ఈ నెల 24న ప్రజా యుద్ధానికి మద్దతు పలకండి: జగన్

by Sridhar Babu |   ( Updated:2021-11-19 02:53:38.0  )
Operation-Prahar1
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: భారత విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో దోపిడి పాలక వర్గాలు 2009 నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ ను దీర్ఘకాల పథకంతో రూపొందించాయని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పేరు మీద ఓ ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోడీ మన దేశాన్ని అమ్మి వేయడానికి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ సామ్రాజ్యవాదులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. హిందుత్వ పాలకుల అణిచితవేత చర్యలైన ప్రహార్-3ను వ్యతిరేకిస్తూ నవంబర్ 24న ప్రజా యుద్ధానికి మద్దతు పలకాలని, అంతర్జాతీయ కార్యాచరణ దినాన్ని జరుపుకోవాలని అన్ని వర్గాలను కోరారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా లక్షలాది రైతాంగం త్యాగాలకు సిద్ధపడి పోరాడుతున్నారని, మరో పక్క అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు జల్, జంగల్, జమీన్ స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం హరిత హారం పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి గెంటివేసేందుకు ప్రయత్నిస్తున్నా హక్కుల కోసం ఆదివాసీలు విరోచితంగా పోరాడుతున్నారన్నారు.

2021 సెప్టెంబర్ 26న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నత అధికారులతో సమావేశమై విప్లవోద్యమాన్ని నిర్మూలించే పథకాన్ని రూపొందించి అణిచివేత చర్యలు వేగంగా ప్రారంభించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం గ్రామం వద్ద పోలీసు బేస్ క్యాంపును నెలకొల్పారని, త్వరలో ఇదే మండలంలో పూసుగుప్పు వద్ద మరో బేస్ క్యాంపు నిర్మించడానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అందుకే నవంబర్ 24న గ్రామ గ్రామాన “ఆపరేషన్ ప్రహార్” వ్యతిరేక ప్రజా ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని, నరెంద్ర మోడీ, అమిత్ షా, భాగవత్ ల దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story