సీఎం గారూ… చావమంటున్నారు.. ఏపీలో పరిస్థితి ఇది: డాక్టర్

by srinivas |   ( Updated:2020-04-07 03:19:37.0  )
సీఎం గారూ… చావమంటున్నారు.. ఏపీలో పరిస్థితి ఇది: డాక్టర్
X

ఎన్95 మాస్కులు లేవు, కరోనా కేసులు వస్తే ఏం చేయాలి? ఎలా ట్రీట్ చేయాలి? సంతకం పెట్టించుకుని ఒక్క మాస్క్ ఇస్తున్నారు. దానినే 15 రోజుల పాటు వాడుకొమ్మంటున్నారు… పరోక్షంగా వైద్యులను కరోనాతో చావమంటున్నారని విశాఖపట్టణంలో జిల్లాకు చెందిన వైద్యుడు ఆందోళన వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 304. ఇందులో విశాఖపట్టణం జిల్లాలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. వైజాగ్‌లోని వివిధ ప్రాంతాల్లో జీవీఎంసీ రెడ్ జోన్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైజాగ్ జిల్లాలో ఇంకా కరోనా కేసులు ఉన్నాయా? అన్న అనుమానం రేగుతోంది. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స చేయడం ఎంతకష్టమో నర్సీపట్నంలోని 150 పడకల ఆసుపత్రిలో అనస్తీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ రావు వెల్లడించారు.

ఆయన ఆరోపించిన వివరాల్లోకి వెళ్తే… “వైజాగ్ డిస్ట్రిక్ట్ హెల్త్ సూపరిండెంట్ (డీహెచ్ఎస్) నర్సీపట్నం ఆసుపత్రిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. వైజాగ్ ఏజెన్సీకి కీలకమైన ఆసుపత్రి నర్సీపట్నం ఆసుపత్రి. ఇక్కడికి ఎందరో గిరిజనులు చికిత్స కోసం వస్తుంటారు. ఎవరికి కరోనా ఉందో తెలియదు. ఆ లక్షణాలతో వచ్చిన పేషంట్‌కి చికిత్స ఎలా అందించాలో అర్థం కావడం లేదు.

ఆసుపత్రిలో వైద్యులకే ఎన్95 మాస్కులు అందుబాటులో లేవు. ఇక మెడికల్ సిబ్బందికి మాస్కుల సంగతి అడగొద్దు. ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఇన్‌స్పెక్షన్‌కి రారు. అక్కడి వసతులేవో ఎవరికీ అక్కర్లేదు. డీహెచ్ఎస్‌కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. లేదా సమాధానం చెప్పరు. అదీ కాదంటే ఉద్యోగం మానెయ్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా విధులు నిర్వర్తించాలి?… కరోనాతో డాక్టర్లని చావమంటారా?” అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రికి నేరుగా ఎలా ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో 20 ఏళ్ల అనుభవమున్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. కొత్తగా విధులు నిర్వర్తించే వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ముందు వైద్యులను ఆదుకోవాలని ఆయన సూచించారు.

ఆయన వ్యాఖ్యలతో కరోనాకి వైద్యులు అరకొర సౌకర్యాలతో చికిత్స అందిస్తున్నారని అర్థమవుతుంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మంత్రులు మాత్రం కరోనాపై పోరాడుతున్నామని ఘనంగా ప్రకటనలు ఇస్తున్నారు.. సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాపై మంత్రుల పోరాటం ఎంత సత్ఫలితాలిస్తుందో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైద్యులకు సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించడం ఎంత వరకు సరైనదని విపక్షాలు నిలదీస్తున్నాయి.


Tags: doctor, narsipatnam, visakhapatnam, doctor on corona treatment, agency hospital, sudhakara rao

Advertisement

Next Story

Most Viewed