జీతాలు చెల్లించండి.. వర్కర్ల జీవితాలతో ఆడుకోవద్దు

by Sridhar Babu |   ( Updated:2021-08-07 05:34:45.0  )
Covid Centre health workers
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వందపడకల కోవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తోన్న వర్కర్లకు జీతాలు చెల్లించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జిల్లాలోని అఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. శనివారం మండలంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్‌ వర్కర్లు చేపట్టిన నిరాహారదీక్షలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కరోనా సమయంలో సొంత కుటుంబ సభ్యులే దగ్గరకు రావడానికి భయపడుతున్న తరుణంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించామని, అయినా జీతాలు చెల్లించడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లపై పెత్తనం ప్రదర్శించి పనిచేయించుకున్నారు. కానీ, జీతాల విషయంలో మాత్రం ఎగణామం పెట్టారని మండిపడ్డారు.

వర్కర్ల వేతనాలు చెల్లింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. నాలుగు నెలల వేతనాలు తీసుకోకుండా ఏ అధికారైనా పనిచేస్తారా?, ఇది న్యాయమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. వర్కర్ల జీతాల చెల్లింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో తెలియడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు రాణి, మంగమ్మ, భారతమ్మ, జయమ్మ, శైలజ, రాంబాయి, జానకి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed