తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం

by vinod kumar |
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటిదాకా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదుకాగా గురువారం మాత్రం 18 కేసులే నమోదయ్యాయి. ఇకపైన కొత్త కేసుల సంఖ్య మరింతగా తగ్గుతుందని, ఈ నెల 22 కల్లా చికిత్స పొందుతున్న పేషెంట్లు కూడా కోలుకుంటారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 414 మంది చికిత్స పొందుతున్నారని, గురువారం ఒకరు మృతిచెందగా మరొకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య పన్నెండుకు చేరుకుంది. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా నమోదైన 18 కేసులతో కలిపి రాష్ట్రం మొత్తంమీద ఇప్పటివరకు కరోనాబారిన పడినవారి సంఖ్య 471 అయిందన్నారు. ఇందులో 385 మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్కజ్‌తో సంబంధం కలిగినవారేనన్నారు. కొత్త కేసులకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో మొత్తం 101 హాట్ స్పాట్‌లను గుర్తించి అక్కడి ఇంటింటి హెల్త్ సర్వే నిర్వహిస్తున్నామని, అందులో 15 బస్తీలు హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్నారు.

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, అక్కడి నుంచి కొద్దిమంది మర్కజ్‌కు వెళ్ళి వచ్చినందున కట్టడి చర్యలనుముమ్మరం చేశామన్నారు. బుధవారం 665 మంది అనుమానితుల నుంచి నమూనాలు తీసుకుని పరీక్షిస్తే 18 పాజిటివ్ వచ్చాయని, మిగిలినవారికి వైరస్ సోకలేదన్నారు. విదేశీ ప్రయాణం ద్వారా వైరస్ బారినపడినవారు కోలుకున్నారని, చాలా మంది ఇళ్ళకు వెళ్ళిపోగా రెండు మూడు రోజుల్లో సుమారు 70 మంది వరకూ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారంతా మర్కజ్‌కు చెందినవారేనన్నారు. ఇకపైన కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గేదన్నారు. నిజానికి మర్కజ్ వ్యవహారం ఉనికిలోకి రాకపోయినట్లయితే ఈపాటికే తెలంగాణ కరోనారహిత రాష్ట్రం అయ్యేదన్నారు.

కరోనా వైరస్ ఇకపైన కొత్తవారికి సోకకుండా ఉండేందుకు అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని, అందులో భాగమే హాట్‌స్పాట్ కేంద్రాల్లో అన్ని దారులనూ మూసివేసి ఇంటింటికీ హెల్త్ సర్వే నిర్వహించడం అని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాంతాల్లో కూరగాయలు, మార్కెట్ అవసరాలకు రోడ్లమీదకు వచ్చేవారిలో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేకుండా చేసేందుకు స్వయంగా ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్ లాంటి ఉన్నతాధికారులంతా ఆ ప్రాంతాల్లో పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారని, ఇవన్నీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగమేనన్నారు. ఇంకా సుమారు 400 పరీక్షలకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని, అవి కూడా ఒకటి రెండు రోజుల్లో వస్తాయన్నారు. ఇకపైన కొ్త్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Telangana, Corona, Positive, Declines, Markaz, Discharge, Minister Eatala

Advertisement

Next Story

Most Viewed