కోవిడ్.. అరౌండ్ ద వరల్డ్‌..?

by Shyam |
కోవిడ్.. అరౌండ్ ద వరల్డ్‌..?
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాలో వెలుగుచూసిన కోవిడ్ 19(కరోనా వైరస్) ప్రపంచదేశాలను వణికిస్తున్నది. దేశదేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతూ కలవరపెడుతున్నది. హుబెయ్ ప్రావిన్స్‌లో మొదటిసారి కనిపించిన ఈ వైరస్.. క్రమక్రమంగా కార్చిచ్చులా ఇతర దేశాలను కమ్మేస్తున్నది. అంటార్కిటికా ఖండం మినహా అన్ని ఖండాలకు ఈ మహమ్మారి పాకింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 83వేల మందికి ఈ వైరస్ సోకింది. 2,800 మందిని పొట్టనబెట్టుకున్నది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ఈ వైరస్‌తో చైనాలో సుమారు 2,700 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే కనీసం 44 మంది చనిపోయారని ఆ దేశ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. చైనా తర్వాత అత్యధికంగా దక్షిణ కొరియాలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో శనివారం ఒక్క రోజే 813 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తంగా కోవిడ్ 19 సోకినవారి సంఖ్య ఈ దేశంలో 3,150కి చేరింది. ఇటలీ, ఇరాన్ దేశాన్నీ ఈ వైరస్ గజగజలాడిస్తున్నది.

లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో శుక్రవారం తొలిసారిగా ఈ వైరస్‌ బయటపడింది. బ్రెజిల్ దేశానికి ఇప్పటికే ఈ వైరస్ చేరుకుంది. మెక్సికోతోపాటు నైజీరియా, న్యూజీలాండ్, లిథువేనియా, బెలారస్, అజర్‌బైజాన్ కూడా ఆయా దేశాల్లో తొలి వైరస్ కేసులను గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోందని యూఎన్ శుక్రవారం ఆందోళన చెందింది. ఇరాన్, ఇటలీ దేశాలూ ఈ వైరస్‌తో అధికంగా ప్రభావితమవుతున్నాయి. ఇరాన్ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్, ఎంపీలు ఇద్దరికి ఈ వైరస్ సోకడం గమనార్హం. అధికారికంగా ఈ వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 30 నుంచి 40 మధ్య చెబుతున్నా.. వీరి సంఖ్య 210కి చేరినట్టు ఆస్పత్రివర్గాలు తెలిపాయి.

వైరస్‌ను అరికట్టేందుకు ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. చైనా నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిషేధిస్తున్నాయి. ఇటలీ, ఇరాన్‌లాంటి దేశాల నుంచి వస్తున్నవారినీ జాగ్రత్తగా పరిశీలించి.. ఒంటరిగా అబ్జర్వేషన్‌లో పెడుతున్నారు. చైనా తర్వాత ఎక్కువమందికి వైరస్ సోకిన దక్షిణ కొరియాకు పొరుగుదేశమైన.. ఉత్తర కొరియా దేశాధినేత ఏకంగా వైరస్‌ను అరికట్టడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను ఆదేశించడం గమనార్హం.

Advertisement

Next Story