నేడు విద్యార్థి నాయకుల నుంచి లీడర్లు వచ్చేనా?

by Ravi |   ( Updated:2022-11-02 18:45:40.0  )
నేడు విద్యార్థి నాయకుల నుంచి లీడర్లు వచ్చేనా?
X

సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం సత్ప్రవర్తన, రాజకీయ విలువలు గల నాయకులు కొంతమందైనా ఉండాలి. అలా ఉండాలంటే విశ్వవిద్యాలయాలలో ఎన్నికలు నిర్వహించి భవిష్యత్తు నాయకత్వాన్ని రూపుదిద్దాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలది. నూతన నాయకత్వాన్ని విధానాల పరంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ప్రభుత్వాలకు దూరం పెరిగింది. దానికి కారణం కేవలం ఎన్నికల సమయంలో తప్ప ఏనాడు నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకపోవడం. ప్రజలు మోసపోవడం. ఇది చక్రంగా జరుగుతున్న క్రియ. అందుకే విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులుగా సమాజ సేవకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మేధావులు, విద్యావంతులు, ప్రభుత్వాలు సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని ప్రధానుల వరకు ఎంతో మంది నాయకులను విశ్వవిద్యాలయాలు అందించాయి. పీవీ నరసింహారావు, చంద్రబాబునాయుడు, లాలూ ప్రసాద్ యాదవ్, కేసీఆర్ వంటి వారు విద్యార్థి నాయకుల నుంచి ఎదిగి వచ్చినవారే. ఇలా దేశంలో ఎంతోమంది ఉన్నత వ్యక్తులను రాజకీయాలకు పరిచయం చేసింది విశ్వవిద్యాలయాలే. ఇంత చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయాలలో ఎన్నికలు నేటి కాలంలో నిర్వహించడం లేదు. విద్యార్థులను కేవలం ఉద్యోగం, వ్యాపార ఆలోచనలకు, కార్పొరేట్ కొలువులకు పరిమితం చేస్తున్నారు.

ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు లేకుండా విద్యార్థులను తయారు చేస్తున్నారు. దీని మూలంగా యువత సమస్యలను అధిగమించే ఆలోచనలకు దూరంగా ఉంటున్నారు. సమాజ నిర్మాణం, సామాజిక స్ఫృహ, వ్యవస్థ పైన, పాలన రంగంపైనా ఎటువంటి కనీస అవగాహన లేకుండానే విద్యావంతులు అవుతున్నారు.

ప్రభుత్వాల వైఖరితో

ఎన్నో భిన్న విభిన్న ఆలోచనలకు, సంఘర్షణలకు, చర్చలకు, వాదోపవాదాలకు, సిద్ధాంతపర ఆలోచనలకు కేంద్ర బిందువులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు నేడు వాటికి దూరంగా ఉంటున్నాయి. దీంతో యువత ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు, కార్పొరేట్ ఆలోచనలకు అలవాటుపడి నిష్ప్రయోజకులుగానే మిగిలిపోతున్నారు. మానసిక బలహీనతతో ఉద్యోగ సాధనలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులను, పరిశోధకులను తయారు చేసి దేశ ఉన్నతికి పాటుపడాల్సిన విశ్వవిద్యాలయాలు నేడు ప్రధానంగా బోధన, బోధనేతర సిబ్బంది లేక, తరగతులు సక్రమంగా జరగక సమస్యల వలయంలో చిక్కుకొని, కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల వైఖరి.ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే ఈ సమస్యకు కారణం.

విశ్వవిద్యాలయాలలో ఎన్నికలు నిర్వహిస్తే యువత ప్రజా క్షేత్రంలో ప్రయోజనకర ప్రజా అవసరాలను అవగాహన చేసుకునే సామర్థ్యం పొందుతారు. భవిష్యత్‌ను ఆలోచించే, అవగాహన చేసుకునే, సమస్యలను పరిష్కరించే సిద్ధాంతపర విధానాలకు పరిమితమై, రాజకీయాలను పాలనాపరంగా మాత్రమే చూసేవారిగా తయారవుతారు. వాస్తవానికి చట్టసభలలో నిష్ణాతులైన విద్యావంతులు ఉంటే మంచి చట్టాలు రూపుదిద్దుకుంటాయి. నేడు రాజకీయాలు కేవలం వారసత్వ పలుకుబడిని కాపాడుకోవడం కోసం ఒకే కుటుంబం లేదా ఒకే వర్గం చేతులలో కీలు బొమ్మగా మారుతున్నాయి. వ్యాపారపర పెట్టుబడిగా రాజకీయాలు నిలుస్తున్నాయి.

ఆ చక్రంలో ఉండాల్సిందేనా?

ఓడిపోయిన రాజకీయ నిరుద్యోగులకు పెద్దల సభ ద్వారా పునరావాసం కల్పించడం ఆశ్చర్యకరం. నేడు పెద్దల సభకు కూడా వివిధ రంగాల నిపుణులుగానీ, సమాజ శ్రేయస్సు కోసం జీవితాలు త్యాగం చేసిన వారు గానీ ఎవరూ రావడం లేదు. నేటి రాజకీయాలు వారిని రానివ్వడం లేదు. రాజ్యసభ నేడు రాజకీయ నిరుద్యోగుల సభగా మారిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక నినాదాలు చేసే స్థలంగా భావిస్తున్నారు. సమావేశాలలో ప్రజా సమస్యల ప్రస్తావన కంటే వ్యక్తిగత దూషణలకు దిగడమే ప్రధాన ఆకర్షణగా భావించే భావదారిద్ర్యం దుస్థితి నేటి రాజకీయాలలో ఉంది. సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం సత్ప్రవర్తన, రాజకీయ విలువలు గల నాయకులు కొంతమందైనా ఉండాలి. అలా ఉండాలంటే విశ్వవిద్యాలయాలలో ఎన్నికలు నిర్వహించి భవిష్యత్తు నాయకత్వాన్ని రూపుదిద్దాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలది.

నూతన నాయకత్వాన్ని విధానాల పరంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ప్రభుత్వాలకు దూరం పెరిగింది. దానికి కారణం కేవలం ఎన్నికల సమయంలో తప్ప ఏనాడు నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకపోవడం. ప్రజలు మోసపోవడం. ఇది చక్రంగా జరుగుతున్న క్రియ. అందుకే విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులుగా సమాజ సేవకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మేధావులు, విద్యావంతులు, ప్రభుత్వాలు సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.


కె. రమేశ్‌ యాదవ్‌

ఓయూ, హైదరాబాద్

78932 85131

Advertisement

Next Story

Most Viewed