అఫ్ఘాన్ మహిళల గొంతును వినిపించాయి.. మీరు చూశారా..?

by Anukaran |
అఫ్ఘాన్ మహిళల గొంతును వినిపించాయి.. మీరు చూశారా..?
X

దిశ, ఫీచర్స్ : స్వేచ్ఛగా జీవిస్తూ, ఇప్పుడిప్పుడే పలు రంగాల్లో ఉద్యోగావకాశాలు పొందుతున్న అఫ్ఘాన్ మహిళలు.. మళ్లీ భయం భయంగా బతికే రోజులొచ్చాయి. ఒకప్పటి తాలిబన్ పాలనలో టీవీ, సంగీతం, సినిమాలను నిషేధించగా, పదేళ్లు దాటిన అమ్మాయిలు స్కూలుకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. స్త్రీలను ఆటబొమ్మలుగా చూస్తూ.. పరదా చాటులో, బురఖా ముసుగులో నాలుగు గోడలకే పరిమితం చేశారు. అయితే మళ్లీ తాలిబన్ల పాలన రావడంతో తమ స్వేచ్ఛ, హక్కులను కాల రాస్తారనే భయం వారిలో ఆవరించింది. ఈ నేపథ్యంలో పలు డాక్యుమెంటరీ చిత్రాలు ఈ ప్రాంత చరిత్రపై అవగాహన కల్పిస్తూనే.. అఫ్ఘాన్ మహిళల గొంతుకను, ప్రత్యక్ష అనుభవాలను వెలుగులోకి తెస్తాయి.

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో.. దేశంలోని మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి భయాల నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన ఫిల్మ్ కలెక్టివ్ ‘ఉమెన్ మేక్ మూవీస్’(WMM) తమ ‘వాయిస్ ఆఫ్ అఫ్ఘాన్ ఉమెన్’ కలెక్షన్‌ను యావత్ సినీ అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఆధిపత్యం చెలాయించినప్పుడు అఫ్ఘాన్ మహిళల జీవిత గాథలు, వారి పోరాటాలు, విజయాలను ఆయా డాక్యుమెంటరీలు హైలెట్ చేశాయి.

సోనిట(2015)..

అఫ్ఘాన్‌కు చెందిన 14ఏళ్ల సోనిటను ఆమె కుటుంబం పెళ్లి పేరుతో విక్రయించడానికి ప్రయత్నించిన తర్వాత ఆమె ఇరాన్‌‌కు పారిపోతుంది. అక్కడ టెహ్రాన్‌లోని ఓ శరణార్థి కేంద్రంలో క్లీనర్‌గా పనిచేస్తుంది. క్రమక్రమంగా ఆ రెఫ్యూజీ సెంటర్ పాఠశాల వలె రూపుదిద్దుకుంటుంది. చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఆ యువతి, తనను తాను సూపర్‌స్టార్ ర్యాపర్‌గా ఊహించుకుంటుంది. ఆమె తన ముఖాన్ని రిహాన్న ముఖచిత్రంతో వచ్చే మ్యాగజైన్ కటౌట్‌లపై తనను తాను చూసుకుని మురిసిపోయేది. ఆ కేంద్రంలోని పిల్లలకు తన ప్రతిభను ప్రదర్శిస్తూ అభినందనలు అందుకునేది.

