- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిబన్లను తలపిస్తున్న పాలనలో…పెట్టుబడులు వస్తాయా?
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో భారీ ఏర్పాట్లతో ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నది. దాదాపు 40 దేశాల నుండి ప్రతినిధులు, దేశంలోని బడా పెట్టుబడిదారులు, కేంద్ర మంత్రులు హాజరవుతున్నట్లు సమాచారం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ దేశంలోనే ఫస్ట్ ర్యాంకులో ఉన్నామని ప్రభుత్వ పెద్దలు జబ్బలు చరుచుకుంటున్నా కానీ గత నాలుగేళ్లలో పారిశ్రామిక అభివృద్ధికి చేసిన కృషి శూన్యం అని చెప్పాలి. పైగా ఆ రంగంపై దండయాత్ర చేసి వున్న పరిశ్రమలను తరిమేశారు. తాము పరిశ్రమల కోసం, రాష్ట్ర, ప్రజల ఆర్ధికాభివృద్ధికి పాటుపడుతున్నట్లు డ్రామాలు ఆడుతూ, తమ రాజకీయ ప్రయోజనాలకోసం సమ్మిట్‌ను ఉపయోగించుకుంటున్నారు. విశాఖ సమ్మిట్‌కు సుమారు రూ. 250 కోట్లు ప్రజాధనం ఖర్చు కాగలదని సమాచారం. ఈ సమ్మిట్ కూడా కార్పొరేట్లకు భూములు అప్పగించి వారి దగ్గర నుండి ప్రతిఫలం పొందడానికి తప్ప కొత్తగా పరిశ్రమలు వస్తాయని ఆశించడం అత్యాసే అవుతుంది.
జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ రాలేదు. గత నాలుగేళ్లలో వచ్చిన పరిశ్రమలు ఎన్ని, వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, పారిపోయిన పరిశ్రమలు ఎన్ని, పోయిన ఉద్యోగాలు ఎన్ని వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు ప్రజల ముందుంచాలి. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలకు పన్నుల రాయితీలు వస్తాయని, ప్రత్యేక హోదా లేకుండా పరిశ్రమలు రావని, పరిశ్రమలు వస్తేనే యువతకి ఉద్యోగాలు వస్తాయని జగన్ పాదయాత్రలోనూ, ప్రతి సభలోనూ, యూనివర్సిటీల్లోనూ యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి జగన్ రెడ్డి కేంద్రానికి విన్నపాలతో సరిపెట్టారు తప్ప కార్యాచరణకు మీరు చేసింది ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? నేడు హోదా లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి, మీకు హోదా వచ్చింది కాబట్టి రాష్ట్రానికి హోదా అక్కరలేదా? కాబట్టే ఈ ఒట్టి గ్లోబల్ సమ్మిట్ ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటంగా ప్రజలను మభ్య పెట్టడానికి పనికి వస్తుంది తప్ప నిర్దిష్ట ఫలితాలు వచ్చే అవకాశం లేదు.
ఒక పక్కన రాష్ట్రంలో తాలిబన్ల పాలనను తలపిస్తున్న పరిపాలనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎలా ముందుకు వస్తారో ప్రభుత్వానికే తెలియాలి. జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీసిన, అప్రజాస్వామిక పరిపాలన చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం లేదు. ప్రతిపక్షాలు నోరెత్తకూడదు. సభలు, సమావేశాలు పెట్టుకోకూడదు. మీడియాలో తమని ఎవ్వరూ విమర్శించకూడదు అనే ఉన్మాదం బుసలు కొడుతున్నది జగన్ పాలనలో. రాష్ట్రంలో ఉన్న రహదారుల దుస్థితి ఘోరంగా వుంది. విద్యుత్ కోతలు, నీరు, ఇసుక కొరత కారణంగా ఏ ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు, లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు. అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతిని చంపేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. పీపీఏలను రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటబడి వేధించారు. పెట్టుబడులు పెట్టాలంటే వైసిపి నాయకులకు ముడుపులే కాదు ఆయా పరిశ్రమల్లో వాటాలకోసం బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడి పారిపోయే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో రూ. 17లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.
పెట్టుబడులు గాల్లో తేలి వస్తాయా?
పెట్టుబడిదారులు పేరంటానికి వచ్చినట్లు రారని, ఒక చోట పెట్టుబడికి భరోసా ఉందని నమ్మకం కుదిరినప్పుడే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని అనిల్ అంబానీ గతంలోనే చెప్పారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, లేదా వ్యాపార రంగం, లేదా నిర్మాణ రంగం ఇలా ఏ రంగంలో అయినా పెట్టుబడులు పెడుతున్నారంటే దానివల్ల పరస్పర ప్రయోజనం ఉందని నమ్మితేనే ఒప్పందాలు కుదురుతాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్పకాలంలో కాకపోయినా దీర్ఘ కాలంలో అయినా ప్రయోజనం ఉంటుందని, అదీ స్థిరంగా ఉంటుందని పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించడం ప్రధానం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇలాంటి విశ్వాసం కలిగించడం అంత సులభంగా జరిగే పనేనా అని ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఎవరు అవునన్నా, కాదన్నా పారిశ్రామికాంధ్ర ఆవిష్కరణకు గత పాలనలో ఐదేళ్లు అన్ని విధాలా అవిరళ కృషి జరిగింది. చంద్రబాబు బ్రాండ్ తోనే పెట్టుబడులు బారులు తీరాయి. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదురుకోలేదు. అటు పాతుకుపోయిన తెలంగాణ, ఇటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వున్న కర్ణాటక, తమిళనాడుతోనూ పోటీ పడటం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మెరుగైనదో నిరూపించడం, పారిశ్రామిక వేత్తలను ఒప్పించడంలో చంద్రబాబు సమర్థత. చాతుర్యం, విశ్వసనీయత ఉపయోగపడ్డాయి. అందుకే 2014-2019 మధ్య కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో అన్ని రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం ఎంత బాగా పనిచేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి అవుతుంది.
అధినేత చిత్తశుద్ధి అవసరం
గత పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సింగపూర్, జపాన్, చైనా, అమెరికా, దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాలలో పర్యటించి రాష్ట్రంలో రాజధాని మొదలుకొని మౌలిక వసతులు కల్పన, పరిశ్రమలు ఏర్పాటు వరకు అక్కడి ప్రభుత్వాలతోను, అక్కడి పారిశ్రామిక సంస్థలతోను అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి రూ16 వేల కోట్ల రూపాయల లోటుతో నవ్యాంధ్ర ఆవిర్భవించింది. ప్రభుత్వాధినేత సమర్ధత, చిత్తశుద్ధి, అంకితభావం పట్ల ఒక విశ్వాసం. ఆటోమొబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారత పోర్ట్, హీరో గ్రూపు రాగా, ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్ కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసీఎస్, ఓల్టాస్ వంటి ఎన్నో సంస్థలు వచ్చాయి. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు, లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు?
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? నిరంతర విద్యుత్తు అందుబాటులో ఉన్నదా? రహదారులు అద్భుతంగా అద్దంలా ఉన్నాయా ఈ మూడు పరిపూర్ణంగా ఉండాలి. పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ అంటూ పెద్ద ఎత్తున బిల్డప్ ఇస్తున్నారు కానీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కు ప్రభుత్వం చేసే ఖర్చు మాత్రం అయినా పారిశ్రామిక వేత్తలు నుండి పెట్టుబడులు సాధించగలరా? జగన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అనాలోచిత నిర్ణయాలు, నిరంకుశ చర్యలతో రాష్ట్రం తిరోగమన బాట పట్టింది. పెట్టుబడులు ఆకర్షించడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకి వెళ్ళిపోయింది. ఒక పక్కన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని విధంగా దివాలా తీయించిన, తాలిబన్ల పాలనను తలపిస్తున్న పరిపాలనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎలా ముందుకు వస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
నీరుకొండ ప్రసాద్
9849625610