ఉందిలే మంచికాలం ముందు ముందునా..

by Ravi |   ( Updated:2024-06-12 01:16:08.0  )
ఉందిలే మంచికాలం ముందు ముందునా..
X

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, పాలకులే సేవకులు అన్న సూత్రం మరిచి అహంతో ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేకుండా పోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి సాధించిన అఖండ విజయం తర్వాత 'అమరావతి' మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. నేడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు చేస్తున్న పదవీ స్వీకారంతో ఏపీ రాజధాని ఏదన్న ప్రశ్నకు పూర్తిస్థాయి సమాధానం దొరికింది.

తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం సైతం విషమ సమస్యల్లో చిక్కుకుంది. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు పరుగులు తీసిన ఈ రెండు కీలక ప్రాజెక్టుల పనులు మళ్లీ గాడిన పడబోతున్నాయి. 2019లో వైసీపీ అఖండ విజయం తర్వాత… అమరావతి మాత్రమే రాజధాని కాదని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమరావతి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అక్కడ చేపట్టిన నిర్మాణాలు కూడా వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధాని అని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించి. అందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ… న్యాయపరమైన చిక్కులతో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది.

రాజధానికి ప్రథమ ప్రాధాన్యత

2019 ఎన్నికల ముందు అమరావతి రాజధానిని సమర్థించిన జగన్, ఈ ఎన్నికలకు మాత్రం విశాఖ రాజధాని, రాష్ట్రంలో మూడు రాజధానలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో…. అమరావతి శాశ్వత రాజధానిగా మారిపోనుంది. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇదే విషయంపై కూటమిలోని పార్టీలు కూడా పదే పదే ప్రకటన చేశాయి. మేనిఫెస్టోలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, భూసేకరణకు నిధుల సేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం తదితర ఆంశాలను సమన్వయ పరచాలి. అనుభవజ్ఞులైన అధికారులు పారదర్శకతతో రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. అక్రమాలకు తావులేకుండా ఆశ్రితులకు అవకాశం ఇవ్వకుండా మూడేళ్ళలో రాజధానిని నిర్మించాలి. నిర్దిష్టమైన ప్రణాళికతో నాణ్యత నవ్యతను పాటిస్తూ నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.

ఏపీ వరదాయిని పోలవరం

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ''వారం వారం పోలవరం'' పేరిట సమీక్షలు నిర్వహించి, అన్ని సమస్యలనూ స్వయంగా పరిష్కరిస్తూ పనులన్నీ వేగంగా జరిగేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో కీలక నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. ప్రధాన డ్యాం సైతం 64.22% పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే 2014కు ముందు పోలవరం ప్రాజెక్టుపై రూ.4,730.71 కోట్లను ఖర్చు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో రూ.10,649.40 కోట్లు వెచ్చించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ.5,877 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇవన్నీ జగన్‌ ప్రభుత్వం తేల్చిన లెక్కలే. వైసీపీ సర్కారు పనులను ఆలస్యం చేయడంతో పోలవరం చుట్టూ అనేక సమస్యలు ముసురుకున్నాయి. డయాఫ్రం వాల్‌ కొత్తది నిర్మించాలా, ఇప్పటికే ఉన్నదానికి మరమ్మతు చేస్తే సరిపోతుందా అన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల సీపేజీని పరిష్కరించాలి. కేంద్రంతో మాట్లాడి రెండో డీపీఆర్‌ సాధించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు వేగంగా అడుగులు వేస్తే రాష్ట్ర వ్యవసాయ రంగం రూపురేఖలు మారుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

తూర్పు తీర కిరీటం విశాఖ!

విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవు నగరాల్లో ఒకటిగా ఉన్నందున 'తూర్పు తీర కిరీటం'గా కీర్తించబడుతోంది పర్యాటక నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఎగుమతులకు, దిగుమతులకు అనువైన నౌకాశ్రయం సౌకర్యం వల్ల ఈ నగరం వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు భారీ పరిశ్రమల స్థాపనకు అనువైన నగరంగా తీర్చిదిద్దితే ఆదాయం ఆర్జించటమే కాకుండా ఉపాధి రంగానికి ఊతంగా నిలుస్తుంది. ఉత్తరాంద్ర ఆభివృద్ధికి చుక్కానిగా విశాఖను రూపొందించడం కొత్త ప్రభుత్వ లక్ష్యం కావాలి. ఆ దిశగా వడివడిగా పారదర్శకమైన ప్రణాళికలతో పథకాలతో ముందుకు సాగాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వారికి రావలసిన బకాయిలను చెల్లించి ఆలస్యం చేయకుండా పెన్షన్ విధానంపై స్పష్టత నివ్వాలి, ఉపాధ్యాయుల సమస్యలను, ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. పారదర్శకత జవాబుదారీతనంతో ప్రభుత్వం వ్యవహరించాలి. పాలనలోనూ ఆధికారుల విధినిర్వహణలోనూ ఇది ప్రతిబింబించాలి. పౌరులకు ప్రభుత్వానికి నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసే విధి విధానాలను సాంకేతికతను జోడించి అమలు పరచాలి.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ రూపొందించాలి. అంకెల గారడీలా కాకుండా అక్షర సత్యమైన బడ్జెట్‌ని సాక్షాత్కరింపజేయాలి. శాంతి భద్రతలు, మాదకద్రవ్యాల నిరోధం, అసాంఘిక శక్తుల అరాచకాలను అరికడుతూ స్నేహ పూరితమైన పోలీసింగ్ వ్యవస్దపై దృష్టి పెట్టాలి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక భూమిక పోషిస్తున్న ఈ తరుణంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయించిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్ఛే విధంగా అందివచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోలవరానికి నిధులు రాబట్టుకోవాలి. రాజకీయ లాభాపేక్షతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కార్పోరేట్ సీఈఓగా వ్యవహరిస్తారనే వాళ్లకు మంచి పరిపాలకుడిగా ప్రజా నాయకుడిగా దార్శనికత కల్గిన అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన చేతలతో సమాధానమివ్వాలి. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమం లోనే కాక అభివృద్ధిలోనూ ముందుకు సాగాలి. ఇదే ప్రతి ఆంధ్రుడూ ఆశించేది. రాజధాని లేక అభివృద్ధికి ఆమడదూరంగా అగమ్యగోచరంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని ఆశల వెలుగులోకి తీసుకొచ్చింది ప్రజా చైతన్య దీప్తి. ఇప్పుడు ఎటు చూస్తున్నా శుభశకునాలే. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర, ఆసెంబ్లీలో అఖండమైన మెజారిటీ. ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చి ఉందిలే మంచికాలం ముందుముందూనా అంటూ భరోసాని ఇస్తున్నాయి.

(నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా)

సుధాకర్ వి

9989855445

Advertisement

Next Story

Most Viewed