తోక ముడిచిన కేసీఆర్.. సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ దొరకలేదా.?

by Anukaran |   ( Updated:2021-11-24 23:59:54.0  )
kcr-and-modi
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధమే.. తాడో పేడో తేల్చుకొనే వస్తా.. మంత్రులు, అధికారుల బృందంతో వెళ్తున్నా..’ అంటూ ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్​కేంద్ర మంత్రులు, ప్రధానిని కలువకుండానే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆదివారం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ నాలుగు రోజుల పాటు బంగళాకే పరిమితమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాల మొదలు విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు, కేంద్ర ప్రభుత్వ హామీల ఊసే లేదు. మంత్రులను, అధికారులను వెంటబెట్టుకుని వెళ్ళినా వడ్ల కొనుగోళ్ళ అంశం కొలిక్కి రాలేదు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఢిల్లీ టూర్‌లో ఏ ఒక్కరినీ కలవకుండా తిరుగు ప్రయాణం కావడం ఇదే ప్రథమమని అటు పార్టీ నేతలు, ఇటు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు, రానున్న యాసంగి సీజన్‌లో రైతులు ఏ పంటలు వేయాలన్న దానిపై కేంద్రం నుంచి క్లారిటీ తీసుకుంటానని, ఆ తర్వాతనే వివరంగా చెప్పగలనని, సమగ్ర సాగు ప్రణాళిక రూపొందించుకోవడం సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. పైగా అనూరాధ కార్తె కూడా వచ్చేసినందున రానున్న యాసంగికి నాట్లు వేసే ప్రక్రియ మొదలువుతుందని, కేంద్రం ఎంత త్వరగా తేలిస్తే రైతులకు అంత ఉపశమనం ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఢిల్లీ టూర్‌లో దీనిపై క్లారిటీ రాకపోగా మంత్రులను కలిసి రాష్ట్ర అంశాలను చర్చించడానికి కూడా సీఎం చొరవ తీసుకోలేదు.

సీఎంపై విమర్శల వెల్లువ..

ఢిల్లీ వెళ్లిన సీఎం ఎవరినీ కలువకుండా తిరిగి రావడం విమర్శలకు తావిస్తున్నది. అధికారిక పర్యటన కోసమే వెళ్లారా? లేకా వ్యక్తిగతమా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వకుండా ఉంటారని ప్రశ్నించారు. అసలు పీఎం అపాయింట్‌మెంట్‌ను అడగనే లేదంటున్నారు. కేసీఆర్ తన భార్యకు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వ్యక్తిగత పనిపై వెళ్లి.. దానికి ‘వడ్ల కొనుగోళ్ళపై తాడో పేడో’ అనే కలరింగ్ ఇచ్చారని బీజేపీ నేత ఒకరు కామెంట్ చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వ్యవహారం మొత్తం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుదిరిన ఓ మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈ రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న నాటకం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ క్రీడలో సామాన్య రైతులు బలవుతున్నారని ఆరోపించారు. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని, తనువు చాలిస్తున్నారని, కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీలో సేద తీరుతున్నారని విమర్శించారు.

పీయూష్ భేటీకీ దూరంగానే కేసీఆర్

వడ్ల కొనుగోలు అంశంమీదనే ఢిల్లీ వెళ్లినప్పటికీ కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన భేటీకి కేసీఆర్ హాజరుకాకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమైన సమస్య అని చెప్తూనే దానిపై చర్చించడానికి ఎందుకు చొరవ తీసుకోలేదని, కేవలం మంత్రుల్ని, అధికారులను మాత్రమే పంపి గైర్హాజరు కావడానికి కారణలేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి. తాడో పేడో తేల్చుకోడానికి ఢిల్లీకి వెళ్తున్నానంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చివరకు రాష్ట్రంలోని రైతుల్ని, ప్రజలను మభ్యపెట్టారని, ఈ నాలుగు రోజుల్లో ఆయన అక్కడ చేసిందేంటో వివరించాలని బీజేపీ నాయకురాలు అరుణ డిమాండ్ చేశారు.

హుజూరాబాద్‌లో ఓటమిని జీర్ణించుకోలేక, దళితబంధు అమలుపై ప్రజలకు జవాబు చెప్పలేక వడ్ల సమస్యను తెరపైకి తెచ్చి అటెన్షన్ డైవర్షన్ ట్రిక్కులు చేస్తున్నారని అరుణ ఆరోపించారు. రానున్న యాసంగి సీజన్‌కు బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మూడు నెలల క్రితమే రాష్ట్రానికి తెలియజేసిందని, ఇంతకాలం స్పందించకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరుసటి రోజు నుంచి ఈ రాగం అందుకోవడం వెనక వాస్తవాలను ప్రజలు గ్రహిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకూ కేసీఆర్ ఢిల్లీ పర్యటన అధికారికమా లేక వ్యక్తిగతమైనదా అని ప్రశ్నించిన అరుణ ప్రధాని మోడీతో భేటీకి అపాయింట్‌మెంట్ కోరడంపైనా సందేహాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed