- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 3 లక్షల మందికి గుడ్ న్యూస్..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో అర్హులైన లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు రేషన్ కార్డులను అందజేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త కార్డులకు కూడా రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఆ ప్రకారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి అన్ని జిల్లాల్లోని చౌకధరల దుకాణాలకు ఉత్తర్వులు వెళ్ళాయి. రాష్ట్రంలో సుమారు 3.60 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని, వారికి కొత్త కార్డుల్ని మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల క్రితమే ఆదేశించినా చివరకు పౌరసరఫరాల శాఖ మాత్రం 3,09,083 మంది లబ్ధిదారుల్నే అర్హులుగా గుర్తించింది.
పౌరసరఫరాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5,49,105 దరఖాస్తులు కొత్త కార్డులు పొందడానికి అర్హమైనవిగా గుర్తించింది. చివరికి ఇది రకరకాల స్థాయిల్లో ఫిల్టర్ అయ్యి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు వెళ్ళేటప్పటికి 3.60 లక్షలుగా ఖరారైంది. చివరకు పంపిణీ దగ్గరకు వచ్చేటప్పటికి 3,09,083కు తగ్గిపోయింది. మొత్తం 4,46,169 దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హమైనవాటిని మాత్రమే ఖరారు చేసింది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 56,054 దరఖాస్తులను ఆ శాఖ అధికారులు తిరస్కరించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా కొత్త రేషనుకార్డుల పంపిణీని భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల సంఖ్యను ఖరారు చేయడంతో ఇక పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసినట్లయిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా పంపిణీ అవుతున్న 3,09,083 కార్డుల ద్వారా మొత్తం 8,65,430 మంది లబ్ధిదారులు బియ్యం పొందే అవకాశం ఏర్పడింది. ప్రతీ నెలా అదనంగా రూ. 14 కోట్లకు సమానమైన 5,200 టన్నుల బియ్యాన్ని అందుకోనున్నారు. సంవత్సరానికి దాదాపు రూ. 168 కోట్లను ప్రభుత్వం అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. పాత, కొత్త రేషన్ కార్డులను కలుపుకుంటే బియ్యం కోసమే ప్రభుత్వం సంవత్సరానికి రూ. 2,766 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటికే కేటాయించిన కోటాకు అదనంగా 62,400 టన్నుల మేర పౌరసరఫరాల శాఖ అందించాల్సి వస్తుంది.
కొత్తగా ఖరారైన రేషన్ కార్డుల్లో అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 87.41 లక్షల కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా 2.79 కోట్ల మంది లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం అందుతున్నది. తాజాగా పంపిణీ అవుతున్న కార్డులను కలుపుకుంటే రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 90.50 లక్షలకు చేరుకున్నది. కొత్త లబ్ధిదారులను కలుపుకుంటే ప్రయోజనం పొందేవారి సంఖ్య 2.99 కోట్ల మంది అవుతారని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.