కుట్రలకు బలైన హసీనా..

by Ravi |   ( Updated:2024-08-08 01:01:06.0  )
కుట్రలకు బలైన హసీనా..
X

స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించడంలో తనదైన మార్క్ పాలనను చూపిన షేక్ హసీనా ప్రభుత్వం నేడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో కుప్పకూలిపోయింది. అల్లకల్లోలం అవుతున్న బంగ్లాను సైన్యం చేతుల్లోకి తీసుకుంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన హసీనా ప్రభుత్వాన్ని అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూనస్‌ను సారథిగా నియమించారు.

బంగ్లాదేశ్‌లో హసీనా తనదైన రాజకీయ చతురతతో రాజకీయ ప్రత్యర్థులను దాదాపుగా నిస్సహాయులను చేసి ‘ఉక్కు మహిళగా’ గుర్తింపు తెచ్చుకున్నారు కానీ, తన తండ్రి తెచ్చిన రిజర్వేషన్ల కోటా ఆమె పాలిట సంకటమై అనూ‌హ్యంగా పదవీచ్యుతురాలిని చేసి, దేశాన్ని వీడాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది.

హసీనా జీవితం ఓ యుద్ధం!

షేక్ హసీనా.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న పేరు. భారత్ సహాయంతో 19 71లో పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించి, బంగబంధుగా, దేశానికి పాకిస్తాన్ నుండి విముక్తి కల్పించిన జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ బిడ్డగా, ప్రపంచంలోనే అత్యధిక కాలం ఏలిన మహిళా దేశాధినేతగా.. బంగ్లాదేశ్‌ను అభివృద్ధి పథాన నడిపిన ఐరన్ లేడిగా ఇలా ఎన్నో కీర్తి కిరీటాల్ని సొంతం చేసుకున్న నాయకురాలు. 1975 ఆగస్టు 15న దేశ ప్రధాని హోదాలో అధికారిక నివాసంలో ఉన్న తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌ను, ‌తన కుటుంబం మొత్తాన్ని ఆర్మీ అధికారులు చుట్టుముట్టి హతమార్చారు. ఆ సమయంలో షేక్ హసీనా, ఆమె సోదరి రెహానా మాత్రం జర్మనీలో ఉండటంతో ఈ మారణకాండ నుండి ఆమె తప్పించుకున్నారు. దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన తన తండ్రినీ మొత్తం కుటుంబంతో సహా దేశ ఆర్మీ అధికారులు దారుణంగా హత్య చేయడం ఆమెను దిగ్భ్రాం తికి గురిచేసింది. అలాంటి పరిస్థితుల నుండి బంగ్లా ప్రధాని అయ్యే వరకు ఆమె ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ దాన్నే తలచుకుని కుమిలిపోలేదు. కుటుం బాన్ని పొట్టనబెట్టుకున్న దేశంగా బంగ్లాను ద్వేషించలేదు.

తిరుగులేని నేతగా ఎదిగి..

ఆరేండ్ల పాటు భారత్ ఆశ్రయంలో ఉన్న ఆమె, దేశానికి తిరిగొచ్చి దేశ రాజకీయాల్లో చురుకై న పాత్రను పోషించారు. 1981లో తన తండ్రి స్థాపించిన అవామీలీగ్ పార్టీకి అధినేత్రిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ 1991 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీని సాధించలేకపోయింది. కానీ 1996 ఎన్నికల్లో విజయంతో ప్రధాని పీఠం అధిరోహించింది హసీనా. మళ్లీ 2001లో ఓడిపోయింది. మళ్లీ 2008 ఎన్నిక ల్లో అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన హసీనా దేశంలో రాజకీయ సుస్థిరతకు బాటలు వేసి, సైనిక పాలనలో మగ్గిన దేశానికి ప్రజాస్వామ్య పాలనతో ప్రాణం పోశారు. నాటి నుంచి నేటి వరకు ఆమెదే అప్రతిహత పాలన..! ఆర్థిక సంస్కరణలతో దేశం దిశ దశను మార్చిన హసీనా, అదే స్థాయిలో తన నియంత పోకడలను ప్రదర్శించారనే విమర్శ లు సైతం ఉన్నాయి. తనపై 19సార్లు హత్య ప్రయత్నాలు జరిగినా పార్టీ నేతలే కవచంలాగా మారి కాపాడుకున్నారు. ఎన్నో రాజకీయ నిర్బంధాలను ఎదుర్కొని నిలదొక్కుకున్న హసీనాను ఆమె రాజకీయ ప్రత్యర్థులు నియంతగా అభివర్ణిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులను మాత్రం నిస్సహాయ స్థితిలో నెట్టి ఆమె తిరుగులేని నేతగా ఎదిగారు.

