సీఎం కేసీఆర్ ప్రకటన.. భారీగా పెరిగిన కొవిడ్ మందుల ధరలు

by Anukaran |   ( Updated:2021-05-07 11:08:53.0  )
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధిసోకినా, లక్షణాలున్నా 8 మందులతో కూడిన కొవిడ్ కిట్‌ మందులను వినియోగించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొవిడ్ కిట్‌లకు ఒక్క సారిగా మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. కొవిడ్ కిట్ ధర రూ.522 ఉండగా బ్లాక్ మార్కెట్‌లో వీటిని రూ.2500 వరకు పెంచి అమ్ముతున్నారు. భారీగా డిమాండ్ పెరగడంతో దాదాపుగా అన్ని మెడికల్ దుకాణాల్లో నిల్వలు నిండుకున్నాయి. ఇదే అదునుగా కొన్ని ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తెరలేపాయి. కొవిడ్ వ్యాధి సోకిన వారికి 6.5లక్షల కొవిడ్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదటగా కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చలోకి రాగా కరోనా రోగులకు ఉచితంగా కొవిడ్ కిట్‌లను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వైద్య బృందాలను పంపించి వ్యాధి సోకిన వారికి, వ్యాధి లక్షణాలున్న వారికి కొవిడ్ కిట్‌లను అందించాని ఆదేశాలు ఇచ్చారు. వ్యాధి లక్షణాలున్న వారు 8 మందులతో కూడిన కొవిడ్ కిట్‌లను వినియోగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం ప్రకటనతో ఒక్క సారిగా కొవిడ్ కిట్ మందులకు డిమాండ్ పెరిగి ప్రజలంతా మందులను కొనుగోలు చేసేందుకు మెడికల్ షాపులకు పోటెత్తారు. డిమాండ్‌ను గ్రహించిన మెడికల్ దుకాణాలు, ఏజెన్సలు ఒక్క సారిగా ధరలను భారీగా పెంచాయి.

బ్లాక్ మార్కెట్‌లో కొవిడ్ కిట్ రూ.2500

కరోనా వచ్చినా, రాకపోయినా చాలా మంది ముందస్తు జాగ్రత్తగా కొవిడ్ కిట్ మందులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఒక్క సారిగా ఆ మందులకు డిమాండ్ పెరిగింది. కొవిడ్ కిట్‌లోని డెక్సె సైక్లిన్, పారసిటమాల్, లివోసెటిరిజైన్, రాన్‌టాక్, విటమిన్ సి, మల్టీవిటమిన్, విటమిన్ డి, మెథిల్‌ప్రెడ్నిసోలోనె వంటి 8 రకాల మందులకు ఎంఆర్‌పి ధరల ప్రకారం రూ.522 అవుతుంది. ఈ ధరను ఐదింతలు చేసి బ్లాక్ మార్కెట్‌లో రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొవిడ్ కిట్‌ మందులను ప్రకటించడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.

మెడికల్ దుకాణాల్లో నిండుకున్న నిల్వలు

కొవిడ్ కిట్ మందులను అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో చాలా వరకు మెడికల్ దుకాణాల్లో నిల్వలు నిండున్నాయి. కంపెనీ ఔట్‌లెట్‌గా ఉన్న మెడికల్ దుకాణాల్లో ఒక్క రోజులోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోవడంతో నో స్లాక్ అంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపాయి. మెడికల్ దుకాణాలకు ఏజెన్సీలు మందులను సరఫరా చేయకుండా తాత్కాలిక కొరతను సృష్టిస్తున్నారు. కొవిడ్ రోగులకు తప్పని సరి మందులు కావడంతో విచ్చలవిడిగా ధరలను పెంచి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు.

ప్రభుత్వం 6.5లక్షల కోవిడ్ కిట్‌ల ఏర్పాటు

ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టిన ప్రభుత్వం కొవిడ్ లక్షణాలున్న వారికి ఉచితంగా మెడికల్ కిట్‌లను అందిస్తుంది. ఇందుకోసం ఏజెన్సీల నుంచి 6.5లక్షల మెడికల్ కిట్లను కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో మందుల కొరత ఏర్పడింది. దీంతో మెడికల్ ఏజెన్సీలు ఉన్న కొద్దిపాటి నిల్వలను మెడికల్ దుకాణాలకు సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కొవిడ్ లక్షణాలున్న 19 వేల మందికి కొవిడ్ కిట్‌లను అందించింది. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారికి ఇవ్వకపోవడంతో కొనుగోలు చేసేందుకు మెడికల్ దుకాణాలకు పోటెత్తారు.

Covid drug prices

Advertisement

Next Story