కానీ, ఆమె తల్లి తనను కనుగొని మరోసారి ఆమెను అమ్మాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆ యువతి మాత్రం తన నిరాశను, విధిరాతను సంగీతంలో వినిపిస్తూ, అణచివేత సంప్రదాయాలపై పదాలతో విరుచుకుపడింది. ఎదిగేకొద్దీ ఆమె రాపర్ నుంచి యాక్టివిస్ట్‌గా తన గొంతు వినిపించింది. సోనిట లైఫ్ ఎంతోమంది అఫ్ఘాన్ యువతుల ఆశలకు అద్దం పడుతుంది. కానీ విధిని ఎదురించలేని అఫ్ఘాన్ అమ్మాయిలు నాలుగు గోడల్లోనే తమ జీవితాన్ని వెళ్లదీశారు. ‘సోనిట’ డాక్యుమెంటరీని రెండుసార్లు సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు పొందిన ఇరానియన్ డైరెక్టర్ రోక్సారెహ్ ఘెమ్ మగామి తెరకెక్కించాడు. ప్రస్తుతం సోనిట.. యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తుండగా బాల్య వివాహాలను నిరోధించేందుకు న్యాయవాదిగా పోరాడుతోంది.

ఐ యామ్ ద రివల్యూషన్..

ఆగస్టు 2014లో ఉత్తర ఇరాక్‌లోని సింజార్ పర్వతాలలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) ద్వారా జరిగిన హత్యాకాండ నుంచి 50,000 మందిని రక్షించడంలో ‘మహిళా రక్షణ యూనిట్లు’ (YPJ) కీలకపాత్ర పోషించాయి. దాంతో అందులోని మహిళలు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఏళ్ల తరబడి మధ్యప్రాచ్యంలోని మహిళలు ‘ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల’తో అణిచివేతకు గురికాగా, తమతో పాటు, తమ సోదరీమణుల రక్షణ కోసం వాళ్లు ఆయుధాల చేపట్టారు. వైపీజే రెస్క్యూ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రకటించినా, ఇది మధ్యప్రాచ్య మహిళల్లో మరింత ప్రేరణ తీసుకొచ్చింది. అప్పటివరకు అణిచివేతలు, పితృస్వామ్యం వ్యవస్థలతో సతమతమైన మహిళలకు బయటపడే మార్గాన్ని ఈ సంస్థ కల్పించింది.

2017లో ISISపై YPJ విజయం సాధించడంతో మధ్యప్రాచ్యమంతటా వారి గొంతు ప్రతిధ్వనించింది. ఈ ప్రాంతమంతటా స్త్రీవాద పోరాటాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యమే డైరెక్టర్ బెనెడెట్టా అర్జెంటీరీని ఆకర్షించింది. ఈ క్రమంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలైన సిరియా వైపీజే కమాండర్-రోజ్డా ఫెలాట్, అఫ్గానిస్తాన్ సాలిడారిటీ పార్టీ ప్రతినిధి- సెలెయ్ గఫార్, ఇరాక్‌లోని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్స్ ఫ్రీడమ్’ ఫౌండర్ – యానార్ మొహమ్మద్‌ల లైఫ్ ఇన్సిడెంట్స్‌తో ‘ఐ యామ్ ది రివల్యూషన్’ డాక్యుమెంటరీని ఆయన తెరకెక్కించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అఫ్గానిస్తాన్, సిరియా, ఇరాక్‌లో రాజకీయ, సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించడంతో పాటు, ఆయా దేశాల్లోని మహిళల హక్కులు, స్వేచ్ఛ కోసం ముగ్గురు మహిళలు తమ జీవితాలను పణంగా పెట్టి సాగించిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణమే ‘ఐ యామ్ ద రివల్యూషన్’.

