డీహెచ్‌ఎంవో పనితీరు అధ్వాన్నం..చర్యలు తీసుకొండి

by Sridhar Babu |   ( Updated:2020-06-28 09:31:40.0  )
డీహెచ్‌ఎంవో పనితీరు అధ్వాన్నం..చర్యలు తీసుకొండి
X

దిశ, ఖమ్మం: త‌నకు క‌రోనా సోకకున్నా..పాజిటివ్ వచ్చిందని త‌ప్పుడు రిపోర్టు ఇవ్వడమే కాకుండా త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన ఖ‌మ్మం డీఎంహెచ్‌వో మాల‌తిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డాక్టర్ శంక‌ర్‌నాయ‌క్ ఆదివారం క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌కు ఫిర్యాదు చేశారు. శంక‌ర్‌నాయ‌క్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌ముఖ సివిల్ స‌ర్జ‌న్‌గా గుర్తింపు పొందారు. కొత్త‌గూడెంలో సొంత ఆస్ప‌త్రితో పాటు ఖ‌మ్మంలోని మూడు ఆస్ప‌త్రుల్లో విజిటింగ్ డాక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఈయన కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ నేత వి.హ‌నుమంత‌రావు కొత్త‌గూడెం జ‌ల ‌దీక్ష‌లో పాల్గొనేందుకు రాగా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.4రోజుల త‌ర్వాత హ‌నుమంత‌రావుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అతను కూడా ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష‌ల చేయించుకున్నారు.

రిపోర్టుల్లో తనకు పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లుగా డీఎంహెచ్‌వో చెప్పారు. దీంతో వెంట‌నే గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లగా తనకు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 3సార్లు వైద్యులు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చింద‌న్నారు. అయితే, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే ముందు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన డీఎంహెచ్‌వో మాల‌తి నిర్ల‌క్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అంతేకాక త‌న‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని వైద్య వ‌ర్గాల్లో దుష్ప్రచారం చేయ‌డంతో పాటు, ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం వాటిల్లిందని క‌లెక్ట‌ర్ ఎదుట శంక‌ర్‌నాయ‌క్ వాపోయారు. బాధితుని ఫిర్యాదుపై స్పందించిన క‌లెక్ట‌ర్ పూర్తి వివ‌రాలను నివేదిక రూపంలో తెప్పించుకుని స్పందిస్తాన‌ని చెప్పిన‌ట్లు సమాచారం.కాగా, డీఎంహెచ్‌వో మాల‌తి కరోనా పరీక్షా రిపోర్టుల వెల్లడిలో ప్ర‌ద‌ర్శిస్తున్న నిర్ల‌క్ష్య ధోర‌ణిపై కోర్టుకు వెళ్లనున్నట్లు శంకర్ నాయక్ తెలిపారు.

Advertisement

Next Story