ఘోరం..రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మృతి

by Aamani |   ( Updated:2024-08-25 11:29:05.0  )
ఘోరం..రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మృతి
X

దిశ, కొత్తూరు : మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ ఓ తల్లీ కూతురిని మృత్యు ఒడికి చేర్చి మరో చిన్నారికి తల్లిని దూరం చేశాడు. ఈ హృదయ విదారక ఘటన 44వ జాతీయ రహదారిపై మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చేగూర్ రోడ్డు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుగ్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ డ్రైవర్ షేక్ మహమ్మద్ మద్యం మత్తులో అజాగ్రత్తగా అతివేగంగా లారీని నడుపుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉప్పుగూడకు వెలుతున్న దంపతులను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెనుక కూర్చున్న తల్లీ కూతురు కావ్య(25) అనన్య (1) ఒక్క సారిగా ఎగిరి పడి తీవ్రమైన గాయాలతో మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ ద్విచక్ర వాహనంతో పాటు మరో రెండు వాహనాలను కూడా లారీ ఢీకొనడంతో ముగ్గురికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ షేక్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.మృతురాలి భర్త సాయి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదం వల్ల రహదారి అంతా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సీఐ నరసింహారావు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను పునరుద్దరించారు.

Advertisement

Next Story