కోటా రగిల్చిన చిచ్చు..

1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన వారి కుటుంబాలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు, వీరాంగనలకు అంటే ఉద్యమంలో బాధింపబడిన మహిళలకు 10 శాతం రిజర్వేషన్లను రెహ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆ రిజర్వేషన్లు నేటి కాలంలో అంద రికీ ఆమోదయోగ్యం కాలేదు. ప్రజాభీష్టం మేర కు ఆ రిజర్వేషన్ కోటాను హసీనా ప్రభుత్వం తొలగించినప్పటికీ సమరయోధుల కుటుంబా లు కోర్టుకెళ్లడం, కోర్టు రిజర్వేషన్లను రద్దు చేయొద్దని సూచించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్లను పునరుద్ధరించడం ఈ పునరుద్ధరణను విద్యార్థులు ఒప్పుకోక నిరసనగా యూనివర్సిటీల విద్యార్థు లు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి ‘అధికార అవామీలీగ్ పార్టీ విధేయులను సివిల్ సర్వీస్ ఉద్యోగా ల్లో నింపేందుకు సమరయోధుల రిజర్వేషన్ కోటా ఉపయోగపడుతుంద’ని ఆరోపణలు చేయగా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నెలరోజుల పాటు తీర్పును నిలిపివేసింది. కోర్టు అంతిమంగా రిజర్వేషన్లను కుదించినా నిర సనలు మిన్నంటాయి. నిరసనల్లో పాల్గొన్న వారికి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు జరుగగా 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2500 మంది గాయపడ్డారు. పర్యవసానంగా హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

నిరంకుశ పాలకురాలిగా..

దేశంలో సైన్యం పెత్తనం, తిరుగుబాట్లతో అల్లకల్లోలం అవుతున్నప్పుడు.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా కనుమరుగు అవుతుందన్న సమయంలో.. దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన హసీనా ప్రజాస్వామ్య పునరుద్ధరణకై కం కణం కట్టుకుని పనిచేశారు. అయితే, అదే స్థాయిలో ఆమెపై నిరంకుశవాది అనే విమర్శలు సైతం ఉన్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను హసీనా వాజెద్ ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడడం, రిజర్వేషన్ల రద్దు ఉద్యమ నిరసనకారులను ‘పాకిస్థానీ రజాకర్లతో’ పోల్చడంతో ప్రధాని హసీనాపై ప్రజాగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.. ఇక సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో తమ పార్టీ విధేయులకు ఈ రిజర్వేషన్ వాడుకుని దేశానికి అవినీతి పాలనను అందిస్తుందనే విమర్శలు లేకపోలేదు..

బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడే కెరటం మాదిరిగా సాగిన హసీనా రాజకీయ ప్రస్థానం... ఎర్షాద్, జియావుర్ రహమాన్ లాంటి సైనిక నియంత పాలకుల పాలనను తిరగరాసి ప్రజాస్వామ్యానికి జీవం పోసింది. దేశ రాజకీయాల్లో ధీర, సుదీర్ఘ మహిళా ప్రభుత్వాధినేతగా పేరుగాంచిన హసీనా విపక్షాల కుట్రలతో పాటు, నిరంకుశ పాలన విధానాలతో తన పదవికి రాజీనామా చేసి, దేశం వీడారు. ఏదేమైనా బంగ్లాదేశ్ దిశ దశను మార్చిన నేతగా ఆమెది చెరగని ముద్ర. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌కు గత మిలటరీ అధికారుల తీరున మరొక నియంతగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు జరిపించి రాజకీయ అస్థిరతను తొలగించాల్సిన గురుతర బాధ్యత ఆ దేశ నాయకులపై ఉంది.

-పిన్నింటి విజయ్ కుమార్

విద్యార్థి నేత, కేయూ

90520 39109

Advertisement

Next Story

Most Viewed