అబద్దాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడు కేటీఆర్: డీకే అరుణ

by Shyam |   ( Updated:2021-09-15 05:53:10.0  )
అబద్దాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడు కేటీఆర్: డీకే అరుణ
X

దిశ, గద్వాల: జూట మాటలు చెప్పడంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌ను మించిపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు రావడం ఇది మూడోసారి అని గుర్తు చేశారు. చుట్టం చూపుగా వచ్చి మా పైనే విమర్శలు చేస్తావా..? అంటూ ప్రశ్నించారు. గతంలో మేము మంజూరు చేసినా బ్రిడ్జి నిర్మించేందుకు ఏడు సంవత్సరాల సమయం తీసుకున్నారని చురకలు వేశారు. పైగా గత నెల రోజుల నుంచి ప్రజలు రాకపోకలు సాగించకుండా అడ్డుకుని నరకం చూపించారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదట వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై తీర్మానం చేస్తామన్నారు. ఆ తీర్మానాన్ని ప్రత్యేకంగా చేసి పంపకుండా, మైనారిటీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానంలో చేర్చి పంపితే దానికి ఏమైనా అర్థం ఉందా..? అని డీకే అరుణ నిలదీశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రత్యేకంగా తీర్మానం చేశారా..? తీర్మానం చేసిన కాపీ ఇవ్వగలవా..? ఆ కాపీ ఉంటే రా ఢిల్లీ వెళ్లి మాట్లాడుదాము అంటూ సవాల్ విసిరారు. లేదంటే నీ పదవికి రాజీనామా చేస్తావా అని కేటీఆర్‌కు డీకే అరుణ చాలెంజ్ చేశారు. ఈ జిల్లాలో వాల్మీకిలు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఓటు బ్యాంకు కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వాల్మీకులకు ఇచ్చిన హామీ వీడియోపై తమకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ తదితర వివరాలను ఆమె మీడియా ముందు ప్రదర్శించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు అతీగతీ లేదు. తుమ్మెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి మేం గతంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే.. శిలాఫలకంతో సరిపెట్టుకున్నారు. టెక్స్‌టైల్ పార్క్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అరుణ ప్రశ్నించారు. ఈద్గా నిర్మాణానికి నిధులు కూడా ఎందుకు మంజూరు చేయలేదన్నారు. ప్రతి చోటా అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. మంత్రి కేటీఆర్ మించి పోతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే కాలం త్వరలోనే ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. ప్రధాన కార్యదర్శి రవి, రాష్ట్ర నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, నాయకురాలు బాలమణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed