మిస్టరీ : నైవేద్యం పెట్టకపోతే సన్నగా మారుతున్న నడుము

by Sumithra |   ( Updated:2023-02-11 15:08:14.0  )
మిస్టరీ : నైవేద్యం పెట్టకపోతే సన్నగా మారుతున్న నడుము
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశం అంటే చాలు చాలా మందికి గుర్తొచ్చేది ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు. ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయాలు, అంతుచిక్కని అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఇప్పటికీ సైన్స్ ఛేదించలేకపోయింది. ఎంతో మంది సైంటిస్టులు హిందూ ఆలయాలపై ఎన్నో పరిశోధనలు చేసినా ఫలితం మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇలాంటి అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్న ఆలయాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం ఒకటి. ఆ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరచి ఉంటుంది. అర్థరాత్రి వేళలో కూడా ఆలయంలో ఉన్న దేవునికి నైవేద్యం సమర్పిస్తుంటారు. ఈ ఆలయంలో వెన్నదొంగకు కనీసం 10 సార్లైనా నైవేద్యం సమర్పిస్తారు. ఎందుకంటే ఆ దేవునికి ఎడతెగని ఆకలి ఉంటుందట. ఒక్కపూట నైవేద్యం ఆలస్యం అయినా విగ్రహం నడుము సన్నబడుతుందంట. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ రహస్యాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఓ మాధవుని ఆలయం ఉంది. ఈ గుడిలోని శ్రీ కృష్ణుని విగ్రహానికి 1500 ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు. ఈ ఆలయంలో కొలువైన వెన్నదొంగకి ఎక్కడా లేనంత ఆకలి ఉంటుందట. పురాణాల ప్రకారం, కృష్ణుని మేనమామ కంసుడిని వధించిన తర్వాత ఎడతెగని ఆకలితో ఉండేవాడని చెబుతారు. అందుకే ఈ ఆలయంలో ఉన్నదేవునికి ప్రతిరోజు సుమారు 10 సార్లైనా నైవేద్యాన్ని సమర్పిస్తారట. నైవేద్యం పెట్టీ పెట్టగానే క్రమక్రమంగా తగ్గిపోతుందని ఆలయానికి వచ్చే భక్తులు, ఆలయ అర్చకులు చెబుతారు.

ఒకవేళ ఏ పూటైనా ప్రసాదం లేటయితే కిట్టయ్య నడుము సన్నగా అయిపోయి స్వామివారి నడుముచుట్టూ ఆభరం వదులై కొన్ని ఇంచులు కిందికి దిగుతుందట. విగ్రహం సైజు కూడా తగ్గిపోవడం ప్రారంభమవుతుందట. ఇప్పటికీ ఆ రహస్యం ఏంటి అనేది ఎవ్వరికీ అంతుచిక్కడంలేదు. అందుకే ఈ ఆలయాన్ని అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణిస్తారు. అంతే కాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరచి ఉంచి స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఆ ఆలయంలో స్వామివారికి పెట్టని ప్రసాదాన్ని భక్తులు స్వీకరిస్తే వారికి జీవితకాలంలో ఎప్పుడూ పేదరికం రాదని భక్తుల నమ్మకం.

ఈ ఆలయం ప్రతిరోజూ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మూసివేసి ఉంచుతారు. 11:58 గంటలకు మూసేసి.. సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. మూసిన గుడిని తెరవడానికి గుడి తాళాలతో పాటు గొడ్డలి కూడా తీసుకువస్తారు. ఒకవేళ తాళాలతో తలుపులు తెరచుకోకపోతే గొడ్డలితో తాళాన్ని పగులగొట్టి గుడిని తెరుస్తారు. కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని ఆలయ పూజారులు పాటిస్తున్నారు. ఈ ఆలయం కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి అనేక మార్గాల గుండా వెళ్లొచ్చు.

Advertisement

Next Story