- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRSలో విభేదాలు, కమలంలో కలకలం, హస్తానికి బీటలు.. మరి అక్కడ పట్టు ఎవరిది.?
దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సభలు, సమావేశాలు, పాదయాత్రల పేరుతో అన్ని పార్టీల ముఖ్య నాయకులు అప్పుడే జనాల్లోకి వెళ్లేందుకు తహతలాడుతున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. భవిష్యత్ ఎన్నికల సంగ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు తమదైన పంథాలో ముందుకు వెళుతున్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పుడే సర్వ సన్నద్ధం అవుతున్నారు. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. అన్ని పార్టీల్లోనూ స్తబ్దత నెలకొంది. ఇక్కడ విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అటు అధికార పార్టీలో కొందరి ఆధిపత్య పోరుపై అసంతృప్తి వ్యక్తం అవుతుంటే.. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అధినాయకుల పాదయాత్రలు, సభలతో ఆ ఎఫెక్ట్ తో తమ నియోజకవర్గంలో ఏదో జరిగిపోతోంది అన్న ఆశతో ఉన్నాయి.
అధికార పార్టీలో అంతర్గత విభేదాలు..
మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 10 డివిజన్లకు గాను 9 డివిజన్లలో గెలుపు బావుటా ఎగురవేసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తమ సత్తా ఏంటో చాటారు అధికార టీఆర్ఎస్ శ్రేణులు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ రాజకీయ చతురత, పార్టీ అధిష్టానం సలహాలు, సూచనలతో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు టీఆర్ఎస్ నేతలు. కానీ ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు, కొందరు నేతలపై వస్తున్న ఆరోపణలు, పార్టీలోని అంతర్గత లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈమధ్యకాలంలో నియోజకవర్గంలో మంచి పేరున్న ఓ కార్పోరేటర్ తన సహచరులతో సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల నాటికి తాము ఎలా ముందుకు వెళ్లాలి, ఎమ్మెల్యేగా బరిలో ఉండేందుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై చర్చించారని విశ్వసనీయ సమాచారం.
అది అలా ఉంటే ఒకరిద్దరు కార్పొరేటర్ల వ్యవహారం మిగతా కార్పొరేటర్లకు, పార్టీ సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా నియోజకవర్గంలో అన్ని డివిజన్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు, మిగతా కార్యక్రమాలకు కూడా హాజరువుతున్నారని, ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే పర్యటించినా తమకు కనీసం సమాచారం ఉండడం లేదని కొందరు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే వారూ అక్కడే ఉంటూ హల్చల్ చేస్తున్నారట. ఇక ఓ కార్పొరేటర్ స్థానిక ఎమ్మెల్యేతో కంటే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతోనే క్లోజ్ గా ఉంటూ.. అన్ని పనులు కొడుక్కు అప్పగించి, వేరే వ్యాపకాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్ ను కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల శిలాఫలకంపై వార్డు మెంబర్ తో పాటు పార్టీ కాలనీ ప్రెసిడెంట్ పేరు ఉండడంపై టీఆర్ఎస్ శ్రేణులే గొడవకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.
కమలదళంలో ఎవరి దారి వారిదే..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఆతర్వాత క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయినా గతంతో పోలిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కమలదళం బలపడిందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్ రాకతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే గత జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నేటికి పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్దత నెలకొంది. కమలదళంలో ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. ఓ సీనియర్ నాయకుడి పుట్టినరోజు వేడుకలను ఒక్కో నాయకుడు ఒక్కోచోట జరిపారు. అలాగే ఒకరి కార్యక్రమానికి మరొకరు హాజరుకాలేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలోనూ బీజేపీ నేతలు ఎవరిదారిలో వారు వెళుతున్నారే తప్ప కలిసికట్టుగా గళమెత్తలేకపోతున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలైన బీజేవైఎం ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్కార్ విధానాలను ఎండగడుతుంటే, కొందరు బీజేపీ నేతలు మాత్రం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తహతలాడడం, ఇంకొందరు ఆయా కార్యక్రమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఉమ్మడిగా సాగుతూ పార్టీ పటిష్టత కోసం కృషిచేయకుండా సొంత ఇమేజ్ కోసం నేతలు పరితపిస్తుండడం కమలనాథులకు పెద్ద మైనస్ గా మారుతోంది.
కాంగ్రెస్ కు కార్యకర్తలే దిక్కు..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ఓ వెలుగు వెలిగిన హస్తం పార్టీకి ఇప్పుడు లీడర్లే కరువయ్యారు. నేనున్నానని చెప్పేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క పేరున్న నాయకుడు కూడా లేకుండా పోయారు. టీపీసీసీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోని సెకండ్ కేడర్ ముందుకు వచ్చి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చందానగర్ వేదికగా ఆయా కార్యక్రమాలు చేపడుతోంది. కానీ సీనియర్లు ఎవరూ లేని కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఇక్కడ ఎలా నిలదొక్కుకుంటుంది అన్నది ప్రశ్నార్థకమే. ఇక టీడీపీ, వామపక్ష పార్టీల ఊసే లేకుండా పోతోంది. కార్యకర్తలు ఉన్నా ఆయా పార్టీల్లో లీడర్ల కొరత వేధిస్తోంది. వామపక్షాలు తరచూ ప్రభుత్వ విధానాలపై గళమెత్తుతున్నా అది గత స్థాయిలో లేదనేది కాదనలేని వాస్తవం. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ ఇంకా క్షేత్రస్థాయిలో కాలుమోపలేదు. ఇలా ఒక్కో పార్టీది ఒక్కో పరిస్థితి. కానీ రానున్న ఎన్నికల్లో ఇక్కడ గెలుపు మాదే అంటే మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు.