సబ్ కా వికాస్‌కు బీసీలు అనర్హులా?

by Ravi |   ( Updated:2024-08-02 00:30:11.0  )
సబ్ కా వికాస్‌కు బీసీలు అనర్హులా?
X

దేశంలోని జనాభాలో ఎక్కువ మంది బీసీలే అనే విషయం తెలిసినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తూనే వస్తోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని పద్దులు చూస్తుంటే బీసీలకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది బీసీలు ఉంటే వారికి కేవలం రూ.2,300 కోట్లు కేటాయించడం అత్యంత దారుణం. ఓ వైపు బీసీలు ఇప్పటికే అత్యంత వెనుకబడి ఉన్నారని బాధపడుతూ ఉంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఉంది. పైగా కేంద్రంలో ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా పొద్దు వెళ్లబుచ్చుతోంది.

బీసీలకు వెన్నుపోటు

ప్రధాని నరేంద్ర మోడీ తాను బీసీనని చెప్పి బీసీలందరికీ వెన్నుపోటు పొడిచారు. బీసీల వెన్నుతడతాం అని చెప్పే నాయకులంతా వెన్నుపోటు పొడవడానికే తమ సమయం కేటాయిస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతోంది. మోడీ బీసీని అని చెప్పుకుంటూ.. బీసీల ఓట్లు రాబట్టుకుంటూ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు కొంచెం కూడా మంచి చేయడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలని బీసీ సంఘాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. బడ్జెట్‌ను సవరించి బీసీలకు రూ. 2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ ఉండడమే కాకుండా.. అట్టడుగు వర్గాలపై తీవ్రమైన వివక్ష చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతోనే బీసీలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రధాని మోదీ ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అంటూ ఉంటారు.. కూటమి నేతలు కూడా అదే చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ 'సబ్ కా వికాస్' కు బీసీలు అనర్హులేమోనని అనిపిస్తోంది.

ఈ సూచనలు పాటించాలి..

కేంద్రం బీసీలకు అన్యాయం చేయగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలకు మంచి చేయడానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిజంగా అభినందనీయం. బీసీ వెల్ఫేర్‌కు రూ. 9,200 కోట్లు కేటాయించడం సంతోషకరం. అలాగే రాష్ట్ర కులగణన చేపట్టి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామనడం, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేస్తామని చెప్పడం కూడా నిజంగా అభినందనీయం. రిజర్వేషన్ పెంచడం వలన బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని.. బీసీ వర్గాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Advertisement

Next Story