శభాష్ తన్వీర్.. రిక్షాపుల్లర్ కొడుకు ఐఈఎస్‌లో రెండో ర్యాంక్

by Shamantha N |   ( Updated:2021-08-02 10:23:33.0  )
Tanvir
X

దిశ, ఫీచర్స్ : జమ్మూ కాశ్మీర్‌లోని నిగీన్‌పోరా కుండ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు తన్వీర్ అహ్మద్ ఖాన్ ఎన్ని కష్టాలు వచ్చినా తన లక్ష్యాన్ని వదలకుండా శ్రమించి ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ (IES) పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి ఔరా అనిపించాడు.

తన్వీర్ తండ్రి రైతుగా శ్రమిస్తూనే, కుటుంబ అవసరాలరీత్యా శీతాకాలంలో రిక్షాపుల్లర్‌గానూ పనిచేసే వాడు. కొడుకును ఉన్నత చదువులు చదివించాలనే ఆ తండ్రి కోరికను నిజం చేస్తూ తన్వీర్ ఉత్తమ మార్కులు తెచ్చుకునేవాడు. 2016లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్న తన్వీర్, కాశ్మీర్ విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ పరీక్షలో మూడో ర్యాంక్ తెచ్చుకుని ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాడు.

ఓ వైపు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నా, చదువుపైన ఫోకస్ పెట్టిన అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చివరి సంవత్సరంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించడం ద్వారా మరొక ఘనతను సాధించాడు. దాంతో కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీలో (MPhil) డెవలప్‌మెంట్ స్టడీస్‌లో చేరాడు. ఎం.ఫిల్ చేస్తూనే, IES పరీక్షకు సిద్ధమై ఆ పరీక్షలు రాశాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో రెండో ర్యాంక్ సాధించాడు.

‘రాత్రిపగలు అనే తేడా లేకుండా శ్రమించాను. నా మొదటి అవకాశాన్నే నా చివరిదిగా భావించాను. దానికి ఫలితమే ఈ ర్యాంక్. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమేనని ఇప్పటికే ఎందరో నిరూపించారు. మీరు కూడా ఎవరికీ తక్కువ కాదు. మీరు ప్రయత్నించడం తప్పక విజయం దక్కుతుంది. ప్రాథమిక విద్యా వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరముంది. పూర్తి స్థాయి అధ్యాపకులు ఉన్న అన్ని కళాశాలల్లో పరిశోధన కేంద్రాలు వంటి ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలి’
– తన్వీర్

Advertisement

Next Story

Most Viewed