మరోసారి కాల్ మనీ కలకలం.. దారుణానికి ఒడిగట్టిన దంపతులు

by srinivas |   ( Updated:2021-12-20 09:08:45.0  )
attempts suicide
X

దిశ, ఏపీ బ్యూరో : కర్నూలు జిల్లా నంద్యాలలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక నూర్ బాషా, షాహిన్ అనే దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేకనే చనిపోవాలనుకుంటున్నామని నూర్ బాష దంపతులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

Suicide note

కుటుంబ అవసరాల కోసం నూర్ బాష స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపు రూ.20 లక్షల దాకా అప్పులు చేశాడు. నూటికి వారానికి పది రూపాయల చొప్పున అప్పులు తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారుల వద్దనే చీటీలు వేసి కొంత వరకు అప్పులు తీర్చాడు. కానీ కుటుంబ సమస్యల వల్ల అప్పులు తీర్చలేక పోయాడు. దీంతో చేసిన అప్పులు తీర్చడం భారంగా మారిన తరుణంలో భార్యా ఇద్దరు పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే భార్య షాహిన్ పిల్లలతో పాటు సూసైడ్ చేసుకోవడాన్ని నిరాకరించింది. దీంతో సోమవారం భార్యా భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు సేవించారు.

ప్రస్తుతం దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వడ్డీ వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్లు వేధించారని వాపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story