ఈవీఎంల మార్పుపై స్పందించిన ఈటల.. షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |
ఈవీఎంల మార్పుపై స్పందించిన ఈటల.. షాకింగ్ కామెంట్స్
X

దిశ, హుజురాబాద్ : ఈవీఎంలు మార్చడంపై అనుమానం కలుగుతోందని, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంపై సీపీ, కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు.

ఓటర్లను బెదిరించినా, పోలింగ్ సిబ్బందిని మభ్యపెట్టే ప్రయత్నం చేసినా పోలింగ్ సరళిని బట్టి గెలవలేమని తెలుసుకున్న అధికార పార్టీ చివరకు.. ఈవీఎంలను కూడా మాయం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక ఘట్టం అవుతుందన్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను మార్చే విషయంలో కలెక్టర్.. పొరపాటు జరిగిందనడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు.

ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, మద్యం, డబ్బులతో ప్రలోభపెట్టినా ఆత్మాభిమానం కలిగిన ఓటర్లు తనకే మద్దతు పలికారన్నారు. ఈవీఎంలు మార్చడానికి చేసిన ప్రయత్నం, అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఈటల తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed