గాలి బుడగలతో ఆకాశంలో అందనంత ఎత్తుకు!

by Shyam |   ( Updated:2023-12-15 16:37:38.0  )
గాలి బుడగలతో ఆకాశంలో అందనంత ఎత్తుకు!
X

దిశ, వెబ్‌డెస్క్: బెలూన్‌లను ఒక చేతిలో పట్టుకుని గాల్లోకి ఎగరడం అనేది చాలా కష్టమైన స్టంట్. అలాంటి విన్యాసాన్ని అమెరికాకు చెందిన ఇల్యూషనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ అలవోకగా చేసి పడేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 బెలూన్లను ఒంటి చేత్తో పట్టుకుని 24000 అడుగులు గాల్లోకి ఎగిరాడు. ఇప్పటికే విభిన్న విన్యాసాలు, మేజిక్ ట్రిక్‌లు చేసి రికార్డు బద్దలు కొట్టిన డేవిడ్.. ఇప్పుడు ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాన్ని అందరిముందు ప్రత్యక్షంగా చేశాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తన అభిమానుల కోసం యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ కూడా చేయడం విశేషం. కాగా, 52 హీలియం బెలూన్లతో డేవిడ్ చేసిన ఈ విన్యాసం ప్రముఖ యానిమేషన్ సినిమా ‘అప్’ను తలపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ విన్యాసం కోసం గత పదేళ్ల నుంచి డేవిడ్ శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. 30 నిమిషాలు సాగిన ఈ విన్యాసం కోసం 500 సార్లు విమానం నుంచి దూకడం ప్రాక్టీస్ చేశాడు. అంతేకాకుండా దీని కోసం హాట్ ఎయిర్ బెలూన్ లైసెన్స్‌ను కూడా డేవిడ్ పొందినట్లు సమాచారం. అలాగే ఈ విన్యాసం ప్రారంభించడానికి ముందు ప్రతి చిన్న అంశాన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించి, ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు, గాలి వేగం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, అధ్యయనం చేసిన తర్వాతనే ఈ విన్యాసం చేయడానికి పూనుకున్నారు. గాలిలో 8000 అడుగులు వెళ్లిన తర్వాత డేవిడ్ ప్యారాచూట్ ధరించి, ఓపిక ఉన్నంత ఎత్తు వరకు వెళ్లాలనుకున్నారట, కానీ తాను 24,900 అడుగుల ఎత్తుకు వెళ్లగలుగుతానని అస్సలు ఊహించలేదని డేవిడ్ చెప్పారు. తన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్‌తో కిందనున్న తన బృందానికి డేవిడ్ టచ్‌లో ఉండి, ఎప్పుడు ప్యారాచూట్ విడుదల చేయాలనే విషయాలను తెలుసుకున్నారు. ఫైనల్‌గా 24,900 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో డేవిడ్ ప్యారాచూట్ ద్వారా కిందకి వచ్చారు. ఈ విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూసిన వారితో పాటు యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షించిన వారు కూడా అబ్బురపోయారు.

Advertisement

Next Story