పెద్దపల్లి వాసులకు DCP హెచ్చరిక.. ‘అత్యాశ’కు పోకండి

by Sridhar Babu |   ( Updated:2021-08-25 09:52:25.0  )
dcp
X

దిశ, పెద్దపల్లి : నకిలీ బంగారం విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ బంగారాన్ని నిజమైనదిగా నమ్మిస్తూ అమాయకులకు అంటగడుతున్న ముఠాను పెద్దపల్లి పోలీసులు ధర్మారం క్రాస్‌రోడ్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి కిలో నకిలీ బంగారంతో పాటు మూడు బైకులు, ఆరు సెల్‌ఫొన్లను స్వాధీనం చేసుకున్నారు.

పెద్దపెల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్ మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గ్రామానికి చెందిన ఎండీ మొయినుద్దీన్, మునీరుద్దీన్‌లకు వారంరోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమై ఆయుర్వేద మందులు ఇస్తామని, దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామని నమ్మించి ఫొన్ నెంబర్ తీసుకున్నారని చెప్పారు. రెండురోజుల తర్వాత ఫోన్ చేసి పెద్ద మొత్తంలో బంగారం ఉందని కర్ణాటకలో అమ్మితే పోలీసులు పట్టుకుంటారని, ఇక్కడికి తీసుకువచ్చి తక్కువ ధరకు అత్యవసర పరిస్థితుల్లో అమ్ముతున్నమని వివరించారు. రెండు బంగారం గుండ్లు ఇచ్చి టెస్టు చేయించుకోవాలని చెప్పారు. నాణ్యమైన బంగారం అని నిర్ధారించిన తర్వాత ఐదువేల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి మొత్తం బంగారాన్ని తెస్తామని చెప్పి బుధవారం ఫోన్ చేసి పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామం సమీపంలోకి రావాలన్నారు. ఐదుగురు వ్యక్తులు వారి వద్ద ఉన్న బంగారు గుండ్లు చూపిస్తూ ఇదే అసలు బంగారం అని చెప్పగా కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో 20 గుండ్లు ఉన్న హారం ఇచ్చారు. అయితే, ఇంటికి వెళ్లి పరీక్షించుకోగా అది నకిలీ బంగారంగా తేలిందన్నారు.

ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన సచిన్, సతీష్ ,దర్శన్, మౌనిష్, ఆనంద్‌లు అత్యాశకు పోయి అమాయకులను గుర్తించి మాయమాటలు చెప్పి గ్రామ శివారులో దిష్టిబొమ్మలు, ఆయుర్వేద మందులు అమ్ముతున్నట్లు నటిస్తూ పరిచయం చేసుకొని మొదట అసలైన బంగారు చూపిస్తారు. వారు నమ్మిన అనంతరం పెద్దమొత్తంలో నకిలీ బంగారం అంటగట్టేందుకు ప్లాన్ చేస్తారు. కావున, ప్రజలు అత్యాశకు పోయి మోసపోవద్దని, అనుమానం వస్తే పోలీసుల సమాచారం ఇవ్వాలని డీసీపీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీఐలు రాజ్ కుమార్, ప్రదీప్ కుమార్, ఎస్‌ఐలు మస్తాన్, నరసింహారావు, మహేందర్, లచ్చన్న, సంపత్ కుమార్, సదానందం, చంద్రశేఖర్, ప్రకాష్, మల్లేష్, భాస్కర్, రాకేష్ కిరణ్, సునీల్‌లను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్, మహేందర్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed