- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీసీ నినాదమే బీజేపీ ఆయుధం!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న మహా ఉద్యమం. తెలంగాణ ప్రతి పల్లెలోని సబ్బండ వర్గాలు మమేకమై స్వరాష్ట్ర కాంక్షను చాటింది ఈ ఉద్యమం. ఎంతోమంది అమరుల ఆత్మత్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్ర సాకారం అయింది. స్వరాష్ట్ర సాధనలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల త్యాగఫలం చారిత్రాత్మకమైనది.. ఎంతోమంది బలహీన వర్గాల బిడ్డలు తమ గురించి.. తమ కుటుంబం గురించి కాకుండా స్వరాష్ట్రం కావాలని విశ్వసించి అగ్నికి ఆహుతి అయ్యారు, ఉరికొయ్యకు వేలాడారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వం అమరుల త్యాగాలను, బలహీనవర్గాల బలిదానాలను పూర్తిగా విస్మరించి అవినీతి అహంకార కుటుంబ పాలనతో తెలంగాణను పూర్తిగా నాశనం చేస్తోంది.
బీసీలను ఆగౌరవపరిచేలా..
కానీ మరోవైపు 2014లో కేంద్రంలో దేశ ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతోంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్ది పాలనలో క్రియాత్మక పాత్రను అప్పజెప్పి దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా చేసింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడంతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా దేశవ్యాప్తంగా బీజేపీకి 85 మంది ఓబీసీ ఎంపీలు, 365 మంది ఓబీసీ శాసనసభ్యులు ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా జనాభా గల బీసీలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో అద్భుతమైన సామాజిక సామరస్యతకు నిదర్శనం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండకపోవడం, తెలంగాణ పురోగతికి ఇప్పటికైనా మంచిది కాదని భావించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ అద్భుతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత తెలంగాణలోని మిగతా రాజకీయ పార్టీలలో తీవ్రమైన అలజడి చెలరేగింది. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత ప్రజల్లో చైతన్యం రావడం జనాభా ప్రాతిపదికనగా 50% పైగా బీసీలు ఉండటం ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపుతుందని అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా భావించి వికృత రాజకీయ క్రీడకు తెర లేపారు. కులం కాదు గుణం అంటూ కేటీఆర్... అక్కడక్కడ ఉన్న బీసీలను గెలిపించండి అంటూ అవమానించేలా కేసీఆర్... వీళ్ళు బీసీలను ముఖ్యమంత్రి ఎలా చేస్తారు అంటూ రాహుల్ గాంధీ... బీసీలను అగౌరపరిచేలా వరుస ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ప్రారంభమైన నిశ్శబ్ద విప్లవం..
బీజేపీకి సైద్ధాంతిక బలంతో పాటు విశ్వసనీయత మరో ఆయుధం. వాజ్‌పాయ్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేసింది... అలాగే నరేంద్ర మోడీ హయాంలో ఎస్సీ వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ని, మరోసారి ప్రస్తుతం దేశ చరిత్రలోనే తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసింది. కానీ ప్రతిసారీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను దేశ ప్రథమ పౌరులుగా చేసే క్రమంలో అడ్డంకులు సృష్టించి వారికి వ్యతిరేకంగా వేరే అభ్యర్థులను నిలిపి బలహీన వర్గాల నాయకత్వం పట్ల వారికి గల చిన్న చూపును నిర్లక్ష్య వైఖరిని బహిరంగపరిచారు. దేశంలో అమలయ్యే ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేవలం సంక్షేమమే కాకుండా వారి సమగ్ర సమీకృత అభివృద్ధికి మోడీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. అభివృద్ధితో పాటు బలహీన వర్గాలకు అధికారం అప్పచెప్పితే సమస్యల మూలాల నుండి పరిష్కారం లభిస్తుందని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎంపిక. ఇదే తరహాలో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. బీజేపీ సామాజిక సమరసత విధానాల ప్రభావాన్ని అంచనా వేయడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం చెందాయి. పసుపు బోర్డు.. గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో పాటు ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కేటాయించడం లాంటి ప్రకటనలు రాష్ట్రంలో ఓటర్ల ఆలోచన సరళిని పూర్తిగా మార్చి వేసింది. నరేంద్ర మోడీ చరిష్మా, సంక్షేమ పథకాల అమలు.. బలహీన వర్గాలకు నాయకత్వం ఎన్నికల్లో కీలక పాత్ర వహించబోతున్నాయి. దశాబ్దాలుగా నాయకత్వానికి దూరంగా ఉన్న వర్గాలు నేడు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైంది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ఐక్యత తెలంగాణ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేసే అవకాశం ఉంది. అందుకే బీజేపీకి మద్దతుగా నిలిచి మన నాయకత్వంతో మన అణచివేత సంకెళ్లను మనమే పూర్తిగా తెంచుకుందాం.
- మాచనపల్లి శ్రీధర్ ముదిరాజ్
సీనియర్ జర్నలిస్ట్
90527 89666