- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కథా-సంవేదన:బెయిల్
ఆ కోర్టు న్యాయమూర్తి బదిలీ జరిగి మూడు నెలలవుతోంది. ఆ పట్టణానికి పక్కన ఉన్న మేజిస్ట్రేట్ ఇన్‌చార్జి. ప్రతి మంగళ, గురువారాలలో ఇక్కడికి వస్తున్నారు. అది ఆయన వచ్చే రోజు. అందుకని కోర్టు సందడిగా ఉంది. ఆ కోర్టు బిల్డింగ్‌ని నాలుగు సంవత్సరాల క్రితం కట్టారు. సరైన వసతులు లేవు. క్లయింట్స్ కూర్చోవడానికి సరైన స్థలం లేదు. అందుకని చాలా మంది కోర్టు బిల్డింగ్ ముందు ఉన్న చెట్ల కింద, పక్కనే ఉన్న చాయ్ దుకాణం ముందు నిల్చొని వున్నారు. మనోవర్తి కోసం వచ్చిన ఆడవాళ్లతోని, భూమి గెట్ల పంచాయతీ కోసం వచ్చిన వాళ్లతోని, బాకీ కట్టని వ్యక్తులతోని, రోడ్డు మీద అల్లరి చేసిన వ్యక్తులతోని, దారి వెంట కన్పించిన ఆడవాళ్లని ఏడిపించిన కుర్రాళ్లతోని, తప్పుడు కేసులలో ఇరికించినవారితోని, దోపిడీలు, హత్యలు, నక్సలైట్ కేసులలో ఇరుక్కున్నవాళ్లతోని, వాళ్ల వెంట వచ్చినవాళ్లతోని, తల్లిదండ్రులతోని, పోలీసులతోని, ఖైదీలతోని, తప్పుడు సాక్ష్యం ఇచ్చే సాక్షులతోని హడావుడిగా ఉంది.
*
మేజిస్ట్రేట్ రెండు రోజులు ఇన్‌చార్జ్ కోర్టులో, మిగతా రోజులు రెగ్యూలర్ కోర్టులో పని చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి కేసులు వస్తాయి. కోర్టు హాలు ఇరుకుగా ఉంది. న్యాయవాదుల సంఖ్య పెరగడంతో కోర్టు మరీ చిన్నదిగా అన్పిస్తోంది. డాక్టర్లు, పోలీసు అధికారులు వస్తే మరీ ఇరుకుగా అన్పిస్తుంది. సాక్ష్యం ఇవ్వడానికి బోను ఉంది గానీ, ముద్దాయిలు నిల్చోవడానికీ సరిగా స్థలం లేదు. ఓ వరకట్నం కేసు విచారణ జరుగుతోంది. సాక్ష్యం బలంగా ఉండడంతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా సీరియస్‌గా జరుగుతోంది. చాలా మంది అడ్వకేట్స్ కోర్టు హాల్లోనే కూర్చోని ఉన్నారు.
*
మేజిస్ట్రేట్ కేసు వాదనలు వింటున్నారు. రౌండ్ టేబుల్‌ను ఆనుకొని అడ్వకేట్ హన్మంతరెడ్డి కూర్చుని ఉన్నారు. మూడు సంవత్సరాలుగా అదే కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఈ మధ్యే అతని ప్రాక్టిస్ మెరుగుపడింది. ఈ కేసు తరువాత ఆయన కేసులో సాక్ష్యం ఉంది. సరిగా అప్పడే అతని దగ్గరికి వచ్చాడు అతని క్లర్క్ రామబ్రహ్మం. 'మీకోసం ఎవరో క్లయింట్స్ వచ్చార్ సార్! బయట వెయిట్ చేస్తున్నారు' మెల్లగా అతని చెవిలో చెప్పాడు. హన్మంతరెడ్డి లేచి కోర్టుకు నమస్కరిస్తూ బయటకు వచ్చాడు. కృష్ణారెడ్డి కన్పించాడు. అతనికి 35 సంవత్సరాలు ఉంటాయి. చదువు ముగించాకా రాజకీయాలలోకి వెళ్లాడు. ఊరి సర్పంచ్ కూడా. కృష్ణారెడ్డి తమ్ముడు రాఘవరెడ్డి, హన్మంతరెడ్డి ఇద్దరూ యూనివర్సిటీలో రూంమేట్స్. దాంతో క్రిష్ణారెడ్డితో చాలా చనువుంది హన్మంత రెడ్డికి. రాఘవరెడ్డి మరో కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తున్నాడు.
*
'ఎటో వచ్చినవ్ అన్నా' అంటూ పలకరించాడు. ఇద్దరూ కలిసి బార్ రూంకి వెళ్లారు. అక్కడ మాట్లాడితే కోర్టుకి అంతరాయం కలుగుతుందని భావించి. 'ఇక్కడికే వచ్చిన నీ దగ్గరే చిన్న పనుంది. మా మేనల్లుడి మీద ప్రత్యర్థులు అన్యాయంగా ఓ నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. మేజిస్ట్రేట్ ఇక్కడ ఉన్నాడని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. మీతో బెయిల్ దరఖాస్తు పెట్టించమని చెప్పాడు తమ్ముడు. చెప్పాడు కృష్ణారెడ్డి. వాళ్లని తీసుకొని వచ్చారా? తీసుకొని వస్తున్నారు. కేసు వివరాలన్ని తెలుసుకున్నాడు హన్మంతరెడ్డి. చాయ్ తెప్పించాడు. ఇద్దరూ చాయ్ తాగారు. జమానత్ తీసుకొచ్చారా? అడిగాడు. తెచ్చాం అన్నారు వాళ్లు. అరగంట తరువాత పోలీసులు కృష్ణారెడ్డి మేనల్లుడిని కోర్టుకు తీసుకొని వచ్చారు. రిమాండ్ రిపోర్ట్ తీసుకొని చదివి తిరిగి ఇచ్చేసాడు హన్మంతరెడ్డి. టైపిస్టుల దగ్గరికి వెళ్లి బెయిల్ దరఖాస్తు డిక్టేట్ చేశాడు.
