ఉత్తరాలలో కళాత్మక సృజన

by Ravi |   ( Updated:2022-09-03 18:37:35.0  )
ఉత్తరాలలో కళాత్మక సృజన
X

'త్తరం అంటే దూరాన్ని కలిపే దారం వంటిదని ఎన్నటి నుంచో చదువుకున్నం. ఎవరి వద్దనైనా పాత ఉత్తరాలు ఉంటే పరిశీలించవచ్చు. ఒకప్పటి గొలుసు కట్టు చేతిరాత ఉత్తరాలు 1960-70 ప్రాంతంలో వచ్చేవి. అవి ఇప్పుడు తీసి చదివితే పద బంధం నింపిన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం క్షణంలో సమాచారం చిత్రం అన్నీనూ ఖండాల అవతలికి వెళ్లిపోతున్నాయి. టెక్నాలజీని ఆహ్వానించా ల్సిందే. అయినా, పాత లేఖలలో భావ్యకత కనిపిస్తుంది. ఒకరికొకరు రాసే పద్ధతిని బట్టి ఆయా మన స్థితిని అర్థం చేసుకోవచ్చు.'

పూర్వం ఉత్తర ప్రత్యుత్తరాలు పోస్ట్‌లో పంపే లేఖల ద్వారా ఉండేవని ఈ తరం వారికి చెప్పాల్సి వస్తున్నది. ఇప్పటి తరం ఈ మెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్ వీడియో కాలింగ్‌లకు సంబంధించింది. ఇదివరకు కాలమైతే అన్నీ పోస్ట్ కార్డులు లేదా ఇన్ లాండ్ లెటర్‌లు లేదా పెద్ద మ్యాటర్ ఉంటే రాసి కవర్ లో పెట్టి సీల్ చేసి పంపేవారు. ఉత్తరం రాయడంలోనే రచనా శక్తి అంకురిస్తుంది. అసలు లేఖ చదువుతుంటే తను చెప్పదలచుకున్నది ఎట్లా వ్యక్తీకరించాడో తెలిసేది. అలా ఉత్తరాలు విరివిగా రాసేవారు. తర్వాత కాలంలో రచయితలు అయ్యారు. నిజానికి సాహిత్యంలో లేఖ కూడా ఒక ప్రక్రియ. జవహర్‌లాల్ నెహ్రూ తన బిడ్డ ఇందిరకు రాసిన లేఖలన్ని తర్వాత పుస్తకంగా వచ్చాయి. కుటుంబ వ్యక్తిగత విషయాలే కాకుండా అనాడు సాహిత్య సామాజిక విషయాలను ఆయా రంగంలోని ప్రసిద్ధులు ప్రస్తావించు కునేవారు.

ఇప్పటికీ, అప్పటికీ చాలా తేడా. పుట్టుక, చావుల నుంచి అన్ని కబుర్లు నాలుగు అయిదు రోజుల తర్వాత తెలుస్తుండేది. పోస్ట్ కార్డ్‌కు నాలుగు మూలలకు పసుపు అద్దితే శుభవార్త లేదా నల్లటి ఇంక్ అద్దితే అశుభవార్త. ఆ సంకేతంను బట్టి పోస్ట్‌మెన్ వేగంగా లేఖ అందించేవారు. పల్లెటూర్లలో చదువురాని వారికి ఎవరో ఒకరు లెటర్ చదివి వినిపిస్తుండేవారు. అట్లాగే తిరిగి జవాబు రాస్తుండేవారు. సాధారణంగా కొన్ని గ్రామాలలో పోస్ట్‌మెన్‌లే ఆ పని చేస్తుంటారు. పత్రికలకు పాఠకులు కూడా రచనల గూర్చి ఉత్తరాలు రాస్తారు. అవీ మరుసటి వారంలో ప్రాధాన్యతతోనే అచ్చు అయితాయి. ఎడిటోరియల్ శీర్షికకు సమస్యల మీద లేఖలు రాసేవారు ఇప్పటికీ ఉన్నారు. నవలా రచయితకు నేరుగా లేఖ రాస్తే వాళ్లంతా తిరిగి రిప్లై ఇచ్చేవాళ్లు. అట్లా ఇంటిటికీ తప్పక ప్రతినిత్యం వచ్చేవి.

