టీకా కొనుగోళ్ల దందా

by Shamantha N |
టీకా కొనుగోళ్ల దందా
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు టీకా కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఆరోపణలు చేశారు. శనివారం మీడియాతో సమావేశమైన ఆయన పంజాబ్, రాజస్తాన్ ప్రభుత్వాలపై విమర్శలు సంధించారు. పంజాబ్‌లో టీకా పంపిణీని పర్యవేక్షిస్తున్న వికాస్ గార్గ్ మే 29న అందించిన వివరాలను కేంద్ర మంత్రి ఉటంకించారు. 4.29 లక్షల కొవిషీల్డ్ డోసులను రూ. 13.25 కోట్లకు పంజాబ్ ప్రభుత్వం విక్రయించిందని, అంటే డోసుకు సగటున రూ. 309 చెల్లించిందని వివరించారు. 14,190 కొవాగ్జిన్ డోసులను రూ. 4.70 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని తెలిపారు. కానీ, వీటిని డోసుకు వెయ్యి రూపాయలకు మించిన ధరతో ప్రైవేటు హాస్పిటళ్లకు విక్రయించిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం 50 శాతం టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందిస్తున్నదని అన్నారు. కానీ, ఈ టీకాల కొనుగోళ్ల ద్వారా ప్రతిపక్ష రాష్ట్రాలు డబ్బులు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఇది సిగ్గుచేటు అని, సీఎం అమరిందర్ సింగ్ ప్రభుత్వం ఎంతటి బలహీనమైనదో వెల్లడిస్తున్నదని అన్నారు. తాము ఈ వ్యవహారాన్ని లేవనెత్తిన తర్వాతే సీఎం అమరిందర్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు.

అంటే, పంజాబ్ ప్రభుత్వ వ్యవహారంలో కుత్సిత బుద్ధి ఉన్నదని తెలుస్తున్నదని వివరించారు. ఈ వ్యవహారంపై మాట్లాడుతూనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. దేశంలో చిన్నారులకు టీకాలేవని రాహుల్ అడుగుతుంటారని అన్నారు. ఆ వ్యాక్సిన్‌లు రాజస్తాన్ చెత్తకుప్పల్లో ఉన్నాయని, అవే వ్యాక్సిన్‌లపై పంజాబ్ ప్రభుత్వం సొమ్ముచేసుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed