టీ20 వరల్డ్ కప్ జరగడం అసాధ్యమే : బీసీసీఐ

by Shyam |   ( Updated:2020-04-27 10:23:11.0  )
టీ20 వరల్డ్ కప్ జరగడం అసాధ్యమే : బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రపంచమంతా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు కట్టడిలోనికి వస్తుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ వైరస్ కారణంగా పలు క్రీడా పోటీలు ఆగిపోయాయి. దేశవాళీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు పూర్తిగా నిలిచిపోయింది. బీసీసీఐ తమ ప్రతిష్టాత్మక టోర్నీ ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న మెగా ఈవెంట్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కూడా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఈ మెగా టోర్నీ జరగడం అసాధ్యమేనని బీసీసీఐ అభిప్రాయపడింది. కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గత వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఈ టోర్నీపై ఎలాంటి చర్చ జరపలేదు. టీ20 వంటి మెగా టోర్నీని నిర్వహించాలంటే ఒక్క ఆస్ట్రేలియా దేశం లాక్‌డౌన్ ఎత్తేస్తే సరిపోదని.. దీంతో పాటు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని బీసీసీఐ చెబుతోంది. ఇండియాతో సహా పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు, మార్గ నిర్దేశకాలు వెలువరించే అవకాశం ఉంది. కరోనా తగ్గిన తర్వాత వెలువడే ఈ మార్గదర్శకాలను అనుసరించే టీ20 నిర్వహణ ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే అక్టోబర్‌లో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం దాదాపు అసాధ్యమే అని బీసీసీఐ చెబుతోంది. కొంత మంది జూన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు మొదలవుతాయని చెబుతున్నారు. కానీ, అసలు ఆ ప్రయాణాలు ఎంత మేరకు సురక్షితమో మాత్రం చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా తమ క్రీడాకారులను ఇతర దేశానికి ఎలా పంపుతుందని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బందికి ఎలాంటి ప్రమాదము ఉండబోదని ఐసీసీగానీ, క్రికెట్ ఆస్ట్రేలియా గానీ భరోసా ఇస్తుందా అని బీసీసీఐ ప్రశ్నించింది. ఐసీసీలో కీలక సభ్యత్వ దేశమైన ఇండియానే ఇలాంటి అనుమానాలు లేవనెత్తడం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Tags : Cricket, ICC, BCCI, Cricket Australia, T20 World Cup, Coronavirus, International Flights, Covid 19

Advertisement

Next Story