ఈటల సూపర్ ‘ప్లాన్’.. టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదా.!

by Sridhar Babu |
Eatala-Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ప్రజలతో మమేకం అయ్యేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఏప్రిల్ 30 తరువాత నుంచి ఎక్కువగా స్థానికంగానే ఉంటూ ప్రజలతో టచ్ మరింత పెంచుకున్న ఈటల.. పాద యాత్రతో టీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేసే విధంగా స్కెచ్ వేశారు.

టీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు..

హుజురాబాద్ బై పోల్స్ కారణంగా టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో అనుకూలమైన వాతావరణం తయారు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంది. మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించిన టీఆర్ఎస్ నాయకులు.. బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున మంత్రి హరీశ్ రావు రంగనాయకసాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ఇక్కడి సమీకరణాలను నెరుపుతున్నారు. సామాజిక వర్గాలు, వివిధ సంఘాలను పిలిపించుకుని వారితో మాట్లాడి అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మరో మంత్రి గంగుల కమలాకర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈటల ప్రాభవాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కూడా నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు.

టీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేయడంలో భాగంగా ఈటల వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి ప్రజల్లో తనకు ఉన్న బలం చేజారి పోకుండా ఉండాలన్న లక్ష్యంతో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హుజురాబాద్ ప్రజల్లో ఉన్న అనుకూలతను మరింత పెంచుకోవడంతో పాటు టీఆర్ఎస్ నాయకుల ప్రయత్నాలు బెడిసికొట్టే విధంగా ప్లాన్ చేశారు.

పాదయాత్ర..

22 రోజుల పాటు నియోజకవర్గంలోని 125 గ్రామాలు, 350 కిలో మీటర్ల మేర పాదయత్రకు ప్లాన్ చేసిన ఈటల.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను టచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నాయకత్వం తనపై వ్యవహరించిన తీరు, తాను పడ్డ అవమానాలను కూడా ప్రజలకు వివరించేందుకు ఈటల ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, మొదట ప్రకటించిన షెడ్యూల్‌లో కొంత మార్పు చేశారు. సోమవారం ఉదయం ప్రారంభం కానున్న పాదయాత్ర మొదటి రోజున గూడూరులో నైట్ హాల్ట్ చేసే విధంగా మార్చారు. మిగతా ప్రోగ్రాం అంతా కూడా యథావిధిగానే సాగనుంది.

Advertisement

Next Story

Most Viewed