బోల్తా పడిన ఉపాధ్యాయుల వాహనం.. ఆరుగురికి గాయాలు..

by Sumithra |
బోల్తా పడిన ఉపాధ్యాయుల వాహనం.. ఆరుగురికి గాయాలు..
X

దిశ, అందోల్‌ : విధులకు హజరయ్యేందుకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో 6గురు టీచర్లకు తీవ్ర గాయాలైన సంఘటన అందోల్ మండలం మాసానిపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని నేరడిగుంట, అక్సాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిరోజు పటాన్‌చెరు నుంచి ప్రైవేటు వాహనంలో విధులకు వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నేరడిగుంట పాఠశాలలో పనిచేస్తున్న వరలక్ష్మి, పూర్ణచంద్రరావు, రాంచెందర్, అక్సాన్‌పల్లి పాఠశాలలో పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి, ప్రవీణ, జ్యోతి రత్నకుమారీలు వాహనంలో విధులకు వేళ్తున్నారు.

ఈ క్రమంలోనే మాసానిపల్లి శివారులోని 161 జాతీయ రహదారి పై ఉన్న ఫ్లై ఓవర్‌ ఎక్కుతుండగా వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు టీచర్లలో వరలక్ష్మి తలకు గాయం కాగా, జ్యోతి రత్నకుమారి కాలు విరగగా, మిగతా నలుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. డ్రైవర్‌ ప్రవీణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జోగిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడు ఎ.మాణయ్యతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

Next Story

Most Viewed