ఆట కోసం ఆస్తులు అమ్ముకున్న క్రికెటర్

by Shyam |
ఆట కోసం ఆస్తులు అమ్ముకున్న క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్: డెవాన్ కాన్వే.. నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ సుపరిచితం లేని పేరు. న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే క్రికెట్ మక్కాగా పిలుచుకోనే ‘లార్డ్స్’ మైదానంలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డెవాన్ కాన్వే.. టెస్ట్ క్రికెట్ ఆడాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ వెనక పెద్ద కథే ఉన్నది. వాస్తవానికి డెవాన్ కాన్వేది న్యూజిలాండ్ కాదు. అతను పుట్టి పెరిగింది అంతా కూడా దక్షిణాఫ్రికాలోనే. అంతే కాదు 2017 వరకు దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెటర్‌గా ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. 2009లో దక్షిణాఫ్రికాలోని గ్యాటెంగ్ ప్రావిన్స్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ జట్టుకు దాదాపు 8 ఏళ్లు క్రికెటర్‌గా సేవలు అందించాడు.

2015లో ఆఫ్రికా టీ20 కప్‌లో గ్వాటెంగ్ జట్టు తరపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఏన్నో ఏళ్లుక్రికెట్ ఆడినా అతడు జాతీయ జట్టుకు మాత్రం సెలెక్ట్ కాలేక పోయాడు. అంతే కాకుండా గ్వాటెంగ్ జట్టులో కూడా స్థిరమైన స్థానం ఉండేది కాదు. సెలెక్టర్లు ఒక సీజన్ సెలెక్ట్ చేస్తే మరోసీజన్‌కు పక్కన పెట్టే వాళ్లు. కానీ చిన్నప్పటి నుంచి టెస్ట్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలని కలలు కన్న డెవాన్ కాన్వేకు తన కల చెదిరిపోతున్నట్లు అనిపించింది. అప్పుడప్పుడు ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడేవాడు. కానీ తనకు మాత్రం ఎక్కడో అసంతృప్తి మొదలైంది. 2017 మార్చిలో గ్వాటెంగ్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఆ తర్వాత దక్షిణాఫ్రికాను వదిలి న్యూజిలాండ్ ప్రయాణం అయ్యాడు.

అన్నీ వదలి కివీస్ వైపు కదిలి..

డెవాన్ కాన్వే తండ్రి ఒక ఫుట్‌బాల్ కోచ్. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్ శివార్లలో వారికి పెద్ద భూమి, పశువులు ఉన్నాయి. మక్కా ఫుట్‌బాల్ క్లబ్‌కు అతని తండ్రి కోచ్‌గా ఉండేవాడు. కానీ అతడికి మోటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అయితే కాన్వేకు మాత్రం చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అప్పట్లో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ నీల్ మెకెంజీకి కాన్వే తండ్రికి మంచి స్నేహం ఉండేది. కాన్వేకి కూడా నీల్ మెకెంజీ అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి మెకెంజీతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం వచ్చింది. తొలి సారి మెకెంజీతో మాట్లాడుతున్నప్పుడు ‘బ్రెట్ లీ ఎంత వేగంగా బంతులు విసురుతాడు?’ అని కాన్వే ప్రశ్నించాడంటా. దానికి మెకెంజీ ‘మీ నాన్న నడిపే కారు కంటే వేగంగా’ అని సమాధానం చెప్పాడంటా.

తాను కూడా అంత వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలని చిన్నప్పటి నుంచే క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే దక్షిణాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్‌లో ఇంకా కొన్నాళ్లు ఆడితే తన కెరీర్ నాశనం కావడం ఖాయమని భావించి న్యూజిలాండ్ వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికే న్యూజిలాండ్‌లో క్రికెట్ ఆడుతున్న తన స్నేహితులు మాల్కమ్ నోఫాల్, మైఖెల్ రిప్పన్‌లు కూడా కివీస్ వచ్చేయమని సలహా ఇవ్వడంతో దక్షిణాఫ్రికాలో తనకు ఉన్న ఇల్లు, ఫర్నిచర్, కార్ మొత్తం అమ్మేసి న్యూజిలాండ్ ప్రయాణమయ్యాడు. అతడి జీవిత భాగస్వామి కూడా కాన్వే నిర్ణయాన్ని కాదనలేదు. అలా న్యూజీలాండ్ వచ్చేశాడు.

కివీస్‌లో చెలరేగిపోయాడు..

అగస్టు 2017లో కాన్వే వెల్లింగ్టన్‌లో అడుగుపెట్టాడు. అక్కడకు వచ్చిన నాలుగో రోజు విక్టోరియా యూనివర్సిటీ క్రికెట్ క్లబ్‌లో కోచ్ కమ్ క్రికెటర్‌గా జాయిన్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అతడికి వెల్లింగ్టన్ నగరం ప్రాణంలా మారిపోయింది. అతడి టెక్నిక్ చూసి నెమ్మదిగా వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ జట్టులోకి చేర్చుకుంది. ఆ జట్టు తరపున 17 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన కాన్వే.. 72.63 సగటుతో 1598 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోర్ కాంటెర్‌బరీపై 327 నాటౌట్. న్యూజీలాండ్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన ఎనిమిదవ క్రికెటర్‌గా కాన్వే రికార్డు సృష్టించాడు.

2019-20 సీజన్‌లో కాన్వే మూడు దేశవాళీ పోటీల్లో పాల్గొని టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్లంకెట్ షీల్డ్, లిస్ట్ ఏ క్రికెట్ ఫోర్డ్ ట్రోఫీ, టీ20 సూపర్ స్మాష్‌లో పరుగుల వరద పారించాడు. డెవాన్ కాన్వే అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో వెల్లింగ్టన్ జట్టు 2003-04 తర్వాత తొలి సారిగా ప్లంకెట్ షీల్డ్ గెలిచింది. అంతే కాకుండా సూపర్ స్మాష్ కూడా తమ సొంతం చేసుకున్నది. ఇక కాన్వే న్యూజీలాండ్ జాతీయ జట్టులోకి రావడానికి ఐసీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో గత ఏడాది అగస్టులో అతడి విజ్ఞప్తిని ఐసీసీ ఓకే చేసింది. గత ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌పై టీ20ల్లో, ఈ ఏడాది మార్చ్‌లో బంగ్లాదేశ్‌పై వన్డేలో అరంగేట్రం చేశాడు.

తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చి తొలి టెస్ట మ్యాచ్‌లొనే డబుల్ సెంచరీ కొట్టాడు. ‘ఆ రోజు వెల్లింగ్టన్‌లో డబుల్ సెంచరీ కొట్టడాని ముందు నా సహచరితో ఈ దేశం వదిలి న్యూజీలాండ్ వెళ్లిపోదామని చెప్పాను. తాను ఏ మాత్రం సంశయించకుండా సరే ఎప్పుడు వెళ్దాం అని అన్నది. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో ఈ రోజు అర్దం అవుతున్నది’ అని డెవాన్ కాన్వే అంటున్నాడు. మొత్తానికి ఆస్తులు అమ్ముకొని దేశం వదిలిన క్రికెటర్.. ఇప్పుడు మరో దేశంలో చాంపియన్‌గా మారాడు.

Advertisement

Next Story

Most Viewed