అందమైన రాతలు.. తీరు తీరు బొమ్మలు

కొందరి ఉత్తరాలు ఎల్లవేళలా దాచుకోవాల్సిన రీతిలో ఉంటాయి. నల్లగొండకు చెందిన కవి, రచయిత, డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ వేణు సంకోజు ఉత్తరాలు అందుకున్నవారు వాటిని ఎల్లకాలం దాచి పెట్టుకుంటారు. ఆయన పోస్ట్ కార్డును లైట్ కలర్ పెయింట్ చేస్తారు. లేదా డిజైన్ చేస్తారు. ఆ తర్వాత దాని మీద కవితాక్షరాలు రాస్తారు. విషయం కూడా కవితామయం అయిపోతుంది. ఆ లేఖను చూస్తే కలర్ ప్రింట్ అనుకుంటారు. తాను 2001లో తెలంగాణ రచయిత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో కార్యవర్గ సభ్యులందరికీ సమావేశం వివరాలు ఇలా కార్డుల లేఖల రూపంలోనే పంపేవారు. ఆ కాలంలో అందరూ పోస్టల్ లేఖలే కానీ, వేణు సంకోజుగారి కార్డు స్టైల్ ప్రత్యేకం. 'అన్నా!ఇంత ఓపికతో కార్డును అలంకరించి అందరికీ రాస్తావా, ఎట్లా సాధ్యం?'అనే ప్రశ్నకు 'నా టేబుల్ మీదనే కార్డుల కట్ట ఉంటది.

పక్కనే బ్రష్‌లు, రంగులు, స్కెచ్ పెన్నులు ఉంటాయి. అనుకున్న ఆత్మీయులందరికీ ఇలానే ప్రత్యేక పద్ధతిలోనే రాస్తాను'అన్నారు. మామూలు రంగుల డిజైన్‌లే గాకుండా కొన్ని పేపర్ కటింగ్ లతో అతికి మరీ పంపుతారు. ఇక ఉగాది సందర్భంలోనూ, కొత్త సంవత్సరంలోనూ పంపు గ్రీటింగ్ కోసం అందరం ఎదురు చూడావలసిందే. వేణు సంకోజు తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో రచయితగా కార్యకర్తగా పాల్గొన్నవారు. 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రచయితల వేదికకు ప్రధాన కార్యదర్శి. నల్లగొండలోని జయమిత్ర సంస్థ బాధ్యతలు. సృజనాత్మకత, సాహిత్య, కళా ఆలోచనల్లో ముందు వరుసలో ఉన్నారు. ఒక్కోసారి మిత్రులను కలుసుకునే యాత్రకు సకుటుంబంగా బయలుదేరుతారు. ముందు టూర్ ప్లాన్ చేసికొని ఇష్టంగా తిరిగే ప్రయాణికుడు కూడా.

ఆ అక్షరాలు మధురం

ఉత్తరం అంటే దూరాన్ని కలిపే దారం వంటిదని ఎన్నటి నుంచో చదువుకున్నం. ఎవరి వద్దనైనా పాత ఉత్తరాలు ఉంటే పరిశీలించవచ్చు. ఒకప్పటి గొలుసు కట్టు చేతిరాత ఉత్తరాలు 1960-70 ప్రాంతంలో వచ్చేవి. అవి ఇప్పుడు తీసి చదివితే పద బంధం నింపిన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం క్షణంలో సమాచారం చిత్రం అన్నీనూ ఖండాల అవతలికి వెళ్లిపోతున్నాయి. టెక్నాలజీని ఆహ్వానించా ల్సిందే. అయినా, పాత లేఖలలో భావ్యకత కనిపిస్తుంది. ఒకరికొకరు రాసే పద్ధతిని బట్టి ఆయా మన స్థితిని అర్థం చేసుకోవచ్చు.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story