పూతపూశారు...మాయచేశారు...

by Sridhar Babu |
పూతపూశారు...మాయచేశారు...
X

దిశ, ఖమ్మం రూరల్ ​: కడియాల(కడ)కు బంగారు పూత పూసి రూ.లక్షల్లో మాయ చేశారు. ఖమ్మం డీసీసీబీలో గత వారం రోజుల క్రితం ఈ మోసం బయటపడినట్లు తెలిసింది. కానీ అది ఆలస్యంగా వెలుగు చూసింది. గత రెండు రోజుల క్రితం ఖమ్మం డీసీసీబీ వారు సిబ్బందిని పిలిపించి చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అధికారులు నిందితుల అడ్రస్​కు వెళ్లగా అక్కడ వారు లేనట్టు తెలింది. హైద్రాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలోని తన బావమరిదితో మాయకు పన్నాగం పన్నారు. నిందితులు ఖమ్మంనగరంలోని ఓ ప్రైవేట్​ బ్యాంక్​లో కూడా కడియాన్ని తాకట్టుపెట్టగా అప్రైజర్​ దానిని కట్​ చేయడంతో అది నకిలీది అని తెలింది.

దీంతో విషయం బయటకు వచ్చింది. ఈ ముఠా ఖమ్మం పంజాబ్​ బ్యాంక్​ను సైతం మాయ చేసి లోన్​ తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన డీసీసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఖమ్మం నగరంలోని నాలుగు డీసీసీబీ శాఖల్లో ఈ ముఠా రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. హైద్రాబాద్​కు చెందిన ముఠా నాయకుడు ఖమ్మం రూరల్​ మండలం డాక్యాతండా, తాళ్లేసతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఈ మోసానికి పథకం రచించి అమలు చేశారు. ఖమ్మం నగరంలోని ఒక్క డీసీసీబీ బ్యాంక్​లోనే ఈ ముఠా 29 మంది పేర్ల మీద దాదాపు రూ.30 లక్షలకు పైగా రుణాలను తీసుకున్నట్టు తెలిసింది.

బంగారం నకిలీ ఇలా..

ఈ ముఠా కేవలం కడియాలను మాత్రమే తాకట్టు పెడుతుంది. హైద్రాబాద్​కు చెందిన ముఠా నాయకుడు సుమారు 30 గ్రాముల కడియాన్ని తయారు చేసి దానిపై మూడు లేదా నాలుగు గ్రామాల బంగారు పూత పూస్తాడు. దీంతో అప్రైజర్​ సైతం కనుక్కునే వీలు లేకుండా ప్లాన్​ చేయడంతో వారి పని సులువుగా మారుతుంది. ఇప్పటి వరకు డీసీసీబీ అధికారులకు అందిన సమాచారం ప్రకారం ఈ ముఠాలో మామిళ్లగూడెం, పోలే పల్లి రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, పాత ఎస్సీ ఆఫీసురోడ్లు, లెనిన్​నగర్, ఏదులాపురం, చిన్న తండా, తీర్థాల సమీపంలోని డాక్యాతండాకు చెందిన వారు ఉన్నట్లు బ్యాంక్​ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పదేళ్ల కిందట డీసీసీబీలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఓ అప్రైజర్​ తన అనుచరుల పేరుతో బురిడీ కొట్టించారు. కాగా సోమవారం పోలీసు స్టేషన్లలో డీసీసీబీ అధికారులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఇతర బ్యాంకు​ల్లో సైతం భారీ మోసం

ఈ ముఠా ఒక్క డీసీసీబీ బ్యాంకులోనే కాకుండా ఇతర బ్యాంక్​ల్లో సైతం భారీగా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు సైతం కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు ఇండ్లు, కార్లు కొనుగోలు చేసి జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. బ్యాంక్​ అధికారులు, పోలీసులు అప్రమత్తమై విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed