- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్టీల ఆశలన్నీ... ఆ 54 సీట్ల పైనే...!
తెలంగాణలో ఎన్నికలు చలిని సైతం కాదని భారీ హీట్‌ను కలుగచేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఎన్నికలకు అటు ఇటు 2 వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈ చిన్న వ్యవధిలో అన్ని పార్టీల ప్రచారం మరింత హోరెత్తడం ఖాయం. మరోవైపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఈసారి కాస్త భిన్నంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ చేతిలో ఓడిపోయింది..రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం సర్వశక్తులూ ధారపోసింది. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ప్రాజెక్టులే గెలిపిస్తాయని భారీ అంచనాలతో సర్వశక్తులు ధార పోస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి కూడా రెండు సార్లు ఘోరంగా ఓడిపోవడంతో... కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మరింత పట్టుదలతో ఎన్నికల యుద్ధరంగంలో కాలు దువ్వుతున్నాయి. ఇప్పుడు మూడు ప్రధాన పోటీదారులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రాంతంలో డూ ఆర్ డై పోరును ఎదుర్కొంటున్నాయి.
బీఆర్ఎస్‌కి అయువుపట్టు..
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉత్తర తెలంగాణ జిల్లాల సీట్లే ప్రధానం. ఈ జిల్లాల్లో ౫౪ నిర్ణయాత్మక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఇందులో ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మెదక్‌లు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు స్థానాలు 60 మాత్రమే! 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలలో బీఆర్ఎస్ 63 మాత్రమే గెలుపొందగా, అందులో మెజారిటీ స్థానాలు 45 వచ్చినవి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే! దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకీ తక్కువ సీట్లు వచ్చాయి. అయితే, ఇతర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకీ తక్కువ సీట్లు వచ్చినప్పటికి అధికారంలోకి వచ్చినది. ..కానీ అనూహ్యంగా 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మొత్తం 88 స్థానాలను గెలుపొందగా, అందులో ఉత్తర తెలంగాణ నుంచే భారీగా 47 స్థానాలను కైవసం చేసుకుంది. అదే రకంగా ఈసారి అంత కాకుండా కనీసం 30-35 స్థానాలకు తగ్గకుండా గెలిచినట్లయితే అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసంతో ఉంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ చేతిలో ఓటమి చెందటం. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరగడంతో ఈ దఫా ఎన్నికల్లో ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.
కాంగ్రెస్‌కు భారీ అంచనాలు..
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాలలో కనీసం 25-30 స్థానాలకు పైగా గెలువాల్సిన అవసరం ఉంది. 2014లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు కేవలం 5 స్థానాలు, 2018 లో కూడా 6 స్థానాలతో సరిపెట్టుకుంది. దక్షిణ తెలంగాణలో వచ్చిన స్థానాలతో ప్రతిపక్ష పార్టీ హోదాను పొందగలిగింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కనీసం సగం స్థానాలైనా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే! జిల్లాల వారీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 4-5 సీట్లు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి 5-6 సీట్లు, ఉమ్మడి కరీంనగర్ నుండి 6-8, ఉమ్మడి వరంగల్ నుండి 6-8, ఉమ్మడి మెదక్ నుంచి 5-6 స్థానాలు కైవసం చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మూడు ప్రధాన పార్టీలు గతంలో ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్, మూడు లోక్ సభ స్థానాలు గెలిచిన బీజేపీ, 5-6 స్థానాలతో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీలు నువ్వా- నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి.. మిగతా తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చినప్పటికి అధికారంలోకి రావాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చిన సీట్ల సంఖ్య ఆధారంగానే ప్రభుత్వ ఏర్పాటు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ ఆశలన్నీ కూడా..
రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఆశలన్ని ఉత్తర తెలంగాణపైనే పెట్టుకున్నట్లు తెలుస్తొంది. వాస్తవానికి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది బీజేపీ అభ్యర్థులు కనీసం తమ డిపాజిట్లు కూడా నిలుపుకోలేకపోయారు. దక్షిణ తెలంగాణపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. బీజేపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉండగా అందులో కిషన్ రెడ్డి గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల నుంచి బండి సంజయ్. ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైనే హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక్కడే బీజేపీ కనీసం 20 సీట్లను గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా- నేనా అనే రీతిలో పోరు కొనసాగుతుండడంతో ఒకవేళ హంగ్‌కు ఏమాత్రం అవకాశం ఉన్నా.. బీజేపీ కీలకం కావాలని ఆశిస్తోంది. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు రాజకీయంగా సవాల్ విసరాలని భావిస్తున్నది. తెలంగాణలో కనీసం 20 సీట్లు గెలవండి. ప్రభుత్వ ఏర్పాటులో మనమే కీలకం అవుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య భీకర సంగ్రామమే జరుగుతోంది. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెపుతుండగా, మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందనే విషయాన్ని తెలుపుతున్నాయి. బీజేపీ పార్టీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోనే కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ గాలి బలంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగొచ్చని, తిమ్మిని బమ్మిని చేసే రాజకీయ అపర చాణక్యుడైన కేసీఆర్ పరిస్థితులను ఏ విధంగానైనా తనకు అనుకూలంగా మలుచుకుంటారని ఇంకొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా అంతిమ ఫలితం కోసం ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే !
డా. బి. కేశవులు నేత ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659