కదం తొక్కిన అఖిలపక్ష పార్టీ నాయకులు.. చేతకాని ప్రభుత్వం అంటూ ర్యాలీ

by Sridhar Babu |   ( Updated:2021-09-06 03:32:20.0  )
కదం తొక్కిన అఖిలపక్ష పార్టీ నాయకులు.. చేతకాని ప్రభుత్వం అంటూ ర్యాలీ
X

దిశ, మణుగూరు: పినపాక నియోజక వర్గంలోని మణుగూరు మండలంలో వంద పడకల ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు భారీ ర్యాలీతో కదం తొక్కారు. సోమవారం మండలంలోని లారీ యూనియన్ కార్యాలయం నుంచి టీడీపీ సెంటర్ వరకు వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను వెంటనే నియమించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా పని చేస్తుందని, కోట్ల రూపాయలతో మండలంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి, వైద్యులను నిర్మించకపోవడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ ప్రభుత్వమే పేద ప్రజలను చంపుతోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మండలంలో విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. పేరు కోసమే వందపడకల ఆసుపత్రిని నియమించారని, ప్రజల సమస్యల కోసం కాదని ఈ ర్యాలీ ద్వారా తెలిపారు.

నాలుగు మండల ప్రజలు విషజ్వరాలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో సరైన వైద్యం లేకనే పేదప్రజలు మరణిస్తున్నారని తెలియజేశారు. ఈ మరణాలకు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని తెలిపారు. వంద పడకల ఆసుపత్రిని నియమించారు.. మరి వైద్యులను ఎందుకు నియమించలేదని ఎమ్మెల్యే రేగాను ప్రశ్నించారు. పూర్తిగా రేగా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేశారని, తమ కార్యకర్తలతో పనికిమాలిన విస్తృత పర్యటనలు చేస్తున్నారని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకి రేగా చేసింది ఏమిలేదని, మండలంలో విషజ్వరాలైన డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో చిన్నచిన్నపిల్లలు, ప్రజలు మరణిస్తున్నారు. దీనికి సమాధానం ఎమ్మెల్యే రేగానే చెప్పాలని డిమాండ్ చేశారు.

తన స్వలాభ పనుల కోసమే ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకుంటున్నాడని, ప్రజలపై ఏమాత్రం పట్టింపులేదని ఈ సందర్భంగా తెలిపారు. వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించి ఉంటే మండలంలో ఇన్ని మరణాలు జరిగి ఉండేవా అని ప్రశ్నించారు. మండలంలో ఇంకా ఎంతమంది పేద ప్రజల మరణాలు చవిచూడాలని రేగాను,ప్రభుత్వాన్ని నిలదీశారు. వంద పడకల ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించకపోతే నియోజకవర్గంలో పరిస్థితులు వేరేలాగా ఉంటాయని హెచ్చరించారు. పేద ప్రజల ఆరోగ్యాల కోసం, వంద పడకల ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలని ఉద్దేశ్యంతోనే ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరిని మానుకొని వందపడకల ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని, అలాగే పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా ప్రజలకు ఉపయోగంలేని పర్యటనలు మానుకొని,పేద ప్రజలకోసం పనిచేయాలని, ప్రజల సమస్యలను పట్టించుకోవాలని ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీ నాయకులు కోరారు. లేనిచో నియోజకవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులందరు పాల్గొన్నారు.

Advertisement

Next Story