*
సె.506 ఐపీసీ కూడా జత చేశారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కూడా రిమాండ్ రిపోర్టులో రాశారు. ఇలాంటి కేసులలో వెంటనే బెయిల్ ఇవ్వడం లేదు. అయినా, ఇది తప్పుడు కేసు. అదే విషయం కోర్టు వారికి చెబుతాను అన్నాడు కృష్ణారెడ్డితో ముందు జాగ్రత్తగా. ఎలాగైనా సరే వాడు ఇవ్వాళే విడుదల కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అన్నాడు కృష్ణారెడ్డి. ఈ రోజు బెయిల్ దొరకకపోతే ఊరిలో పరువు దెబ్బతింటుందన్న విషయం అర్థమవుతూనే ఉంది. 'దొరకదని నేనడం లేదు ఈ కేసులన్ని తప్పుడు కేసులని అందరికీ తెల్సిందే' అన్నాడు న్యాయవాది. టైప్ చేసిన కాగితాలు తీసుకొచ్చాడు రామబ్రహ్మం. వాటిని చదివి సంతకం చేసి ప్రాసిక్యూటర్‌కి నోటిసు ఇచ్చి రమ్మని చెప్పాడు. ఫైల్ తీసుకొని కోర్టు హాల్లో కూర్చున్నాడు. అన్ని కేసులు వాయిదా పడ్డాయి. ఐదు గంటలు కావొస్తుంది. మేజిస్ట్రేట్ బెంచ్ దిగడంతో అడ్వకేట్స్ అందరూ అసోసియేషన్ రూంకి వెళ్లిపోయారు.
*
హన్మంతరెడ్డి అలాగే కోర్టు హాల్లో కూర్చోని ఉన్నాడు. ఇంకా కృష్ణారెడ్డి మేనల్లుడిని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయలేదు. పావు గంట తర్వాత చాంబర్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్లతోబాటూ హన్మంతరెడ్డి కూడా వెళ్లాడు. నిందితుడిని రిమాండ్ చేశాడు మేజిస్ట్రేట్. 'బెయిల్ పిటిషన్ వేస్తున్నాను సార్' అన్నాడు హన్మంతరెడ్డి. అది మీ కోర్టు కాదు కదా? అవును సార్. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా? అవును సార్ కానీ. తప్పుడు కేసు సార్. ఆ కోర్టు అడ్వకేట్స్ అందరూ నాకు ట్రాన్స్‌ఫర్ కావాలని బాయ్‌కాట్ చేస్తున్నారు మీకు తెలుసు కదా? తెలుసు సార్. అందుకని నేను బెయిల్ ఇవ్వదల్చుకోలేదు. ఎవరో అక్కడి న్యాయవాదులు రెఫర్ చేసి ఉంటారు కదా? అన్నాడు మేజిస్ట్రేట్. 'అది కాదు సార్' ఏదో చెప్పబోయాడు రెడ్డి. 'నో మిస్టర్ రెడ్డి వాళ్లు నా కోర్టుకి రారు కానీ, బెయిల్ కోసం మీలాంటి వాళ్ల దగ్గరికి పంపిస్తారు ఏమన్నా రీజనింగ్ ఉందా?
*
'అడ్వకేట్స్ తప్పిదాలకి ముద్దాయిలు' అంటూ సగంలోనే ఆగాడు రెడ్డి. 'మీరు వేస్తే వేయండి ఫలితం మాత్రం డిస్మిసలే ఉంటుంది' అన్నాడు మేజిస్ట్రేట్. చేసేదేం లేక హన్మంతరెడ్డి నిరాసక్తంగా బయటకు వచ్చి కృష్ణారెడ్డికి విషయం అంతా చెప్పాడు. ప్రయత్నం చేయండి అన్నాడు అతను. లాభం లేదు ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడు రాఘవకి చెప్పండి అని పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు. అరగంట గడిచింది. 'సాబ్' అన్న పిలుపు వినిపించి పేపర్ నుంచి బయటకు చూశాడు రెడ్డి. 'దొర మిమ్మల్ని రమ్మంటున్నారు' కోర్టు జవాన్ చెప్పాడు. మేజిస్ట్రేట్ మనస్సు మార్చుకున్నారేమో అని ఉత్సహపడి చాంబర్‌లోకి వెళ్లాడు రెడ్డి. 'మిస్టర్ రెడ్డి ఇంతకు ముందు మీరు చెప్పిన కేసులో బెయిల్ దరఖాస్తు వేయండి. ఇస్తాను' అన్నాడు మేజిస్ట్రేట్. గట్టి నిర్ణయం తీసుకున్న మేజిస్ట్రేట్ ఇంత త్వరగా మనస్సు ఎలా మార్చుకున్నాడో అర్థం కాలేదు రెడ్డికి. మెల్లగా రూం వైపు చూశాడు చాంబర్ లో ఓ మూలకి తెల్ల బట్టలతో కృష్ణారెడ్డి కన్పించాడు చిన్నగా నవ్వుతున్నా అతని పళ్లు మెరుస్తూ కన్పించాయి.
మంగారి రాజేందర్ జింబో
94404 83001