సాకర్‌లో 'సెంచరీ' చేసిన రొనాల్డో

by Shyam |   ( Updated:2020-09-10 06:47:21.0  )
సాకర్‌లో సెంచరీ చేసిన రొనాల్డో
X

దిశ, స్పోర్ట్స్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనతను అందుకున్నాడు. 100 అంతర్జాతీయ గోల్స్ చేసిన తొలి యూరోప్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) టోర్నీలో భాగంగా పోర్చుగల్, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఘనత సాధించాడు. ఆట 45వ నిమిషంలో గోల్ చేయడంతో 100 గోల్స్ మైలురాయిని అందుకున్నాడు.

ఆ తర్వాత 73వ నిమిషంలో రొనాల్డో మరో గోల్ చేశాడు. దీంతో అతడి గోల్స్ సంఖ్య 101కి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0 తేడాతో స్వీడన్‌పై విజయం సాధించింది. రొనాల్డో కంటే ముందు ఇరాన్‌కు చెందిన అలీ దాయి 100 గోల్స్ సాధించాడు. ఆయన తన కెరీర్‌లో మొత్తం 109 గోల్స్ చేశాడు. 2006లో ఆయన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. 2003లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన రొనాల్డో ఇప్పటి వరకు మొత్తం 165 మ్యాచ్‌లు ఆడాడు.

అతను 45 దేశాలపై కనీసం ఒక గోల్ అయినా సాధించిన రికార్డు ఉంది. అతను అత్యధికంగా లిథువేనియా, స్వీడన్‌లపై 7 గోల్స్ చేశాడు. రొనాల్డో గోల్ చేసిన 55 మ్యాచ్‌లలో పోర్చుగల్ గెలుపొందింది. ఆరింటిలో ఓడగా, ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ప్రొఫెషనల్ క్లబ్ లీగ్స్‌లో రొనాల్డో మొత్తం 447 గోల్స్ చేశాడు. రొనాల్డో తర్వాత స్థానాల్లో హంగేరీ ఆటగాడు పుస్కాన్ (84), జాంబియా ఆటగాడు గాడ్ ఫ్రే (79), ఇరాక్ ఆటగాడు హుస్సేన్ సయిద్ (78) ఉన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ ఛెత్రీ 72 గోల్స్‌తో టాప్ టెన్‌లో ఉండగా, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 70 గోల్స్‌తో 15వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed