‘నాన్న’ నాకు నువ్వొద్దు.. ప్రియుడే కావాలంటూ దారుణానికి ఒడిగట్టిన కూతురు..

by Anukaran |   ( Updated:2021-11-13 10:59:20.0  )
‘నాన్న’ నాకు నువ్వొద్దు.. ప్రియుడే కావాలంటూ దారుణానికి ఒడిగట్టిన కూతురు..
X

దిశ, ఉప్పల్ : ప్రియుడి కోసం కన్న తండ్రినే కడతేర్చింది ఓ కసాయి కూతురు.. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని భావించిన మైనర్ బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది.ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ కథనం ప్రకారం.. కాప్రాలో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న రామకృష్ణ తన నివాసంలో కాలు జారి కింద పడటంతో మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు.

పోస్టుమార్టం నివేదికలో మృతుడు ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్య చేశారని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి కూతురు నారాయణగూడలో నివాసముంటున్న వాచ్మెన్ కొడుకు చిట్టి భూపాల్‌తో ప్రేమలో ఉంది. అయితే, అతనితో తిరగవద్దని తండ్రి రామకృష్ణ పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న కూతురు అతన్ని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది.

రాత్రి నిద్రిస్తున్న తన తండ్రిని, ప్రియుడు భూపాల్, అతని స్నేహితులతో కలిసి రామకృష్ణను పథకం ప్రకారం హత్య చేశారు. ఆ తర్వాత కిందపడిపోయి మరణించినట్టు అందరినీ నమ్మించారు. పోలీసులు కూడా ముందు అదే నిజం అనుకున్నా పోస్టుమార్టం నివేదిక మాత్రం కసాయి కూతురి కుట్రను బయట పెట్టింది. దీంతో మైనర్ బాలికతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story