మేడారానికి పోటెత్తుతున్న భ‌క్తులు

by Shyam |
మేడారానికి పోటెత్తుతున్న భ‌క్తులు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: మేడారం మినీ జాత‌ర‌కు వేలాదిగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. ముంద‌స్తుగా వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం వనదేవతలు స‌మ్మక్క, సార‌ల‌మ్మల‌ను దర్శించుకోవడానికి మేడారానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా 50వేల మందికి పైగానే భ‌క్తులు అమ్మవార్లను ద‌ర్శించుకున్నట్లుగా అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతోనే భ‌క్తులు అధిక సంఖ్యలో వ‌చ్చినట్లుగా చెబుతున్నారు. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో జంప‌న్నవాగు జ‌న‌సందోహంతో నిండిపోయింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి వనదేవతల సన్నిధికి చేరుకున్నారు.

గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేథ్యం, చీరలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలించారు. ఇదిలావుంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర రెండేళ్లకోసారి జ‌రుగుతుంది. మూడు రోజులపాటు వైభ‌వంగా జ‌రిగే ఈ జాత‌ర సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గ‌ద్దెల మీద‌కు రావ‌డంతో మొదలయ్యి.. వన ప్రవేశంతో ముగుస్తుంది. మేడారంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఆనవాయితీగా చిన్న జాతర జరుగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story