‘ముఖ్యమంత్రికి 30 లెటర్లు పంపించాం.. ఒక్క దానికీ సమాధానం లేదు’

by Shyam |   ( Updated:2021-08-03 08:01:29.0  )
CPM leader Jahangir
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు పర్యటించినా.. జిల్లావ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. మంగళవారం భువనగిరి సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా సమస్యలపై ఎన్నిసార్లు పోరాడిన ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి, యాదగిరిగుట్టకు కేసీఆర్ పలుమార్లు వచ్చినా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించే గంధమల్ల ప్రాజెక్టుపై నోరు మెదపలేదని విమర్శించారు. జిల్లాలో అధికారులతో సమీక్షలు తప్ప ఆచరణ లేదని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. జిల్లాలో విద్యారంగం, సాగునీటి ప్రాజెక్టులు పెద్ద సమస్యగా ఉన్నాయని గుర్తుచేశారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ముందు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్, జిల్లాలోని మోటకొండూరు మండలం వర్టూర్ గ్రామంలో పల్లెనిద్ర చేసి అనేక హామీలు ఇచ్చారని, కానీ, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినా.. సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రం అభివృద్ధి అధ్వానంగా మారిందని విద్య, వైద్యం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ అవి ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ‘జన చైతన్య పాదయాత్ర’ నిర్వహించి, సుమారు 30 లేటర్లు ముఖ్యమంత్రికి పంపించామని, కనీసం వాటిపై కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే జిల్లా సమస్యలపై సమీక్షా సమావేశం జరపాలని, ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story