలకే పరిమితమవుతాయి కానీ వాటికి ప్రజామోదం లభించవని తెలుసుకుంటేనే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మనుగడ ఉంటుంది.
-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