పుంజుకుంటున్న రిటైల్ అమ్మకాలు!

by Harish |
retail market
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని వారాలుగా కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత ఏడాది నవంబర్‌లో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని భారత రిటైలర్స్‌ సంఘం(ఆర్ఏఐ) తెలిపింది. ఇవి కొవిడ్‌కి ముందు 2019, నవంబర్‌తో పోలిస్తే 9 శాతం అధికం కాగా, గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువని ఆర్ఏఐ పేర్కొంది. ముఖ్యంగా మొత్తం రిటైల్ విక్రయాల్లో ఈ ఏడాది అక్టోబర్‌లో దెబ్బతిన్న కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు నవంబర్‌లో భారీగా పుంజుకున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో 2019 నాటి కంటే ఈ విభాగం 32 శాతం ఎక్కువ అమ్మకాలు నమోదు చేశాయి.

స్పోర్ట్స్ పరికరాల విభాగం 18 శాతం వృద్ధిని, దుస్తులు 6 శాతంతో స్థిరమైన వృద్ధిని సాధించాయి. ఇక, ఆహార, కిరాణా సామాగ్రి, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు మోస్తరు వృద్ధిని చూశాయి. చెప్పులు, బ్యూటీ, హెల్త్, పర్సనల్ కేర్, ఫర్నీచర్ వంటి విభాగాలు రికవరీ దిశగా అమ్మకాలను సాధిస్తున్నాయని ఆర్ఏఐ వెల్లడించింది. ‘కరోనాకు ముందుతో పోల్చితే అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ వ్యాపారాలు అమ్మకాల వృద్ధిని సాధించాయని, రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థర్డ్ వేవ్ భయాల వల్ల పరిస్థితులను పూర్తిస్థాయిలో సానుకూలంగా అంచనా వేయలేకపోతున్నామని’ ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు.

Advertisement

Next Story