ప్లేయింగ్ విత్ ఫైర్ : ఉమెన్ యాక్టర్స్ ఆఫ్ అఫ్ఘాన్

1980 చివరలో సోవియట్ దళాలు అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోగా, తాలిబాన్ల ఆధిపత్యం క్రమక్రమంగా పెరగసాగింది. వారి స్వచ్ఛమైన ఇస్లాం రూపం ‘అఫ్గానిస్తాన్ నేషనల్ థియేటర్ ’ పతనానికి దారితీసింది. మహిళలు తమ కళాప్రతిభను చాటుకోవడానికి అడుగడుగునా అడ్డంకులే. వేదికపై పురుషులను తాకడం నిషేధించగా, షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు అమలు చేస్తామని తాలిబన్లు హెచ్చరించారు. మహిళా నటులపై దాడి చేయగా, కొందరు చంపబడ్డారు కూడా. అంతేకాదు థియేటర్లపై తాలిబన్లు బాంబు దాడి చేస్తారనే భద్రతాపరమైన ఆందోళనలు కూడా ఉన్నాయి. చివరికి, కొంతమంది మహిళలు తమ కలలను వదులుకోగా, మరికొందరు ప్రవాస జీవితాన్ని ఎంచుకున్నారు. అయితే అఫ్ఘాన్ థియేటర్‌లోని మహిళా నటుల జీవితాలను ప్రతిబింబించిన చిత్రం ‘ప్లేయింగ్ విత్ ఫైర్’.

తీవ్రవాదులకు లక్ష్యంగా మారిన యాక్ట్రెస్ సాజిదా, మహిళా థియేటర్ ట్రూప్‌ని స్థాపించిన మోనిరా, నటనే లోకంగా జీవించి అవార్డు అందుకుని నిషేధానికి గురైన తాహేరా, టీవీ కెరీర్‌ను ఎంచుకుని నిరంతర వేధింపులకు గురైన రోయా, స్టేజ్ ఆర్టిస్టులుగా రాణించిన లీనా, బ్రెష్నా అనే ఆరుగురు ధైర్యవంతులైన అఫ్ఘాన్ మహిళలపై ఈ చిత్రం దృష్టి సారించింది. గ్రీకు దర్శకుడు అన్నెటా పాపతనాస్సియు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

అన్‌వీల్డ్ వ్యూస్ :

స్పానిష్ చిత్రనిర్మాత ఆల్బా సోటోరా తీసిన ‘అన్‌వీల్డ్ వ్యూస్’ పేరుతో వచ్చిన ఓపెన్ డాక్యుమెంటరీలో, సనాతన ఇస్లామిక్ సమాజాలకు చెందిన ఐదుగురు ఎక్స్‌ట్రార్డినరీ మహిళలు తమ వృత్తి, ఆకాంక్షలు, వారి దేశాల్లో మహిళల హక్కులు, స్థితి గురించి మాట్లాడుతారు. బోస్నియన్ అల్మా సుల్జెవిక్ అనే యువతి.. తన ప్రాణానికి తెగించి సారాజేవో సమీపంలో ఉన్న మందుపాతరలను క్లియర్ చేస్తుంది. ఇక మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ఎరెన్ కెస్కిన్.. మహిళలపై హింసను కొనసాగించే టర్కీ చట్టపరమైన పద్ధతులను మార్చడానికి పోరాడింది. ప్రముఖ ఇరానియన్ ఫిల్మ్ మేకర్ రక్షన్ బానీ-ఎహ్మద్ తమ దేశ సెన్సార్‌షిప్ నియమాలను మార్చేందుకు ప్రయత్నించింది. ప్రఖ్యాత పాకిస్తానీ డ్యాన్సర్ నహిద్ సిద్ధిఖీ తన అనుభవాలను పంచుకుంది.

ఏ థౌజండ్ గర్ల్స్ లైక్ మి :

తన తండ్రి చేతిలో ఏళ్ల తరబడి వేధింపులకు గురైన తర్వాత న్యాయం కోసం, తన పిల్లలను కాపాడటానికి ఒక యువ అఫ్ఘాన్ మహిళా ధైర్య పోరాటాన్ని ఆవిష్కరించిన మూవీ ఇది.

ఎనిమీస్ ఆఫ్ హ్యాపీనెస్, సెర్చ్ ఫర్ ఫ్రీడమ్, ఐ యామ్ ఏ గర్ల్, అఫ్గానిస్తాన్ అన్‌వీల్డ్ వంటి డాక్యుమెంటరీలు కూడా అక్కడి అతివల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టాయి.

Advertisement

Next Story